సుదీర్ఘ రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు తప్పటడుగు వేశారు. అది కూడా కీలకమైన ఎన్నికల సమయంలో. కలిసొచ్చిన రాజకీయ అవకాశాన్ని అస్త్రంగా చేసుకుని కూటమిపై వైసీపీ గట్టిగా ప్రయోగించింది. టీడీపీతో సహా జనసేన, బీజేపీ నేతలు బెంబేలెత్తారు. ఎన్నికల్లో నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందని కూటమి పార్టీల నేతలు భయపడుతున్నారు.
ఈ నెల ఒకటో తేదీన వలంటీర్లతో పింఛన్ పంపిణీ చేయకూడదని ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. వలంటీర్ల వద్దనున్న సెల్‌ఫోన్లను ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశాల్లో ఎన్నికల సంఘం ఆదేశించింది. వలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయకూడదని ఫిర్యాదు చేసింది నిమ్మగడ్డ రమేశ్‌కుమార్. ఈయన ఎవరో జేబులో అధికారో అందరికీ తెలిసిందే.
ఈ పరిణామాల్ని వైసీపీ వ్యూహాత్మకంగా తనకు అనుకూలంగా మలుచుకుంది. రాజకీయాల్లో ఇదే ముఖ్యం. అందులోనూ ఎన్నికలకు 40 రోజుల సమయం ఉండగా, చంద్రబాబునాయుడు చేసిన తప్పును వైసీపీ ఎందుకు విడిచి పెడుతుంది? చంద్రబాబునాయుడే తన మనిషైన నిమ్మగడ్డతో పెన్షన్లను ఇంటి వద్దకెళ్లి వలంటీర్లు పంపిణీ చేయకూడదనే ఆదేశాలు ఇప్పించడంపై పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లారు.
ఈ నెల 3వ తేదీ నుంచి సచివాలయాల వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. సచివాలయాల వద్దకు వృద్ధులు, వికలాంగులు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని వెళ్లాల్సి వస్తోంది. చంద్రబాబునాయుడి దుర్మార్గ చర్యల వల్లే తమకు కష్టాలొచ్చాయని భావిస్తున్న పెన్షనర్లు ఆయన్ను తిట్టని తిట్టు లేదు. బాబుకు శాపనార్థాలు పెడుతున్నారు. ఇలాగైతే అధికారంలోకి ఎలా వస్తావంటూ ప్రశ్నిస్తున్నారు.
పెన్షనర్ల శాపనార్థాలకు ముఖ్యంగా టీడీపీ నేతలు భయపడుతున్నారు. బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండడంతో, రేపు పోలింగ్ బూత్‌లలో వెళితే ఏం చేస్తారో అని ఆందోళన చెందుతున్నారు. అనవసరంగా పెన్షనర్లతో కెలుక్కున్నామని పశ్చాత్తాపం చెందుతున్నారు.