పచ్చగూటిలో అదే చిలక.. అవే పలుకులు!

ఎన్నికల వ్యూహకర్తగా ముద్రపడి వందల కోట్ల వ్యాపారాన్ని బ్లాక్ లోను, వైట్ లోను అనేకానేక సంస్థల ముసుగులో అనేకానేక పార్టీలకు పనిచేస్తూ, చేయిస్తూ ఉండే ప్రశాంత్ కిషోర్.. చిత్తశుద్ధితో, నిజాయితీతో మాట్లాడుతారనే నమ్మకం ప్రజలకు…

ఎన్నికల వ్యూహకర్తగా ముద్రపడి వందల కోట్ల వ్యాపారాన్ని బ్లాక్ లోను, వైట్ లోను అనేకానేక సంస్థల ముసుగులో అనేకానేక పార్టీలకు పనిచేస్తూ, చేయిస్తూ ఉండే ప్రశాంత్ కిషోర్.. చిత్తశుద్ధితో, నిజాయితీతో మాట్లాడుతారనే నమ్మకం ప్రజలకు ఏనాడో పోయింది.

ఒక పార్టీకి కొమ్ము కాస్తూ వారితో డీల్ లో ఉన్నప్పుడు వారి భజన చేస్తూ.. తన మాటలను కూడా వారిని గెలిపించడానికి ఒక వ్యూహంలాగా వాడుతూ ఉండే వ్యక్తి ప్రశాంత్ కిశోర్. అలాంటి పీకే.. కొన్ని నెలల కిందట చంద్రబాబునాయుడుతో గంటన్నరకు పైగా భేటీ అయి.. నన్ను ఎన్నికలకు పనిచేయమని అడిగారు గానీ.. నేను ఇప్పుడు అలాంటి పనులు చేయడం లేదని చెప్పాను.. అనే మాయ మాటలను ప్రజల ముందు వల్లించారు. కానీ.. ప్రశాంత్ కిశోర్.. ఏనాడైతే చంద్రబాబును కలిశారో అదే రోజు పచ్చగూటి చిలకగా మారిపోయారని ప్రజలు గుర్తించారు.

పీకే ఇప్పుడు పీటీఐ వార్తాసంస్థకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ.. ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలవడం కష్టం అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత పీకే ఇలాంటి చిలకజోస్యం చెప్పడం ఇది రెండోసారి! గతంలో కూడా ఇండియా టుడే నిర్వహించిన ఒక కార్యక్రమంలో జగన్ గెలిచే అవకాశం లేదని పీకే వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా ప్రజలకు సమస్తం సమకూర్చే ప్రొవైడర్ మోడ్ లోనే జగన్ ఉండిపోయారంటూ.. పీకే చెప్పుకొచ్చారు.

అయితే తమాషా ఏంటంటే.. 2019 ఎన్నికల నుంచి ప్రశాంత్ కిశోర్ ప్రచార దళాలు వైఎస్సార్ కాంగ్రెస్ కోసం రాష్ట్రంలో పనిచేస్తూనే ఉన్నాయి. జగన్ వ్యూహాలు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా తీసుకున్న కొన్ని నిర్ణయాల వెనుక ప్రశాంత్ కిశోర్ సలహాలు కూడా ఉన్నాయనే పుకారు ఉంది. ఆ డీల్ మొత్తాన్ని తన బినామీ పేర్ల మీదికి మార్చేశారేమో గానీ.. చంద్రబాబుతో కొత్త డీల్ కుదుర్చుకున్నట్టుగా ఉంది.

తెలుగుదేశాన్ని గెలిపించడం తనకు సాధ్యం కాదు గానీ.. కావలిస్తే.. జగన్ ఓడిపోతాడంటూ నాలుగు మాయమాటలు చెప్పి.. ఏపీ ప్రజల ఆలోచనల్ని ఆదిశగా డైవర్ట్ చేస్తానని.. ఆ తర్వాత మిగిలిన పరిణామాలను మీకు అనుకూలంగా మలచుకోవడం మీ బాధ్యత అని.. చంద్రబాబుతో డీల్ కుదుర్చుకున్నట్టుగా ఉంది. అందుకే పచ్చగూటి చిలకగా మారిన తర్వాత.. ఇలా జగన్ ఓటమికోసం జోస్యం చెప్పడం ప్రారంభించారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.