వాలంటీర్లపై నిమ్మగడ్డ సరికొత్త కుట్ర!

58 నెలలుగా ఇంటివద్దనే ఒకటోతేదీ నాటికి కాలు కదిపే అవసరం లేకుండా పింఛను తీసుకుంటున్న అవ్వాతాతలందరూ ఇవాళ రోడ్డునపడ్డారంటే, వికలాంగులు సహా పింఛను డబ్బులు అందుకోడానికి నానా యాతనలు పడ్డారంటే.. దాదాపు ముప్పయి మందికి…

58 నెలలుగా ఇంటివద్దనే ఒకటోతేదీ నాటికి కాలు కదిపే అవసరం లేకుండా పింఛను తీసుకుంటున్న అవ్వాతాతలందరూ ఇవాళ రోడ్డునపడ్డారంటే, వికలాంగులు సహా పింఛను డబ్బులు అందుకోడానికి నానా యాతనలు పడ్డారంటే.. దాదాపు ముప్పయి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే.. ఆ పాపంలో చంద్రబాబునాయుడు వాటా ఎంత ఉన్నదో.. అంతకంటె ఎక్కువ వాటా కలిగి ఉన్న వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్. సిటిజన్ ఫోరమ్ ఫర్ డెమాక్రసీ అనే ఒక ముసుగు సంస్థను తయారు చేసుకుని.. చంద్రబాబునాయుడుకు మేలు చేయడానికి బినామీ రాజకీయాలు నడుపుతున్న వ్యక్తి ఆయన!

చంద్రబాబు నాయుడు చేతికి మట్టి అంటనివ్వకుండా ప్రజోపయోగంగా ఉన్న వ్యవస్థలను సర్వనాశనం చేసేసి.. జగన్ సర్కారుకు చెడ్డపేరు తేవాలని కుట్రలు పన్నుతున్న వ్యక్తి ఆయన. సదరు నిమ్మగడ్డ రమేష్ కుమార్.. వాలంటీర్లను టార్గెట్ చేసినట్టుగా ఇప్పుడు ఒక సరికొత్త కుట్రకు తెరలేపారు.

వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసినా సరే.. వారు పోలింగ్ బూత్ లలో ఎన్నికల ఏజంట్లుగా కూర్చోవడానికి వీల్లేదట. వాలంటీర్లుగా ఈ 58 నెలల్లో ఏ కొద్దికాలమైనా పనిచేసిన ఎవ్వరూ కూడా పోలింగ్ ఏజంట్లుగా కూర్చోకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలంటూ.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి మరో లేఖ రాశారు. రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకే జగన్మోహన్ రెడ్డి వాలంటీరు వ్యవస్థను ఏర్పాటుచేశారట. అందుచేత వారిని కట్టడి చేయాలని ఆయన పితూరీ పెడుతున్నారు.

ఇవాళ పింఛన్ల కోసం వచ్చిన అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోయారంటే.. ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అసలు కారకుడు. ఆయనను తెరవెనుక నుంచి కీ ఇచ్చి నడిపించిన సూత్రధారి చంద్రబాబునాయుడు. ఆయన తాజా కుట్ర ఎంత ఘోరంగా ఉన్నదంటే.. వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసినా సరే.. వారు పోలింగ్ ఏజంట్లుగా కూర్చోవడానికి వీల్లేదట. ఒక వ్యక్తికి ఉండే ప్రాథమిక హక్కులను హరించేమాదిరిగా ఉన్న ఇటువంటి అయిడియాలు, రాజ్యాంగ విరుద్ధమైన కుట్రలు, ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రలోకి ఎలా వస్తున్నాయో మరి?

నిన్నటిదాకా ఒక ప్రభుత్వోద్యోగంలో ఉండి, ఇవాళ రాజీనామా చేసిన వ్యక్తులు.. రేపు తెల్లారేసరికి ఏదో ఒక పార్టీ తరఫున అభ్యర్థిగా మారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అలాంటిది.. వాలంటీర్లు వంటి చిరుద్యోగులు.. తమ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కూడా కనీసం పోలింగ్ ఏజంట్లుగా కూడా కూర్చోరాదనడం ఏరకంగా కరెక్టు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి వాలంటీరుగా పనిచేసినంత మాత్రాన.. మానేసిన తర్వాత కూడా వారి వ్యక్తిగత జీవితం మొత్తాన్నీ హరించేస్తారా? అని విమర్శిస్తున్నారు.