ప్రజాజీవితంలో ఉండడం అంటే నిత్యం ఏసీల్లో బతుకుతూ, ప్రెస్ నోట్లు విడుదల చేయడం కానే కాదు. ఎండా వానా లెక్క చేయకుండా ప్రజల్లో తిరగగలగాలి. రెండు రోజులు ఎండల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేసరికి.. వడదెబ్బ కొట్టినట్లయి అనారోగ్యంతో నాలుగైదు రోజులు ఇంటికి పరిమితం అయిపోయారు పవన్ కల్యాణ్.
తాజాగా ఆదివారం నాడు ఆయన తన వారాహి యాత్ర రెండో షెడ్యూలును ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మీద చాలా సహజమైన విమర్శలు అనేకం చేశారు. అయితే పనిలో పనిగా రాష్ట్రప్రజలకు తన తరఫున కొత్త వరాలను కూడా పవన్ ప్రకటించారు.
నూకాలమ్మ పండగను రాష్ట్రపండుగగా నిర్వహించడం, అనకాపల్లి బెల్లంకు అంతర్జాతీయ మార్కెట్ తేవడం వంటి వరాలు ఆయన ప్రకటించారు. అయితే విశాఖ ఉక్కు సమస్యను పరిష్కరించడానికి కూడా కూటమి కృతనిశ్చయంతో ఉన్నదని పవన్ కల్యాణ్ సెలవిచ్చారు. సరిగ్గా ఈ పాయింటు దగ్గరే ప్రజలకు అనేక సందేహాలు కలుగుతున్నాయి.
విశాఖ ఉక్కును ప్రెవేటీకరించాలని కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయించింది. మోడీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందులో మార్పు తీసుకురావడం అంత ఈజీయేం కాదు. అందుకే చంద్రబాబునాయుడు ఆ విషయంలో వేలుపెట్టకుండా జాగ్రత్త వహించారు. కానీ అవగాహన అంతగా ఉండని పవన్ కల్యాణ్ మాత్రం.. విశాఖ వెళ్లి.. అక్కడ ప్రెవేటీకరణ ఆలోచనకు వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్న ఉద్యమకారులకు మద్దతు ప్రకటించి.. గప్పాలు కొట్టారు. తాను కేంద్రంతో మాట్లాడి ప్రెవేటీకరణ ఆపుచేయిస్తానని ప్రగల్భాలు పలికారు. ఆ ఉద్యమానికి ఆయన మద్దతు ఆ ఒక్కరోజుతో అయిపోయింది. ఆయన ధైర్యంగా విశాఖ వాసుల గళాన్ని కేంద్రంలోని పెద్దలకు తెలియజెప్పారో లేదో తెలియదు. లేదా, వారు పట్టించుకోకుండా విస్మరించారేమో తెలియదు.
ఇప్పుడు ఎన్నికల సీజను వచ్చిన తర్వాత.. విశాఖ ఉక్కు పేరుతో మభ్యపెట్టాలని చూస్తున్నారు. అందుకే ప్రజలు పవన్ ను ఒకే ప్రశ్న సూటిగా అడుగుతున్నారు. విశాఖ ఉక్కు ప్రెవేటీకరణ విషయంలో.. ఎలాంటి నిర్ణయం కూటమి తీసుకోవాలనుకుంటున్నదో, ఎలా వారికి న్యాయం చేయాలనుకుంటున్నదో.. మోడీతో పవన్ ఒక మాట చెప్పించగలిగితే బాగుంటుంది.
నిర్ణయం మోడీ చేతుల్లో ఉండగా.. ఇక్కడ పవన్ పసలేని వాగ్దానాలు చేయడం దండగ. ఎటూ వీరి కూటమిలో బిజెపి కూడా ఉన్నది కాబట్టి.. వారితో ఒక మాట చెప్పిస్తే బాగుంటుందని ప్రజలు అంటున్నారు. విశాఖ ఎంపీ సీటు మీద బిజెపి పెద్దలకు ఎంత కోరిక ఉన్నప్పటికీ.. కేవలం విశాఖ ఉక్కు కారణంగా అక్కడ గెలిచే చాన్సులేదని విరమించుకున్న సంగతి పవన్ కు తెలుసో లేదో అని జనం నవ్వుకుంటున్నారు.