సినిమా హిట్టయితే హీరోను తోపు అంటారు. ఫ్లాప్ అయితే హీరోయిన్ ను ఐరెన్ లెగ్ అంటారు. టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా ఇదే పరిస్థితి. ఈ పద్ధతి మారాలంటోంది కృతి సనన్.
సినిమా హిట్టయినప్పుడు పరిశ్రమలో ఒకరినొకరు పైకి పొగుడుకోవడం కంటే, నిజాయితీగా తప్పొప్పులు బేరీజీ వేసుకోవడం ముఖ్యం అంటోంది. మరీ ముఖ్యంగా సినిమా సక్సెస్ అంటే, నటీనటుల వర్క్ పై మాట్లాడితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
“నన్ను బాధించే కామెంట్స్ చాలానే చూశాను. ఓ సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా దానికి కేవలం హీరో మాత్రమే బాధ్యుడు కాదు. అది టీమ్ వర్క్. ఈ విషయాన్ని గుర్తించినరోజున సక్సెస్ అయినప్పుడు నటీనటులు, టెక్నీషియన్స్ వర్క్ గురించి మాట్లాడతారు. కానీ అలా జరగడం లేదు. కొన్ని సార్లు సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు హీరోయిన్లపై త్వరగా నిందలేస్తారు. ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తారు. దాని బదులు కూర్చొని తప్పొప్పులు మాట్లాడుకుంటే మంచిది కదా.”
గతంలో తన సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు అంతా తనను విపరీతంగా ట్రోల్ చేశారని.. అందుకే సక్సెస్ సాధించినప్పుడు తను అంతగా ఎంజాయ్ చేయలేనని అంటోంది కృతి. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వర్క్-కంటెంట్ గురించి మాట్లాడినప్పుడు ఇండియన్ సినిమా మరో స్థాయిలో ఉంటుందని అంటోంది.