Advertisement

Advertisement


Home > Politics - Opinion

థర్డ్ పార్టీ ఎవరికి లాభం?

థర్డ్ పార్టీ ఎవరికి లాభం?

పార్టీలు పరస్పరం తలపడుతుంటాయి. ఏపీ రాజకీయాల్లో ఒక్క పార్టీతో మూడు పార్టీలు కూటమిగా కూడా తలపడుతుంటాయి. ప్రత్యర్థి దుర్మార్గుడు అని, తాము మాత్రమే సచ్ఛరిత్రులమని, తమంతటి సేవాపరాయణులు ప్రపంచంలో మరొకరు ఉండరని.. ఇరుపక్షాలూ అదే పనిగా ఊదరగొట్టేస్తుంటాయి. ఆయా పార్టీల‌పై అభిమానంతో వెర్రెత్తిపోయే ఉండే జనాలు.. ఆ వాదనలను నమ్ముతూ, మరింతగా ప్రజల్లోకి ప్రచారం చేస్తూ గడిపేస్తుంటారు.

మరి, ఇరుపక్షాల మధ్య సమరం జరుగుతున్నప్పుడు.. ‘థర్డ్ పార్టీ’ కూడా ఉంటుంది. ఏపార్టీ ముద్ర కూడా లేకుండా ఉండే.. జనాదరణ కలిగిన, జనంలో గుర్తింపు ఉన్న వ్యక్తులు వీరు. ఇలాంటి వారు చెప్పే అభిప్రాయాలకు ఎంతో కొంత విలువ ఉంటుంది. ఇప్పుడు ఏపీ రాజకీయ యవనిక మీద ఈ థర్డ్ పార్టీ ఉద్ధండులు ఎవరు? ఎవరు ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నారు? ఎవరి మాటలకు ప్రజల్లో విశ్వసనీయత ఉంది. అంతిమంగా ‘థర్డ్ పార్టీ- ఎవరికి లాభం?’ అనేదే.. ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ.

ఎన్నికల సమరాంగణంలో ప్రతి ఒక్క ఓటు కూడా పార్టీలకు చాలా విలువైనది. ప్రతి ఒక్క ఓటును తమ వైపు తిప్పుకోవడానికి వారు నానా యాతన పడుతుంటారు. అనేక రకాల ఎత్తుగడలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఎత్తుల్లో ఫలించేది కొన్ని మాత్రమే. కొత్తగా ఆయా పార్టీల బలసంపదలోకి చేరే ఓటర్లు కొద్ది సంఖ్యలో మాత్రమే ఉంటారు. ఆ కొద్ది మందికోసం జరిగే ప్రయత్నాలే అధికం. సాధారణంగా ప్రతి పార్టీకి కూడా నిర్దిష్టమైన ఓటు బ్యాంకు ఉంటుంది. అలాంటి ఓటు బ్యాంకుకు కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు కూడా ప్రాతిపదిక అయి ఉంటాయి.

కొందరు నాయకుల మీద ఉండే అభిమానం కారణంగా కూడా ఆయా పార్టీలకు కరడుగట్టిన అభిమానులుగా, ఓటు బ్యాంకుగా ప్రజలు మారిపోయి ఉంటారు. వీరికి తాము నమ్మే పార్టీల పట్ల తీవ్రమైన అభిమానాలు, ప్రత్యర్థి పార్టీ పట్ల తీవ్రమైన దురభిమానాలు ఉంటాయి. నాయకులు కూడా తిట్టుకోనంత తీవ్రంగా వీరు తిట్టుకుంటూ ఉంటారు. తమ నాయకులు ప్రచారంలో పెట్టే సంగతులను వీరు ప్రజల్లోకి మోసుకెళ్లడానికి ఉపయోగపడుతూ ఉంటారు. స్థిరంగా చీలిపోయి ఉండే ఈ ఓటు బ్యాంకులను మినహాయిస్తే.. ఇంత గట్టి అభిమానంతో పార్టీకి కట్టుబడి ఉండని.. మూడో వర్గానికి చెందిన మిగిలిన ప్రజలను ప్రభావితం చేయడమే ఇక్కడ పార్టీల లక్ష్యం కూడా.

పార్టీలు ఎంత హోరాహోరీ విమర్శలు చేసుకున్నా సరే.. ఈ మూడోవర్గం ఓటర్ల మీద కించిత్తు ప్రభావం ఉండదు. నాయకులు నిర్వహించే బహిరంగసభలకు లక్షల్లో జనం హాజరైనా సరే.. వారిలో మెజారిటీ ఆయా పార్టీల మనుషులే. వారు ఎటొచ్చీ ఆ పార్టీకే ఓటు వేస్తారు. మిగిలిన వారు కిరాయికి వచ్చేవారు. వారు చివరినిమిషం దాకా ఎటూ తేల్చుకోరు.

ఇక పోతే.. ఆలోచించి ఓటు వేసే.. ముందుగానే.. తాము ఏదో ఒక  పార్టీ ముద్రతో లేకుండా ఉండే వారి గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడుకోవాలి. పార్టీల నాయకులు ఎన్ని సొంత డబ్బా మాటలు చెప్పినా, ఎదుటి వారి మీద ఎంతగా బురద చల్లినా ఈ మూడోవర్గం మీద ప్రభావం ఉండదు. వారివన్నీ స్వార్థ వచనాలుగానే వారు పరిగణిస్తుంటారు. కేవలం ఈ మూడోవర్గం ఓటర్ల కోసం పార్టీలు కూడా ‘థర్డ్ పార్టీ’ ఉద్ధండుల మీద ఆధారపడుతుంటాయి. ఏ పార్టీ ముద్ర తమ మీద లేకుండా.. సెలబ్రిటీ హోదాలో ఉండేవాళ్లు అనేక మంది ఉంటారు. వారు రాజకీయాల గురించి మాట్లాడితే ప్రజల్లో వారి మాటకు కాస్త విలువ ఉంటుంది. వారు చెప్పే మాటలతు, చేసే పనులు పార్టీలకు ఉపయోగపడుతుంటాయి. పార్టీకి అదనపు ఓట్లను రాబట్టుకోవడానికి వీరు కీలకం అని అనుకోవచ్చు.

తెలుగుదేశానికి నిమ్మగడ్డ, జేపీ

తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా గళం వినిపించడంలో లోక్ సత్తా పార్టీని స్థాపించి వదిలేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్, అలాగే మరో సీనియర్ ఐఏఎస్ అధికారి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రధానాధికారిగా కూడా గతంలో పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇద్దరూ ఉన్నారు. నిజం చెప్పాలంటే.. ఎన్డీయే కూటమి రూపంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల్లో వీరి అనుకూలత తెలుగుదేశం వైపే ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు ప్రాక్టికల్ గా మాట్లాడుతూ ఉండే  జయప్రకాశ్ నారాయణ్ గతంలో మోడీ సర్కారుకు అనుకూలంగా కూడా ఎన్నికల సమయంలో చాలా మాట్లాడేవారు గానీ.. ఇప్పుడు అచ్చంగా తెలుగుదేశం చంద్రబాబునాయుడు పాలన అవసరాన్ని మాత్రమే ప్రజలకు వివరించే పనిని భుజానికెత్తుకున్నారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సన పనిలేదు. ఆయన ప్రధాని ఎన్నికల అధికారిగా పనిచేస్తున్నప్పుడు గానీ, ఐఏఎస్ గా రాష్ట్రంలో వివిధ హోదాల్లో ఉన్నప్పుడు గానీ.. పచ్చకండువా భుజాన వేసుకోని కార్యకర్తలాగానే వ్యవహరిస్తూ ఉండేవారు. ఈ ఇద్దరు థర్డ్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం కోసం పనిచేయడం వెనుక ప్రధానమైన కారణం ‘కులం’ అనే మాట ప్రబలంగా వినిపిస్తూ ఉంటుంది. ఈ ఇద్దరు కూడా చంద్రబాబునాయుడు యొక్క సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం.

ప్రస్తుతం రాష్ట్రంలో అతిపెద్ద రగడగా మారిపోయిన పెన్షన్ల పంపిణీ వ్యవహారానికి మూల కారకుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రమే. గతంలో ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసిన ఆయన  ఇప్పుడు సిటిజన్ ఫరం ఫర్ డెమాక్రసీ అనే సంస్థను పెట్టుకున్నారు. డెమాక్రసీ ముసుగులో జగన్ వ్యతిరేకతను ప్రజల్లోకి విషంలా వ్యాపింపజేయడానికి పుట్టిన సంస్థ ఇది. పారదర్శక ఎన్నికల ముసుగులో వైఎస్సార్ సీపీ ని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు రావడానికి పాటుపడుతూ ఉండే సంస్థ ఇది. ఆ ఉద్దేశంతోనే నిమ్మగడ్డ స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు.

వృద్ధులకు పింఛన్ల పంపిణీ చేసే విషయంలో వాలంటీర్లను ఈ రెండునెలల పాటూ వాడుకోకూడదని, వాలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నందున వారిద్వారా పింఛన్లను పంపిణీ చేయించడం వలన వారు లబ్ధిదారులను ప్రలోభాలకు గురిచేసే ప్రమాదం ఉన్నదని నిమ్మగడ్డ లేఖలో పితూరీ పెట్టారు. అర్థరహితమైన ఆరోపణ ఇది. ఎందుకంటే.. జగన్ తన సభలలో చెబుతున్నట్టుగా 58 నెలలనుంచి పింఛన్లు ఇస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసు. మాట ప్రకారం పెంచిన పింఛన్లు ఇస్తున్నది ఎవరో, ఇంటివద్దకే నగదు రూపంలో ఒకటోతేదీనాటికే పింఛన్లు అందే ఏర్పాటు చేసినది ఎవరో ప్రజలకు తెలుసు. వారిని కొత్తగా ప్రలోభపెట్టేంత ఏముంటుంది? అనేది జనం సందేహం.

ఏది ఏమైనప్పటికీ.. వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు హఠాత్తుగా పోవడం వలన.. వ్యవస్థ మొత్తం తల్లకిందులైంది. ఈరోజు పింఛన్లు తీసుకోవడానికి రోడ్ల మీదకు వచ్చి పదు లసంఖ్యలో ముసలివాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారంటే.. కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఆయనను థర్డ్ పార్టీగా వాడుకుంటూ తెరవెనుక నుంచి నడిపించిన చంద్రబాబునాయుడు కారణం.

అందుకే చంద్రబాబునాయుడు నష్టనివారణ కోసం రోజుకో రకం మాటలతో నయవంచనకు పాల్పడుతున్నారు. ఇళ్ల వద్ద ఇవ్వద్దు అని ఈసీ చెప్పలేదని, జగన్ కావాలని జనాన్ని రోడ్డు మీదకు రప్పిస్తున్నారని.. తన చేతికి నెత్తరు అంటకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. పింఛను కష్టాల విషయంగా ఏ ఒక్కకరు కొత్తగా ఇబ్బందులు పడినా.. కొత్తగా అసహ్యించుకున్నా.. లబ్ధిదారుల వర్గంలో లేకపోయినప్పటికీ.. పించనుదార్లను ఇబ్బంది పెడుతున్నకారణంగా.. తటస్థులు ఎవరైనా అసహ్యించుకున్నా కూడా.. వారు చంద్రబాబును మాత్రమే అసహ్యించుకునే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. చంద్రబాబునాయుడు ఏదో అనుకుని.. వాలంటీర్లను కట్టడిచేసేస్తున్నా అనే భ్రమతో నిమ్మగడ్డ ద్వారా ఈ కుట్ర చేశారు గానీ.. అది బూమరాంగ్ అయింది.

సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ కూడా తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసే ఒక థర్డ్ పార్టీ మేధావి అనుకోవాలి. గత ఎన్నికల్లో జనసేనలో ఉండి ఎంపీగా పోటీచేసి భంగపడిన ఆయన.. ఆయన ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన ఏం చేస్తున్నారో తెలియదు గానీ.. ఆయన సూచనలు మాత్రం.. తెలుగుదేశం విజయాన్ని కాంక్షించేవీ, జగన్ పతనాన్ని ఆశించేవీ. ఆయన ఏకంగా వాలంటీర్లు అనే చిరుద్యోగులను ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉండే రెండు నెలల పాటూ.. దూర ప్రాంతాలకు బదిలీ చేయాలని సూచిస్తున్నారు. రాయలసీమనుంచి ఉత్తరాంధ్రకు, అటునుంచి ఇటుకు వాలంటీర్లను బదిలీచేసి పని జరిపించాలంటున్నారు. కుత్సితమైన వీరి మాటలన్నీ చూడడానికి తటస్థంగా కనిపిస్తూ తెలుగుదేశం విజయం కోసం పాటుపడేవి.

వైఎస్సార్ కాంగ్రెస్ కోసం

నిజం చెప్పాలంటే వైసీపీ కోపం పనిచేస్తున్న థర్డ్ పార్టీ వ్యవస్థలు, వ్యక్తులు లేరనే అనాలి. ఉంటే చాలా తక్కువ. కేవలం ఒకరిద్దరు జర్నలిస్టులు, ప్రజల్లో బాగా గుర్తింపు ఉన్నవారు. నిష్పాక్షికంగా మాట్లాడే మాటలు కొన్ని వైసీపీకి అనుకూలంగా అనిపించవచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వీరిలో ముఖ్యమైన వారు. నాగేశ్వర్ తన సొంత యూట్యూబ్ చానెల్ ద్వారా అనేక విషయాలను విశ్లేషిస్తూ ప్రజలను జాగృతపరిచే ప్రయత్నం చేస్తుంటారు.

అయితే నాగేశ్వర్ మాటలు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ కోటరీ ఊరుకుంటున్నది గానీ.. ఆయన మాటలు జగన్ పాలనకు కితాబిచ్చిన రోజున పచ్చ మీడియా రెచ్చిపోతుంటుంది. తనను గెలిపిస్తే ప్రజలందరికీ నాణ్యమైన మద్యం అందిస్తా అనే అత్యంత అసహ్యమైన హామీ ఇచ్చినందుకు చంద్రబాబునాయుడును నాగేశ్వర్ విమర్శించారు. ఏ పార్టీ అయినా సరే.. ‘నాణ్యమైన మద్యం అందిస్తాం’ అనే హామీ ఇవ్వడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. అయితే.. తటస్థులు ఎవరైనా సరే.. చీదరించుకునే సంగతి అది. అయితే దానిని కూడా పచ్చమీడియా ఓర్వలేకపోయింది. ఆయనను తీవ్రంగా విమర్శిస్తూ డిబేట్లు నిర్వహించారు.

తెలకపల్లి రవి వామపక్ష నేపథ్యం ఉన్న సీనియర్ జర్నలిస్టు. ఆయన నిష్పాక్షిక వ్యాఖ్యలు పచ్చమీడియా కు మాత్రం విషంలా కనిపిస్తుంటాయి. కానీ రవి వ్యాఖ్యలు కూడా ప్రజలను ఆలోచింపజేస్తుంటాయి.

నిజానికి ఉండవిల్లి అరుణ్ కుమార్ లాంటి మేధావులను కూడా థర్డ్ పార్టీ కింద వైఎస్సార్ సీపీ వాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ జగన్ ఆ దిశగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపించడం లేదు. ఎప్పుడు గానీ.. తటస్థ ఓటర్లను ఎంతగా తమవైపు ఆకర్షించామా అనేది ప్రధానం. అలాంటప్పుడు ఒక్క ఉండవిల్లి మాత్రమే కాదు. తటస్థంగా కనిపించే వారిని ఎంతగా మాట్లాడిస్తే పార్టీలకు అంత లాభం ఉంటుంది. 

మీడియా కూడా

ప్రజలను ప్రభావితం చేయడంలో ఒకప్పట్లో మీడియా పాత్ర చాలా ప్రముఖంగా ఉండేది. మీడియాలో ప్రచురితం అయ్యే వార్తలు, ప్రసారమయ్యే కథనాల వల్ల.. ప్రజలు ఒక అభిప్రాయానికి వస్తుండేవాళ్లు. కానీ ఇవాళ్టి రోజుల్లో మీడియాకు ప్రజల దృష్టిలో ఉండే విలువ పూర్తిగా తగ్గిపోయింది. 

మీడియా సంస్థలను కూడా పార్టీల గొడుగుకింద బతికే కార్యకర్త ల మాదిరిగానే ప్రజలు చూస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగాల్లో పదేపదే మీడియా విషయం కూడా ప్రస్తావిస్తుంటారు. ‘పెత్తందార్ల పార్టీకి ఉన్నట్టుగా మనకు సొంత మీడియా లేదు’ అని ఆయన అంటుంటారు గానీ.. ఆయన మాటలకు కూడా ప్రజల దృష్టిలో విలువ లేదు. ఎందుకంటే.. సాక్షి మీడియా ఆయన సొంతమే అనే సంగతి అందరికీ తెలుసు. కానీ తెలుగుదేశానికి ఉన్న స్థాయిలో అనుకూల మీడియా జగన్ కు లేదు అనేది మాత్రం నిజం.

తెలుగుదేశానికి అనుకూలంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 సంస్థల రూపేణా మూడు టీవీ ఛానెళ్లు, రెండు పేపర్లు తదేకదీక్షతో జగన్ మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తుంటాయి. అదే సమయంలో జగన్ తరఫున సాక్షి పత్రిక మరియు టీవీ మాత్రమే ఆ స్థాయిలో పనిచేస్తుంటుంది. జగన్ కోసం ఎన్ టీవీ, టీవీ9 కూడా లోపాయికారీగా పనిచేస్తుంటాయి గానీ.. సాక్షి, ఏబీఎన్, టీవీ5, ఈనాడు వంటి బరితెగింపు వాటికి ఉండదు. ప్రజలు కూడా బరితెగించిన పార్టీ చానెళ్లను ఎవరైనా చూస్తున్నారూ అంటే.. వారు పక్కాగా ఆ పార్టీ కార్యకర్తలు మాత్రమే అన్నమాట.

ఆ చానెళ్లు రోజంతా తమ రాజకీయ ప్రత్యర్థి మీద విషం కక్కినా కూడా కొత్తగా ఒక్క ఓటరునైనా రాబట్టగలరు అనేది భ్రమ. వారి పార్టీకి ఓటు వేసే కరడుగట్టిన వ్యక్తులు మాత్రమే ఆయా పార్టీ చానెళ్లను చూడాలనుకుంటున్నారు. ఆయా ఛానెళ్లను చూడడం ద్వారా తమకు తెలియని సంగతులు తెలుసుకుని, ఆ మేరకు తమ రాజకీయ ప్రత్యర్థుల మీద బురద చల్లడాన్ని తాము కొనసాగించడానికి మాత్రమే వారు ఆ చానెళ్లను చూస్తున్నారు తప్ప మరొక ఉద్దేశం వారికి కూడా లేదు.  మీడియా విషయంలో థర్డ్ పార్టీ కింద ఉండి నిజాయితీ నిష్పక్షపాతంగా కథనాలు అందిస్తూ ప్రజలను ప్రభావితం చేయగల స్థాయిలో ఎవ్వరూ లేకపోవడం గమనించాలి. 

ఇలా పార్టీలు రకరకాల ప్రయత్నాల్లో తమ తమ స్థిరమైన ఓటుబ్యాంకుకు అదనంగా కొత్త ఓటర్లను జతకలుపుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. థర్డ్ పార్టీల ఉపయోగం వారికి ఎంత ఉంటున్నదో.. తద్వారా వారు ఏమేరకు లాభపడుతున్నారో.. ఎన్నికల తర్వాతగానీ తేలదు.

.. ఎల్. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?