తిరుప‌తి ఉప ఎన్నిక‌.. ఐఏఎస్ అధికారిపై స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌!

తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌ర్ కార్డుల‌ను అక్ర‌మంగా డౌన్‌లోడ్ చేయ‌డంపై బాధ్యుడిని చేస్తూ, నాటి ఈఆర్ఓ పీఎస్ గిరీషా స‌స్పెన్ష‌న్‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీలక నిర్ణ‌యం తీసుకుంది. గిరీషా స‌స్పెన్ష‌న్‌ను ఎత్తివేయ‌డంతో…

తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌ర్ కార్డుల‌ను అక్ర‌మంగా డౌన్‌లోడ్ చేయ‌డంపై బాధ్యుడిని చేస్తూ, నాటి ఈఆర్ఓ పీఎస్ గిరీషా స‌స్పెన్ష‌న్‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీలక నిర్ణ‌యం తీసుకుంది. గిరీషా స‌స్పెన్ష‌న్‌ను ఎత్తివేయ‌డంతో పాటు ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ‌ను పెండింగ్‌లో ఉంచ‌డం గ‌మ‌నార్హం.

ఈ మేర‌కు ఏపీ చీఫ్ సెక్ర‌ట‌రీ కేఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డికి జాతీయ ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాలు జారీ చేసింది. గిరీషాకు ఎన్నిక‌ల విధులు అప్ప‌గించొద్ద‌ని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఇత‌ర శాఖ‌లో పోస్టింగ్ ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేయ‌డం విశేషం.

గిరీషా స‌స్పెండ్ అయ్యే స‌మ‌యానికి అన్న‌మ‌య్య జిల్లా క‌లెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. గ‌త జ‌న‌వ‌రి మాసంలో ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో గిరీషా తిరుప‌తి క‌మిష‌న‌ర్‌గా ఉన్నారు.

తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌ర్ కార్డుల‌ను అక్ర‌మ డౌన్‌లోడ్ చేయ‌డంలో గిరీషా పాత్ర లేద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. అందుకే ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ తొల‌గించ‌డానికి ముందుకొచ్చింది. తాజా ప‌రిణామాల‌పై గిరీషా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే కేసులో మ‌రికొంద‌రు స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యారు.