రాజకీయాలంటే ఎలా వుంటాయో ఇప్పుడిప్పుడే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు తెలిసొస్తోంది. ఇంత వరకూ షర్మిల ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటే, ఇష్టం ఉన్నా లేకపోయినా జనం వింటున్నారు. కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న షర్మిల… ప్రస్తుతం ఆ జిల్లాలో ప్రచారం చేస్తున్నారు. తన అన్న వైఎస్ జగన్‌ను రాజకీయంగా అల్లరిపాలు చేయడానికి ఆమె విశ్వప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు షర్మిల విపరీత ధోరణిని జనం భరించలేకున్నారు. ఈ నేపథ్యంలో మైదుకూరు నియోజకవర్గం దువ్వూరులో ప్రచారం చేస్తున్న షర్మిలకు చేదు అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా జై జగన్ నినాదాలు మార్మోగాయి. దీంతో ఆమె ఖంగుతిన్నారు. మీకు మైక్ ఇస్తా, దమ్ముంటే మాట్లాడాలని జగన్ అభిమానులకు ఆమె సవాల్ విసిరారు. అసలే షర్మిల వైఖరిపై రుసరుసలాడుతున్న జనం, ఆమెకు బహిరంగంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
దీంతో షర్మిల సవాల్‌ను స్వీకరించిన మైదుకూరు జేసీఎస్ కన్వీనర్ ఏమిరెడ్డి చంద్ర ఓబుల్‌రెడ్డి షర్మిల దగ్గరికి వెళ్లి మైక్ తీసుకున్నారు. తన సభలో జై జగన్ నినాదాలతో మార్మోగడాన్ని జీర్ణించుకోలేక ఉక్రోశానికి ఆమె లోనయ్యారు. చంద్ రఓబుల్‌రెడ్డి భుజం తట్టి మాట్లాడాలని షర్మిల కోరారు. జగన్‌కు ఎందుకు ఓటు వేయాలని చెప్పాలన్నారు.
నమస్తే అక్కా అంటూ… 2011లో జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి జనంలోనే తిరుగుతున్నాడన్నారు. సమస్యలు ఏవి ఉన్నా, తమ కోసం వచ్చాడని, విన్నాడని చెప్పుకొచ్చారాయన. తాను ఉన్నానని ప్రజలకు జగన్ చెప్పాడన్నారు. జగన్ చెప్పిన ప్రకారం ప్రతి హామీ నెరవేర్చాడని చంద్ర తెలిపారు. పేద ప్రజల కోసం జగన్ మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, వారి కష్టాలు విన్నాడన్నారు.
అందరికీ న్యాయం చేస్తానని చెప్పిన ప్రకారం జగన్ చేశాడని అతను షర్మిల ఎదుట చెప్పారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబానికి జగన్ ప్రభుత్వంలో సంక్షేమం అందినట్టు చంద్ర ఓబుల్‌రెడ్డి తెలిపారు. దానికి కారణం ఎవరంటే జగన్‌మోహన్‌రెడ్డే అని అనడంతో ఒక్కసారిగా జనం నుంచి పెద్ద ఎత్తున ఈలలు వేశారు.
జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తాడని, సీఎం తమ కోసం ఉంటాడని ఆయన ఎంతో నమ్మకంగా చెప్పారు. జగన్‌తో మీకు వ్యక్తిగత వివాదాలు ఉన్నాయని అతను షర్మిలతో నేరుగా అన్నారు. తెలంగాణలో కూడా ఇక్కడే వుంటానని, పోటీ చేస్తానని చెప్పారని గుర్తు చేశారు. అక్కడ పోటీ చేయలేదని షర్మిలకు చురకలు అంటించారు. ఇక్కడికి వచ్చారన్నారు. వైఎస్సార్ బిడ్డగా మీపై అభిమానం వుందని ఆ యువకుడు తెలిపారు.
కానీ జగన్‌మోహన్‌రెడ్డి తమ కోసం వున్నాడని స్పష్టం చేశారు. తమతో కలిసి రావాలని, అభివృద్ధి చేసుకుందామని షర్మిలకు వినయపూర్వకంగా ఆ యువకుడు విజ్ఞప్తి చేశారు. అనంతరం అతను జోహార్ వైఎస్సార్, జై జగన్ అంటూ నినదించారు. దీంతో షర్మిల షాక్‌కు గురయ్యారు. ఇది కేవలం ఆరంభమే అని, రానున్న రోజుల్లో ఎక్కడికక్కడ ఆమెను జనం నిలదీసే పరిస్థితి ఎదురు కానుందనే చర్చకు తెరలేచింది. షర్మిల ఓవరాక్షన్ శ్రుతిమించడం వల్లే జనం నుంచి తిరుగుబాటు ఎదురైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ అభిమాన మజాకా
జగన్ అభిమానికి మైక్ ఇచ్చి మరి జగన్ గొప్పతనాన్ని విన్నా షర్మిల pic.twitter.com/KCAYbMn4Lj
— greatandhra (@greatandhranews) April 8, 2024