వైసీపీకి కొరుకుడు పడని ఎమ్మెల్సీ!

ఎమ్మెల్సీలు వైసీపీకి అచ్చిరావడం లేదా అంటే పరిస్థితి చూస్తే అలాగే ఉంది అని అంటున్నారు. విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పదవిని వంశీ క్రిష్ణ శ్రీనివాస్‌కి ఇస్తే ఆయన జనసేనలోకి జంప్ చేశారు.…

ఎమ్మెల్సీలు వైసీపీకి అచ్చిరావడం లేదా అంటే పరిస్థితి చూస్తే అలాగే ఉంది అని అంటున్నారు. విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పదవిని వంశీ క్రిష్ణ శ్రీనివాస్‌కి ఇస్తే ఆయన జనసేనలోకి జంప్ చేశారు. ఆయన మీద శాసనమండలి చైర్మన్ కి ఫిర్యాదు చేసి సభ్యత్వాన్ని వైసీపీ రద్దు చేయించింది.

ఇపుడు మరో ఎమ్మెల్సీ వైసీపీ మీద కత్తులు దూశారు. అయితే ఈయన తెలివిగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు. విజయనగరం జిల్లా ఎస్ కోటకు చెందిన ఇందుకూరి రఘురాజు తన అనుచరులను టీడీపీలోకి పంపించారు. పార్టీ పదవితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి కీలక నేతగా ఉన్న ఆయన సతీమణి సైతం టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

ఇక ఈ వైసీపీ ఎమ్మెల్సీ తన పైన అనర్హత వేటు పడకుండా వైసీపీలో ఉంటూ టీడీపీకి హెల్ప్ చేస్తున్నారు అని అధికార పార్టీ ఆరోపిస్తోంది. దీంతో ఆయన మీద మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఇక్కడ జగన్ కోసమే ప్రజలు ఓటు వేస్తారు అని పార్టీలో ఎవరూ గొప్ప కాదని హాట్ కామెంట్స్ చేశారు.

ముసుగులు వేసుకుని పార్టీలో ఉంటున్న వారు వెళ్ళిపోవచ్చు అని కూడా ఆయన స్పష్టం చేశారు. అంతే కాదు వైసీపీ నేతలు ఆయన మీద అనర్హత వేటు కోసం ఫిర్యాదు చేశారు. దీనిని శాసనమండలి చైర్ పర్సన్ కు ఇచ్చారు. అక్కడ ఏమి చర్యలు ఉంటాయో తెలియదు. అయితే పార్టీలోనే ఉన్న ఎమ్మెల్సీ మీద ఎలా చర్యలు తీసుకుంటారు అని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు.

ఆయన గీత దాటలేదు కదా అని వారు లాజిక్ పాయింట్ తీస్తున్నారు. ఆయన వైఖరి రెబెల్ ఎంపీ రఘురామ మాదిరిగా ఉందని అంటున్నారు. పార్టీలో ఉంటూ ఆయన వ్యతిరేకంగా పనిచేసినా ఆధారాలు చూపించకపోతే అనర్హత వేటు పడదు. అయితే శాసనమండలి చైర్ పర్సన్ ఆయన విషయంలో ఏమి చర్యలు తీసుకుంటారో తెలియదు కానీ ఆయన మీద వేటు వేయాల్సిందే అని వైసీపీ నేతలు అంటున్నారు. ఆయన పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అన్నది వారి అభియోగం.

అయితే రఘురాజు అనుచరులు వెర్షన్ వేరేగా ఉంది. 2024 ఎన్నికల్లో తమ నేతకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ మాట తప్పారని వారు అంటున్నారు. జగన్ సీఎం కావడం కోసం ఎస్ కోట నుంచి తిరుపతికి కాలినడకన వెళ్ళి వచ్చిన ఈ ఎమ్మెల్సీ ఇపుడు అదే పార్టీకి కొరుకుడు పడకుండా మారారు అని అంటున్నారు.