సీఎం రమేష్ కి అనుకోని అవాంతరాలు

శుభమా అని అనకాపల్లి నుంచి టీడీపీ కూటమి అభ్యర్ధిగా ఎన్నికల్లో పోటీకి దిగిన కడప వాసి సీఎం రమేష్ కి అనుకోని అవాంతరాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఆయన మీద మొన్న పోలీసులు కేసు నమోదు…

శుభమా అని అనకాపల్లి నుంచి టీడీపీ కూటమి అభ్యర్ధిగా ఎన్నికల్లో పోటీకి దిగిన కడప వాసి సీఎం రమేష్ కి అనుకోని అవాంతరాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఆయన మీద మొన్న పోలీసులు కేసు నమోదు చేస్తే తాజాగా రెవిన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు.

ఎన్నికల కోడ్ ని ఎంపీ అభ్యర్ధి ఉల్లంఘించారు అన్న కారణంతో ఆర్డీవో జయరాం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నర్శీపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మహిళలకు కూటమి నేతలు చీరలను పంపిణీ చేస్తున్నారు అన్న ఫిర్యాదుతో ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడికి తనిఖీ చేసేందుకు వచ్చింది.

అయితే ఆ స్క్వాడ్ ఎదురుగా ఉండగానే మాజీ మంత్రి నర్శీపట్నం టీడీపీ అభ్యర్ధి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏపీ డీజీపీ, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను తీవ్ర పదజాలంతో విమర్శించారు అన్నది ప్రధాన అభియోగం. ఆ సమయంలో సీఎం రమేష్ అక్కడే ఉన్నారని అంటున్నారు. దాంతో ఈ ఇద్దరూ ఎన్నిక కోడ్ ఉల్లఘించారని పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు.

దీని కంటే ముందు సీఎం రమేష్ మీద చోడవరం పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. చోడవరం టైల్స్ కంపెనీలో అధికారులు తనిఖీ చేస్తూంటే వారి విధులు అడ్డుకుంటూ సీఎం రమేష్ వ్యవహరించారు అన్న ఆరోపణలతో ఆయన మీద కేసు పెట్టారు. ఆయనకు 41ఏ పేరుతో నోటీసులు జారీ చేశారు. దాని మీద చోడవరం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రమేష్ వివరణ ఇచ్చారు.

అయితే కావాలనే తన మీద చోడవరం వైసీపీ ఎమ్మెల్యే తప్పుడు కేసు నమోదు చేయించారని రమేష్ విమర్శించారు. టైల్స్ కంపెనీ అధినేతను వైసీపీ నేతలు వేధిస్తూంటే తాను వారికి అండగా ఉన్నానని ఆయన అంటున్నారు. సీఎం రమేష్ అనకాపల్లికి వచ్చి పది రోజులు కూడా కాలేదు అటు కేసులు ఇటు నోటీసులతో ఏమిటి ఇది అని కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు. అయ్యన్నపాత్రుడు అయితే నోటి దురుసుతో వైసీపీ నేతలను ఎపుడూ విమర్శిస్తూంటారు అని ఇపుడు ఎన్నికల కోడ్ అని చూసుకోకుండా అధికారుల మీదనే విమర్శలు చేశారని అధికార పార్టీ నేతలు అంటున్నారు.