టీడీపీకి చిక్కని దక్కని సీటు!

ఉమ్మడి విజయనగరంలో ఎస్టీ సీటుగా ఉన్న కురుపాం తెలుగుదేశానికి చిక్కడం లేదు, దక్కడం లేదు. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పాటు అయ్యాక టీడీపీ గెలిచింది లేదు. వరసబెట్టి మూడు ఎన్నికలలో ఓటమి పాలు అయింది.…

ఉమ్మడి విజయనగరంలో ఎస్టీ సీటుగా ఉన్న కురుపాం తెలుగుదేశానికి చిక్కడం లేదు, దక్కడం లేదు. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పాటు అయ్యాక టీడీపీ గెలిచింది లేదు. వరసబెట్టి మూడు ఎన్నికలలో ఓటమి పాలు అయింది. 2009లో కాంగ్రెస్ గెలిస్తే 2014, 2019లలో వైసీపీ గెలుస్తూ వచ్చింది. వైసీపీ తరఫున పాముల పుష్ప శ్రీవాణికే ఈసారి టికెట్ ని వైసీపీ ఇచ్చింది.

ఆమె హ్యాట్రిక్ సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు. ఆమె వైసీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా మూడేళ్ళ పాటు పనిచేశారు. ఆమె శత్రుచర్ల వారి కోడలు. ఆమె సొంత మామ దివంగత శత్రుచర్ల చంద్రశేఖరరాజు కురుపాం పూర్వ రూపమైన నాగూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసారు. ఆయన వారసురాలిగా పుష్ప శ్రీవాణి రాజకీయాల్లో అడుగుపెట్టారు.

ఆమె పెదమామ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సుదీర్ఘంగా రాజకీయ అనుభవం కలిగిన నేత. గతంలో కాంగ్రెస్ లో ఉంటూ మంత్రిగా పనిచేశారు. టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్సీ  అయ్యారు. ఆయన హవా కురుపాంలో ఇపుడు తగ్గుతోంది. పుష్ప శ్రీవాణి మీద పోటీకి టీడీపీ ప్రకటించిన అభ్యర్ధి తోయక జగదీశ్వరిని ఎలాగైనా కోడలి మీద గెలిపించాలని ఈ మాజీ మంత్రి చూస్తున్నారు.

అయితే వైసీపీని అన్ని రకాలుగా తట్టుకోవడం కష్టం అని టీడీపీ భావిస్తోంది. దాంతో శత్రుచర్ల అనుచరురాలు అయిన తోయక జగదీశ్వరిని మార్చాలని చంద్రబాబు చూస్తున్నారని అంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ తమ్ముడు కొడుకు వీరేష్ చంద్రదేవ్ ని బరిలోకి దించాలని టీడీపీ హై కమాండ్ చూస్తోంది అంటున్నారు.

అదే జరిగితే శత్రుచర్ల ప్రాభవం కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో తగ్గినట్లే అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏమి చేస్తారు అన్నదే అందరి మదిలో ఉంది. శత్రుచర్ల వంశీకురాలు తమ్ముడి కోడలు అయిన పుష్ప శ్రీవాణికి ఆయన మద్దతు ఇచ్చి తమ వంశాన్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్తారా అన్న చర్చ సాగుతోంది. కురుపాం లో చూస్తే వైసీపీ బలంగా ఉంది. ఎవరు ప్రత్యర్థిగా ఉన్నా ఈ సీటు గెలిచేది వైసీపీనే అని అంటున్నారు. ఏజెన్సీలో టీడీపీకి మొదటి నుంచి అంత పట్టు లేదని అంటున్నారు.