8 ఏళ్లు ప్రేమించిన ప్రియుడ్ని తాజాగా పెళ్లాడింది హీరోయిన్ తాప్సి. మథియాస్ బోతో తాప్సి వివాహం సీక్రెట్ గా జరిగింది. ఆ తర్వాత కూడా ఆమె ఆ విషయాన్ని ప్రకటించలేదు. అంతలోనే ఆమె పెళ్లి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయినప్పటికీ తాప్సి రెస్పాండ్ అవ్వలేదు.
ఎట్టకేలకు తన పెళ్లిపై స్పందించింది ఈ హీరోయిన్. అంతా తను పెళ్లిని సీక్రెట్ మ్యారేజ్ అంటున్నారని, కానీ అది రహస్యంగా చేసుకున్న పెళ్లి కాదని తెలిపింది తాప్సి. రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి, ప్రైవేట్ గా పెళ్లి చేసుకోవడానికి చాలా తేడా ఉందని అంటోంది.
తన వ్యక్తిగత జీవితాన్ని బహిరంగంగా ప్రదర్శించడం ఇష్టం లేదని, అందుకే తన బంధువుల సమక్షంలో ప్రైవేట్ గా పెళ్లి చేసుకున్నానని తెలిపింది. తన పెళ్లిని బహిర్గతం చేయడానికి తాను అప్పటికి మానసికంగా సిద్ధం అవ్వలేదని తెలిపింది.
నిజానికి ఇలాంటి పెళ్లిళ్లకు సంబంధించి ఫొటోలు, వీడియోలు దాచినా దాగవు. తాప్సి పెళ్లి ఫొటోలు మాత్రం బయటకు రాలేదు. దీనికి కారణం ఆమె అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించింది. అలా ఆహ్వానించిన వాళ్లందరికీ తన గురించి తెలుసని, అందుకే తన పెళ్లి ఫొటోలు బయటకు రాలేదని అంటోంది.
ఇక పెళ్లికి సంబంధించిన వీడియోపై స్పందిస్తూ, అది కావాలని లీక్ చేసింది కాదని, వివిధ వ్యక్తుల మధ్య చేతులు మారి అలా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైందని తెలిపింది.