Advertisement

Advertisement


Home > Movies - Movie News

చిరంజీవి అంటే గౌరవం.. కానీ అక్కడ మాత్రం కాదు..!

చిరంజీవి అంటే గౌరవం.. కానీ అక్కడ మాత్రం కాదు..!

ఒకప్పుడు సంక్రాంతికి పెద్ద హీరో సినిమా వస్తుందంటే చాలామంది హీరోలు తప్పుకునేవారు. పోటీ ఇవ్వాలనుకుంటే మరో పెద్ద హీరో మాత్రమే బరిలో నిలిచేవాడు. కానీ ఇప్పుడలా కాదు. సంక్రాంతికి అందరూ పొలోమంటూ వచ్చేస్తున్నారు. ఆర్భాటంగా రిలీజ్ డేట్స్ ప్రకటించేస్తున్నారు. పెద్ద హీరో బరిలో ఉన్నప్పటికీ తగ్గేదేలే అంటున్నారు.

ఈసారి సంక్రాంతికి చిరంజీవి రంగంలోకి దిగుతున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న మెగాస్టార్, ఆ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించారు. అక్కడితో ఆగకుండా డేట్ కూడా ఇచ్చారు. ఈ ప్రకటన వచ్చిన తర్వాత కూడా మిగతా హీరోలు తగ్గకపోవడం విశేషం.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమా సంక్రాంతికే వస్తుందంటూ ఇప్పటికే ఫీలర్లు వదులుతున్నారు. మరోవైపు బాలయ్య సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉందంటున్నారు చాలామంది. ఈ ఊహాగానాలు ఇలా వినిపిస్తుండగానే తాజాగా మరో 2 సినిమాలు ఏకంగా సంక్రాంతి ప్రకటన ఇచ్చేశాయి.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రవితేజ చేయబోయే 75వ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేస్తారంటూ ప్రకటన వచ్చేసింది. అటు దిల్ రాజు కూడా వెంకటేష్-అనీల్ రావిపూడితో చేయబోయే సినిమాను సంక్రాంతికే విడుదల చేస్తామని ప్రకటించేశాడు. ఓవైపు చిరంజీవి సినిమా బరిలో ఉందని తెలిసి కూడా వీళ్లు ఇలా ప్రకటనలు చేయడం చాలామందికి నచ్చలేదు, మరీ ముఖ్యంగా మెగాభిమానులకు.

చిరంజీవి అంటే ఇష్టమని, గౌరవమని వీళ్లంతా గతంలో ఎన్నోసార్లు చెప్పినవాళ్లే. కానీ ఇప్పుడు చిరంజీవి సినిమా బరిలో ఉందని తెలిసి కూడా నిర్మోహమాటంగా తమ సినిమాల్ని కూడా అదే టైమ్ లో తీసుకొస్తామని ప్రకటిస్తున్నారు. చిరంజీవికి వీళ్లిచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు మెగాఫ్యాన్స్.

నిజానికి గౌరవం వేరు, వ్యాపారం వేరు. చిరంజీవికి ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ ఇస్తారు, కానీ సినిమాల విషయానికొచ్చేసరికి ఎవరి వ్యాపారం వాళ్లది. ఎదురుగా చిరంజీవి సినిమా ఉన్నప్పటికీ ఓ వ్యాపారవేత్తలా ఆలోచించాల్సిందే. పైగా 3 పెద్ద సినిమాల్ని భరించేంత సత్తా సంక్రాంతి బాక్సాఫీస్ కు ఉందంటూ వీళ్లే గతంలో చాలా ప్రకటనలు ఇచ్చారు.

కాబట్టి చిరంజీవి రేసులో ఉన్నప్పటికీ ఇలా 'సంక్రాంతి రిలీజ్' ప్రకటనలు వస్తూనే ఉంటాయి. ఆ టైమ్ కు ఎన్ని సినిమాలు మిగులుతాయనేది చూడాలి. ఈలోగా ఆఖరి నిమిషంలో నాగార్జున లాంటి పించ్ హిట్టర్లు బరిలో నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందరికీ చిరంజీవి అంటే గౌరవమే, కానీ ఇది వ్యాపారం. అంతేగా..అంతేగా..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?