ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కీలకమైన ఎన్నికల సమయంలో ఆయన భార్య వైఎస్ భారతి బాసటగా నిలబడనున్నారు. ఈ నెల 22న పులివెందులలో వైఎస్ జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదే సందర్భంలో పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల బాధ్యతల్ని వైఎస్ భారతి చేపట్టనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ అక్కడే ఆమె ఉండనున్నారు.
ప్రతి ఎన్నికల్లోనూ పులివెందులలో భారతి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంటారు. కడప యాసలో మాట్లాడుతూ వారిలో ఒకరిగా భారతి మమేకం అవుతారనే పేరు వుంది. మరీ ముఖ్యంగా భారతి తండ్రి దివంగత ఈసీ గంగిరెడ్డి కుమార్తెగా కూడా ఆమెకు గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ఎంతో మంది చిన్నారుల అనారోగ్య సమస్యలకి పరిష్కారం చూపి, మంచి భవిష్యత్‌ను కల్పించిన వైద్యుడిగా డాక్టర్ ఈసీ గంగిరెడ్డిని పులివెందులతో పాటు పొరుగు జిల్లాల వారు కూడా అభిమానిస్తారు.
వైఎస్ భారతి తన స్థాయిని పట్టించుకోకుండా ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా వుంటారు. వివాదాలకు ఆమె దూరం. ఎన్నికల సమయంలో పులివెందులలో ఆమె ప్రచారం జగన్‌కు ఎంతో లాభించనుంది. భారతి రాకతో జగనే తమ వద్దకు వచ్చాడన్న ఫీలింగ్ పులివెందుల ప్రజానీకంలో చూడొచ్చు.
మరోసారి పులివెందులలో భారీ మెజార్టీ సాధించేందుకు వైఎస్ కుటుంబ సభ్యులు దృష్టి సారించారు. ఇప్పటికే వైఎస్ కుటుంబ సభ్యులైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్ మధు, అభిషేక్, మనోహర్ తదితరులంతా ఒక్కో మండలానికి బాధ్యత తీసుకుని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని పకడ్బందీ వ్యూహంతో ముందుకెళుతున్నారు.