అధికారం పోయిన చాలా కాలానికి గులాబీ బాస్ కేసీఆర్ కొత్త … కొత్త సంగతులు చెప్పాడు. ఈ సంగతుల సారాంశం ఏమిటంటే … పార్టీ అధికారం కోల్పోయినా తన చరిష్మా తగ్గలేదని, తన పొలిటికల్ పవర్ ఏ మాత్రం వీక్ కాలేదని చెప్పుకున్నాడన్న మాట. తన కూతురు కవిత జైలుకు పోవడానికి కారణం కూడా చెప్పాడు. ఆమె అమాయకురాలని తేల్చిపారేశాడు. ఆమె ఏ పాపం ఎరుగదని వెనకేసుకొచ్చాడు.
ఎవరో సీనియర్ నాయకుడు (పేరు చెప్పలేదు) కేసీఆర్ దగ్గరకు వచ్చి సార్ … ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకురావాలా సార్ … వారు గులాబీ పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు అని చెప్పాడట. ఈయన ఇప్పుడు వద్దులే అన్నాడట. తన శక్తి ఏమిటో చూసుకోండి అన్నట్లుగా ఈ కథ వినిపించాడు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలామంది కాంగ్రెస్ లోకి వెళ్లారు కదా. దీంతో పార్టీ బలహీన పడిందని మీడియాలో చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ మంత్రులు, నాయకులు కూడా బీఆర్ఎస్‌ను బొంద పెడతామంటున్నారు. అందుకే తనవాళ్లకు ధైర్యం చెప్పడానికి తనతో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బిల్డప్ ఇచ్చాడని అనుకోవాలి. లోక్ సభ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని, ఈ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొడుతుందని జోస్యం చెప్పాడు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆశ పడుతున్నాడు.
గతంలో ఎంతో బలంగా ఉన్న తన ప్రభుత్వాన్నే కూల్చాలని బీజేపీ ప్రయత్నాలు చేసిందని, ఇప్పుడు బొటాబొటి మెజారిటీతో బలహీనంగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడం పెద్ద కష్టం కాదని చెప్పాడు. ప్రభుత్వాన్ని తానే కూలుస్తాననే సంకేతాలు ఇస్తున్నాడు. 20 మంది ఎమ్మెల్యేలు వస్తానంటే తానే వద్దన్నానని అంటాడు. మరో పక్క బీజేపీ కూలుస్తుందంటాడు. కేసీఆర్ బీజేపీతో కలిస్తే తప్ప ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యం కాదు. బహుశా కేసీఆర్ ప్లాన్ అదే అయివుండొచ్చు.
గతంలో తన ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీకి చెందిన నలుగురు నాయకులు వచ్చారని, వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించినందువల్లనే బీజేపీ ప్రతీకారంగా లిక్కర్ స్కాములో కవితని అరెస్టు చేయించిందని అన్నాడు. ఆనాడు తాను ఆ పని చేయకుండా ఉంటే కవిత అరెస్టు కాకపోయేదని అన్నాడు. అసలు ఆ కుంభ కోణమే బోగస్ అని చెప్పాడు. మళ్ళీ ఉద్యమ కాలంనాటి కేసీఆర్ ను చూస్తారని చెప్పాడు. అది హెచ్చరికో, బెదిరింపో అర్థం కావడంలేదు.