తూర్పుగోదావరి జిల్లా ఉండి సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ప్యాకేజీతో నోర్మూయించినట్టు టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఆ సీటును నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేటాయించారు. దీంతో సిటింగ్ ఎమ్మెల్యే రామరాజును వ్యతిరేకత రాకుండా ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పెద్ద మొత్తంలో ఆర్థిక లబ్ధి చేకూర్చినట్టు టీడీపీ నాయకులే చెబుతున్నారు. ఇందులో నిజానిజాలేంటో రామరాజు చెబితే తప్ప, తెలిసే అవకాశాలు వుండవు.
అయితే ప్యాకేజీతో కూల్ చేశారనేందుకు బలమైన ఆధారాలను టీడీపీ నేతలు చూపుతున్నారు. ఉండి సీటును తనకు ప్రకటించి, ఆ తర్వాత రఘురామకృష్ణంరాజుకు ఇస్తున్నా… నోరు మెదపకపోవడాన్ని ప్రత్యేకంగా చెప్పడం విశేషం. ఏ లాభం లేకపోతే రామరాజు మీడియాకెక్కి రచ్చరచ్చ చేసి వుండేవారని చెబుతున్నారు. ఉండి సీటును రఘురామకు ఇస్తారని మొదట్లో ప్రచారం జరిగినప్పుడు… రామరాజుతో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.
ఒకట్రెండు సార్లు రామరాజు తన వాళ్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి, భావోద్వేగాన్ని పండించారు. అనుచరులంతా బరిలో వుండాల్సిందే అని స్పష్టం చేశారు. రామరాజు కూడా పోటీలో వుంటానని తేల్చి చెప్పారు. గత రెండు మూడు రోజులుగా రామరాజుతో టీడీపీ ముఖ్య నేతలు చర్చించినట్టు సమాచారం. తమ నమ్మకాన్ని, అభిమానాన్ని రఘురామకృష్ణంరాజుకు రామరాజు తాకట్టు పెట్టి భారీ మొత్తంలో సొమ్ము చేసుకున్నారని అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
రామరాజుతో బేరాలు మాట్లాడుకోవచ్చనే ఉద్దేశంతోనే ఉండి సీటును రఘురామకు కేటాయించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రామరాజు భావోద్వేగం, ఆయన అనుచరుల ఆందోళనలు… ఇవన్నీ కేవలం తన డిమాండ్‌ను పెంచుకోడానికే తప్ప, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంత మాత్రం కాదని తెలిసిపోయిందని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. ఇంతకాలం ఎవరైతే రామరాజుకు ఇంతకాలం అండగా ఉన్నారో, వారే అసలు విషయం తెలుసుకుని ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయాల్లో ఎంతటి వారైనా డబ్బు దాసులే అని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.