భీమవరంలో సాధించలేనిది, గాజువాకలో కొట్టుకురాలేనిది, పవన్ ఈసారి పిఠాపురంలో పొందేలా కనిపిస్తోంది. వైకాపా అభ్యర్ధి వంగా గీత ఎంతగా పోరాడుతున్నా, సీనియార్టీ, మంచితనం, పార్టీ అండ ఇలా ఎన్ని వున్నా, కులాలతో సంబంధం లేకుండా యువత పవన్ వైపు ఊగుతున్నట్లు గ్రౌండ్ లో కనిపిస్తోంది.
కాపు సామాజిక వర్గంలో కేవలం యువత మాత్రమే కాదు, చదువుకోని పెద్ద వయసు వాళ్లు, మహిళలు కూడా నోరు తెరిస్తే పవన్ అంటున్నారు. గమ్మత్తేమిటంటే సంఖ్యలో ఎంత మంది వుంటారో అన్నది తెలియదు కానీ, పిఠాపురం నియోజకవర్గంలో వుండే బ్రాహ్మణ యువత కూడా పవన్ నామస్మరణ చేస్తున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు, ప్రాంతాల్లో బ్రాహ్మణులు చాలా కుటుంబాలే వున్నాయి.
వర్మ మద్దతు ఇస్తారా? తెర వెనుక ఏమైనా చేస్తారా? అన్న అనుమానాలు వున్నాయి. కానీ గ్రౌండ్ లో తెలుస్తున్న సంగతి వేరుగా వుంది. వర్మ కు అంత సీన్ లేదన్నది అక్కడి జనాల మాట. లేస్తే మనిషిని కాదు అనే తప్ప, మరీ ఓట్లు చీల్చి ఓడించేంత లేదని, రెబల్ గా పోటీ చేస్తే వేరుగా వుండేదేమో? పక్కన వుండిపోవడం వల్ల ప్రభావం ఏమీ వుండదని లోకల్స్ మాట.
అయినా పవన్ ఇంకా భయంగానో, జాగ్రత్తగానో వున్నారు. ఎటు నుంచి ఎటు వస్తే, ఏమవుతుందో అని అనుకుంటున్నారు. అందుకే ప్రచారం విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలో అంతా తీసుకుంటున్నారు. పోలయ్యే కాపుల ఓట్లు 70శాతానికి పైగా పవన్ కే వస్తాయని ఓ అంచనా. బ్రాహ్మణ, క్షత్రియ లాంటి ఫార్వార్డ్ కాస్ట్ ఓట్లు కూడా ఆయనకే అనుకూలంగా వున్నాయి. ఎస్సీ, ఎస్టీ ఓట్ బ్యాంక్ ఎటు వైపు వుంటుంది.. పథకాల ప్రభావం ఏ మేరకు వుంటుంది అన్నది చూడాల్సి వుంది. అక్కడ మాత్రం క్లారిటీ రావడం లేదు. పైగా మేనిఫెస్టో తరువాత పరిస్థితిలో మార్పు వస్తోంది. వైకాపా మేనిఫెస్ట్ అంత ఆకర్షణీయంగా లేకపోవడం ఒక కారణం.
బీసీ ఓట్లు తమ వైపు వున్నాయని వైకాపా నాయకులు నమ్ముతున్నారు. కానీ అక్కడ కూడా ఎంత శాతం అన్నది పక్కన పెడితే ఎంతో కొంత చీలిక వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. హిందూ యేతర మతస్ధుల ప్రభావం పిఠాపురం నియోజకవర్గంలో తక్కువ. అది కూడా వైకాపాకు ఓ మైనస్.
మొత్తం మీద పరిస్థితి ఇప్పటికి అయితే పవన్ కు అనుకూలంగా వుంది. డబ్బు ప్రభావం, పథకాల ప్రభావం ఏమైనా మార్పు తీసుకువస్తే తప్పించి లేదంటే ఓటింగ్ డేట్ వరకు ఇదే పరిస్థితి వుండే అవకాశం క్లారిటీగా కనిపిస్తోంది.