కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. పవన్‌కల్యాణ్ అభిమానాన్ని విపరీతంగా చూరగొన్నవారిలో ఉదయ్ శ్రీనివాస్ ప్రథముడు. ఇప్పుడాయన గురించి ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వాస్తవాలు… ఔరా, జనసేన నేతలంటే ఇంతే కాబోలు అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి.
గతంలో తాను ఇంజనీరింగ్ చదివి, విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసినట్టు ఉదయ్ శ్రీనివాస్ బిల్డప్ ఇచ్చారు. పవన్‌కల్యాణ్‌కు కూడా తాను ఇంజనీరింగ్ పట్టభద్రుడిగా చెప్పుకున్నారు. అయితే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో అతని బాగోతం బయట పడింది. ఉదయ్‌కి అంతసీన్ లేదని, ఇంటర్ స్టూడెంట్ అని తెలిసిపోయింది.
ఈ నేపథ్యంలో అతనిపై ప్రత్యర్థులు ఓ రేంజ్‌లో సెటైర్స్ విసురుతున్నారు. తాజాగా పవన్‌కల్యాణ్ బాధితురాలైన బీసీవై నాయకురాలు జయ కళ్యాణి ఆకుల ఎక్స్ వేదికగా ఘాటైన పోస్టు పెట్టారు. అదేంటంటే…
“దుబాయ్‌లో ఆర్థిక మోసాలు చేసి, అక్కడ నుంచి ఇండియాకి పారిపోయి, ఇంటర్ చదివి ఇంజనీరింగ్ చేశానని ఇక్కడ అబద్ధాలు చెప్పే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ లాంటి వారు, పార్టీ అభివృద్ధి కంటే తమ వ్యక్తిగత స్వార్థం, ఎదుగుదల చూసుకుంటూ పక్క వారి శ్రమను దోచుకునేవారే పవన్‌కల్యాణ్‌కి బాగా నచ్చుతారు. కాకినాడ జనసేన పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీలో ఉన్న తంగెళ్ల ఉదయ్ లాంటి వాళ్ళకి అధికారం ఇస్తే ఇంకెన్ని మోసాలు చేస్తాడో జర జాగ్రత్త కాకినాడ పార్లమెంట్ ప్రజలారా .
డబ్బే పరమావధిగా ఇలాంటి అభ్యర్థులను ప్రోత్సహిస్తూ అవినీతిపరులను పోటీకి దించిన పవన్ కల్యాణ్ నిస్వార్ధ నాయకుడు ఎలా అవుతాడు? పిఠాపురం వాసులారా, పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తికి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును వృథా చేసుకోకండి !! ఇలాంటి వాళ్ళు యువతను తప్పు దారి పట్టిస్తున్నారు. పిఠాపురంలో పవన్, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఓటమి తథ్యం” అని ఆమె సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.
ఇలా ప్రతి ఒక్కరూ జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అబద్ధాలతో వస్తున్న ఉదయ్‌ని సోషల్ మీడియాలో చాకిరేవు పెడుతున్నారు. వైసీపీ అభ్యర్థి సునీల్‌కు అసలు పోటీనే కాదని నెటిజన్లు అంటున్నారు.