తాము అధికారంలోకి వస్తే ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు చేస్తామని బీజేపీ స్పష్టంగా చెబుతోంది. మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించడం తమ విధానం అని ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. అలాంటి బీజేపీతో టీడీపీ జత కట్టింది. ఏపీలో అరసున్నా ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీతో టీడీపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నదో అందరికీ తెలుసు. కేసుల భయంతోనే చంద్రబాబు బీజేపీ పంచన చేరారని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ముస్లింల రిజర్వేషన్‌పై చంద్రబాబునాయుడు నోరు మెదపక పోవడం అంటే… మౌనం అంగీకారమని అర్థం చేసుకోవాల్సి వుంటుందనే చర్చకు తెరలేచింది. ఆదివారం ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ముస్లింలతో ఆయన భేటీ అయ్యారు. ముస్లింలకు టీడీపీ ఏం చేసిందో వివరించారు. ముస్లింలకు జగన్ ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆరోపించారు. ముస్లింలకు తెలుగుదేశం అన్యాయం చేస్తోందని, మా కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని బాబు మండిపడ్డారు.
కానీ రిజర్వేషన్ రద్దు కాదని చంద్రబాబు భరోసా ఇవ్వకపోవడంపై ముస్లింలు నిరుత్సాహానికి లోనయ్యారు. ముస్లింలు ప్రధానంగా భయపడుతున్నదే రిజర్వేషన్ రద్దు గురించి అయితే, దానిపై స్పష్టత ఇవ్వకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. బాబుతో భేటీ తర్వాత ముస్లింలలో మరింతగా భయాన్ని, అనుమానాన్ని పెంచాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రిజర్వేషన్‌పై బాబు భరోసా ఇవ్వలేదంటే, బీజేపీ విధానాలకు ఆయన మద్దతు పలుకుతున్నారని వారంతా ఒక అభిప్రాయానికి వస్తున్నారు. గతంలో వైఎస్సార్ హయాంలో తమకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని గుర్తు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నెల్లూరు సిటీ సీటును ముస్లిం మైనార్టీ వ్యక్తికి ఇచ్చారని వారంతా చెబుతున్నారు. చంద్రబాబు కేవలం మాటలతో మభ్యపెట్టాలని అనుకుంటున్నారని, చేతల్లో మాత్రం ఏదీ వుండదని అర్థమవుతోందని ముస్లింలు విమర్శిస్తున్నారు.