ఆయనను రమ్మన్నారా? తాను వస్తానన్నారా?

బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అనే లాంఛనం పూర్తయిపోయింది. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతున్న ఎంపీల…

బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అనే లాంఛనం పూర్తయిపోయింది. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతున్న ఎంపీల జాబితాలో కృష్ణయ్య పేరు కూడా ఉంది.

ఇప్పుడు ఆయన పార్టీతో పాటు, వారు కట్టబెట్టిన పదవికి కూడా తూచ్ అనేశారు. ఇప్పుడు ఆయన తదుపరి ప్రస్థానం ఏమిటి? అనేది కీలక చర్చనీయాంశంగా ఉంది. పైగా, బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ ఉండి తీరాల్సిందే అనే డిమాండ్ ను నెత్తికెత్తుకున్న కృష్ణయ్యను, బీసీ ముఖ్యమంత్రి తెలంగాణకు కావాలంటూ కొన్నాళ్లుగా గొంతెత్తుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెళ్లి కలవడం కూడా జరిగింది. కాంగ్రెసులోకి రావాల్సిందిగా మల్లన్న, కృష్ణయ్యను ఆహ్వానించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇక్కడే అసలు పితలాటకం చోటుచేసుకుంటోంది. కృష్ణయ్య భారతీయ జనతా పార్టీలో చేరడానికి మంతనాలు పూర్తి చేసుకున్న తర్వాతనే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారనే ప్రచారం ముమ్మరంగా ఉంది. అలాంటిది తీన్మార్ మల్లన్న వెళ్లి ఆయనను కాంగ్రెసులోకి రమ్మని పిలిస్తే ఆయన వస్తారా? అధికారంలో లేని, వస్తుందో లేదో గ్యారంటీలేని పార్టీలోకి రావడానికి క్రిష్ణయ్య సిద్ధమేనా? అనేది కీలకం.

పైగా రాహుల్ గాంధీ కులగణనకు డిమాండ్ వినిపించినంత మాత్రాన ఆ పార్టీ కీలకంగా ఉండే ప్రభుత్వం కేంద్రం అధికారంలోకి వస్తే బీసీలకు 50 శాతం చట్టసభల రిజర్వేషన్ ఇస్తారనే గ్యారంటీ ఏమీ లేదు. పైగా కాంగ్రెస్ సర్కారు వచ్చినా వారికి సింగిల్ పార్టీగా ప్రభుత్వానికి చాలినన్ని సీట్లు రావనేది స్పష్టం. కాంగ్రెసుకు నచ్చినంత మాత్రాన వారు నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి కృష్ణయ్య కాంగ్రెసు వైపు వెళ్లే అవకాశం తక్కువననేది విశ్లేషకుల అభిప్రాయం.

ఈ కోణంలో చూస్తే.. కొన్నాళ్లుగా కాంగ్రెసు లో బీసీ విప్లవం తీసుకురావడానికి కష్టపడుతున్న తీన్మార్ మల్లన్న.. కృష్ణయ్యను కాంగ్రెసులోకి ఆహ్వానించడానికి వెళ్లి కలిశారా? లేదా, తాను కూడా బిజెపిలోకి వస్తాను.. వెంట తీసుకువెళ్లడానికి రాయబారం చేయమని అడగడానికి వెళ్లారా? అనేది చర్చ. తీన్మార్ మల్లన్న గతంలో ఒకసారి బిజెపిలో చేరి, బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

2 Replies to “ఆయనను రమ్మన్నారా? తాను వస్తానన్నారా?”

Comments are closed.