దందాలు ఆపకుండా ఎన్నిచేసినా దండగే!

చంద్రబాబునాయుడు ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తాం అనే హామీతో ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత.. సరికొత్త ఇసుక విధానాన్ని ప్రకటించారు. సర్కారు వారు వేసే లెక్కలు సామాన్యులకు అర్థం కావడం కష్టమే గానీ..…

చంద్రబాబునాయుడు ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తాం అనే హామీతో ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత.. సరికొత్త ఇసుక విధానాన్ని ప్రకటించారు. సర్కారు వారు వేసే లెక్కలు సామాన్యులకు అర్థం కావడం కష్టమే గానీ.. బాబు గారు ఉచితం అన్నప్పటికీ.. ప్రజలు ఇసుక కొనుగోలు చేయాలంటే తడిసి మోపెడవుతోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇసుక కొన్న ధరలకు ఇప్పుడు పెడ్డుతున్న డబ్బుకు పెద్దగా వ్యత్యాసం ఉండడం లేదు. ఉచితం అనే హామీ పట్ల ప్రజలు పెదవివిరిచే పరిస్థితి. దీనిని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి కూడా.. ఉచితం పేరు చెబుతూ.. తమ పాలనలో కంటె రెండు మూడు రెట్లు అధిక ధరలకు ఇసుక అమ్ముతున్నారని అనేక ఆరోపణలు చేశారు.

తమ ప్రభుత్వం రోజుల్లో కనీసం ప్రభుత్వ ఖజానాకు డబ్బులొచ్చేవని, ఇప్పుడు అది కూడా లేకుండా, మొత్తం సొమ్మును తెలుగుదేశం వారే దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. జగన్ మాటల్లో నిజం ఉన్నట్టుగా చంద్రబాబుకే అర్థమైనట్టుంది. అందుకే ఆయన ఇసుక తవ్వకాల మీద సీనరేజీ చార్జీలు రద్దు చేస్తూ కొత్త సవరణను ప్రకటించారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి 200 కోట్ల భారం పడుతుంది.

అయినా సరే.. నష్టం లేదని, నిర్మాణం రంగం పుంజుకుంటే.. వారు చెల్లించే జీఎస్టీల ద్వారా ఆ నష్టం పూడ్చుకోవచ్చునని చంద్రబాబు అంటున్నారు. అది కూడా నిజమే కావొచ్చు.. ఏసంగతీ కొన్నాళ్లు గడిచాక తేలుతుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిన ముచ్చట మరొకటి ఉంది.

ఇసుక విక్రయాల విషయంలో కూటమి పార్టీలకు చెందిన స్థానిక ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా దందాలు చేస్తున్నారనే ఆరోపణలు చాలా వినిపిస్తున్నాయి. ట్రాక్టరుకు ఇంత లెక్కన, లారీకి ఇంత లెక్కన ఎమ్మెల్యేల వసూల్లే మితిమీరిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రజలు నిజంగా గతిలేని స్థితిలో ఎంత ధర చెబితే అంత చెల్లించి కొనుక్కుంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు సాగిస్తున్న అక్రమ దందాల గురించి చంద్రబాబుకు కూడా సమాచారం అందినట్లే ఉంది. ఆయనకు అవగాహన కూడా ఉంది. ఇసుక వ్యాపారంలో తలదూర్చవద్దని ఆయన ఎమ్మెల్యేలకు హితవు చెబుతున్నారు.

తమాషా ఏంటంటే.. కొత్త ఇసుక విధానం ప్రారంభించిన తొలినాటి నుంచి ఈ దందాలు సాగుతూనే ఉన్నాయి. ఆ రోజునుంచి చంద్రబాబు ఈ హెచ్చరిక చెబుతూనే ఉన్నారు. అయినా ఫలితం మాత్రం లేదు. రాష్ట్రంలో ఏ మూల కూడా దందాలు ఆగిన దాఖలాలు మాత్రం లేవు.

ఎమ్మెల్యేల అరాచక దోపిడీ పర్వాన్ని అరికట్టలేకుండా.. ఇసుక విక్రయాల విషయంలో చంద్రబాబు ఎన్ని కొత్త రాయితీలు ప్రకటిస్తే మాత్రం ప్రయోజనం ఏముంటుంది? అనేది ప్రజల ప్రశ్న! సీనరేజీ చార్జీల రద్దు ద్వారా ప్రభుత్వానికి 200 కోట్ల నష్టం చేశారు చంద్రబాబు. ఈ రెండొందల కోట్లను తెదేపా ఎమ్మెల్యేలు పంచుకుతినేయకుండా అడ్డుకునే వ్యవస్థను ఆయన రూపొందించారా? అనేది ప్రశ్న.

ప్రజలకు అందే ధరలో తగ్గుదల కనిపించకపోతే.. ఇలాంటి మార్పులు ఎన్ని చేసినా దండగే. పంచాయతీలకు అందే పన్నులను కూడా రద్దు చేసేసి ప్రజల ఇంటికి ఉచితంగా రవాణా ఖర్చులు కూడా భరించి ఇచ్చినప్పటికీ.. ఎమ్మెల్యేలు సాగిస్తున్న అక్రమ దందాలను, అరాచకపర్వాన్ని నియంత్రించకపోతే.. ప్రభుత్వం చాలా తొందరగా భ్రష్టుపట్టిపోతుందని సీఎం తెలుసుకోవాలి.

5 Replies to “దందాలు ఆపకుండా ఎన్నిచేసినా దండగే!”

Comments are closed.