డ్రగ్స్ పరీక్షల సవాళ్లు తుస్సుమంటున్నాయ్!

అసలు రాజ్ పాకాల పార్టీలో డ్రగ్స్ వినియోగించారో లేదో ఖరారు కాలేదు. విజయ్ మద్దూరుని, రాజ్ పాకాలను విచారించడం మాత్రం జరిగింది. కేటీఆర్ కు స్వయంగా డ్రగ్స్ వ్యాపారంతోనే లింకులు ఉన్నాయేమో అని సందేహం…

అసలు రాజ్ పాకాల పార్టీలో డ్రగ్స్ వినియోగించారో లేదో ఖరారు కాలేదు. విజయ్ మద్దూరుని, రాజ్ పాకాలను విచారించడం మాత్రం జరిగింది. కేటీఆర్ కు స్వయంగా డ్రగ్స్ వ్యాపారంతోనే లింకులు ఉన్నాయేమో అని సందేహం కలిగించేంతగా రాద్ధాంతమూ జరిగింది. అసలు డ్రగ్స్ సంగతి తేలనే లేదు గానీ.. అధికార విపక్షాల మధ్య డ్రగ్స్ చుట్టూ అనవసరపు సవాళ్లు, ప్రతిసవాళ్లు మిన్నంటుతున్నాయి.

రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలంటూ భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు. భారాస ఎమ్మెల్యేలు కూడా చేయించుకోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సవాలు చేశారు. ఇవన్నీ సాధారణంగా మాటల తూటాలే తప్ప పేలేవి కాదని ప్రజలు అనుకుంటూ ఉండగానే.. కాంగ్రెస్ ఎంపీ ఒకరు, ఎమ్మెల్సీ ఒకరు వెళ్లి డ్రగ్ టెస్టులు చేయించుకున్నారు. ఇప్పుడు అసలు సవాలు విసిరిన పాడి కౌశిక్ రెడ్డి మాట మారుస్తుండడం విశేషం.

కౌశిక్ రెడ్డి కాంగ్రెసు ఎమ్మెల్యేలు డ్రగ్ టెస్టులు చేయించుకోవాలని సవాలు విసిరారు. అలా సవాలు చేసే మొనగాడు ఎవరైనా సరే ముందుగా తాను టెస్టులు చేయించుకుని.. ఆ తర్వాత ఎదుటి వారికి సవాలు విసరడం అనేది ధర్మంగా ఉంటుంది. కానీ రాజకీయ సంచలనం క్రియేట్ చేయడానికి మాటలు రువ్వడం తప్ప ఆచరణ శీలత మనవాళ్లకు ఉండదనడానికి నిదర్శనంగా కౌశిక్ రెడ్డి సవాలు చేసేశారు. దానికి స్పందించిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, శాసనమండలి సభ్యుడు బల్మూరి వెంకట్ బుధవారం హైదర్ గూడ లోని అపోలో ఆస్పత్రికి వెళ్లి డ్రగ్స్ నిర్ధరణ కోసం డీఓఏ 6 డ్రగ్ ప్యానల్, మూత్ర శాంపిల్ టెస్టులు చేయించుకున్నారు.

వాళ్లు ఆ రిపోర్టుల ఫలితాలను కూడా చేతిలో పట్టుకుని మీడియాకు ఫోజులిస్తూ.. మేం టెస్టులు చేయించుకున్నాం. కేటీఆర్ మీద ఇప్పటికే అనేక డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. కేటీఆర్, కౌశిక్ రెడ్డి ఇద్దరూ వచ్చి పరీక్షలు చేయించుకుని, తమ పరిశుద్ధతను నిరూపించుకోవాలని సవాలు విసురుతున్నారు.

అయితే దీనికి కౌశిక్ రెడ్డి స్పందిస్తున్న తీరు చిత్రంగా ఉంది. డ్రగ్ పరీక్షలకు మాకు చెప్పకుండా వెళ్లి చేయించుకుంటే ఎలా? అని డొంకతిరుగుడు మాటలు చెబుతున్నారు. భారాస ఎమ్మెల్యేలంతా సిద్ధంగా ఉన్నాం అని అంటున్నారు. సిద్ధంగా ఉన్నవాళ్లు ఇంకా ముహూర్తాలకోసం చూస్తున్నారా.. వెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చు కదా అనేది ప్రజల సందేహం. కాంగ్రెసులో ఇద్దరు చేయించుకున్నారు. కౌశిక్ రెడ్డికి ధైర్యం ఉంటే తాను చేయించుకోవాలి.

రేవంత్ కూడా చేయించుకోవాలని డిమాండ్ చేయాలని అనుకుంటే.. ముందు కేటీఆర్ ను కూడా డ్రగ్ టెస్టులు చేయించుకోమని చెప్పి.. ఆ రిపోర్టులతో రేవంత్ కు సవాలు విసరాలి. ఆ సవాలును రేవంత్ స్వీకరించకపోతే.. ఆయన డ్రగ ఎడిక్ట్ అనే విమర్శలకు దిగాలి.. అని ప్రజలు అంటున్నారు.

8 Replies to “డ్రగ్స్ పరీక్షల సవాళ్లు తుస్సుమంటున్నాయ్!”

Comments are closed.