స్మ‌గ్ల‌ర్‌ను హీరోగా చూపించిన సినిమాకు రాయితీలా?

టికెట్ల రేట్ల పెంపున‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని నారాయ‌ణన సూచించడం విశేషం.

పుష్ప‌-2 సినిమాపై వివాదం కొన‌సాగుతూనే వుంది. అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా శ‌నివారం చ‌ట్ట‌స‌భా వేదిక‌గా హీరో బ‌న్నీపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. సినిమా చూసేందుకు వెళ్లిన ఒక మ‌హిళ మృతి చెంద‌డంతో పాటు ఆమె కుమారుడు చావుబ‌తుకుల మ‌ధ్య పోరాడుతున్నాడ‌న్నారు. అలాంటి బాధిత కుటుంబంపై సినిమా వాళ్ల‌కు సానుభూతి ఎందుకు లేదో అర్థం కావ‌డం లేద‌న్నారు.

పుష్ప హీరో అల్లు అర్జున్‌కు ఏమైంద‌ని చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన వాళ్లంతా ప‌రామ‌ర్శ‌కు వెళ్లార‌ని ఆయ‌న నిల‌దీశారు. ఇక‌పై బెన్‌ఫిట్ షోల‌కు టికెట్ పెంచుకునే వెస‌లుబాటు క‌ల్పించేది లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఈ నేప‌థ్యంలో సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ మ‌రో అడుగు ముందుకేసి చిత్ర ప‌రిశ్ర‌మ‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

పుష్ప‌-2 సినిమాలో స్మ‌గ్ల‌ర్‌ను హీరోగా చూపార‌ని, అలాంటి సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునేలా రాయితీలు ఇవ్వ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. ఇలాంటి నెగెటివ్ సందేశాన్ని పంపే సినిమా చూసేందుకు ప్ర‌జ‌ల‌పై భారం వేసిన ప్ర‌భుత్వ‌మే మొద‌టి ముద్దాయి అని ఆయ‌న మండిప‌డ్డారు.

ఇక‌పై ప్ర‌జ‌ల‌కు, సినిమా అభిమానుల‌కు సందేశం, చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న సినిమాల‌కు మాత్ర‌మే రాయితీలు, టికెట్ల రేట్ల పెంపున‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని నారాయ‌ణ సూచించడం విశేషం.

6 Replies to “స్మ‌గ్ల‌ర్‌ను హీరోగా చూపించిన సినిమాకు రాయితీలా?”

Comments are closed.