పుష్ప ఇచ్చిన ప్రోత్సాహం.. మ‌రిన్ని డిజాస్ట‌ర్ల‌కు వెల్క‌మ్!

ఇటు ఫిక్ష‌న్ కు సంబంధం లేకుండా.. ఎలివేష‌న్ల స్టోరీ, ఇప్పుడు ఎర్ర‌చంద‌నం స్మగ్ల‌ర్ పాత్ర‌కు వాస్త‌విక‌త‌తో సంబంధం లేని క‌థ‌, క‌థ‌నాల‌తో కూడిన సినిమా..

ఈ మ‌ధ్య‌నే ఒక నిర్మాత ఒక యూట్యూబ్ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు.. అస‌లు సినిమాకు క‌థ ఎందుకు? అని ఆయ‌న ప్ర‌శ్నించారు! ఎప్పుడో వ‌చ్చిన మాయాబ‌జార్ నుంచి తెలుగు సినిమా తీయ‌డంలో త‌న‌కు పండిపోయిన అనుభ‌వం ఉంద‌ని భావిస్తున్న ఆ నిర్మాత‌.. అస‌లు తెలుగు సినిమాకు క‌థ ఎందుకు అని ప్ర‌శ్నించేశాడు. ఫైట్లున్నాయా, పాట‌లున్నాయా.. ఎలివేష‌న్ ఉందా.. ఇలాంటివి చూడాలి కానీ, క‌థ, కాక‌ర‌కాయ్ అంటారేంటంటూ విసుగు చూపించాడు. అలాగే తాము తీసే సినిమాల‌ను ఆ మాత్రం ధ‌ర పెట్టి చూడ‌క‌పోతే ఎలా అంటూ కూడా జ‌నాల మీద విసుక్కున్నాడు!

సినిమాల కోసం ఆ మాత్రం టికెట్ ధ‌ర పెట్ట‌లేని జ‌నాల బ‌తుకు ఎందుకు అన్న‌ట్టుగా ద‌బాయించాడు! ఈయ‌న తీసిన క‌ళాఖండాల‌తో ఆ కాన్ఫిడెన్స్ వ‌చ్చిన‌ట్టుగా ఉంది! అయితే ఆ నిర్మాత అలా బ‌య‌ట‌ప‌డ్డాడు కానీ, చాలా మంది నిర్మాత‌ల ఫీలింగ్ కూడా ఇదేన‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌త్యేకించి ఎలివేష‌న్ల పుష్ప-2 భారీ వ‌సూళ్ల‌ను సంపాదించుకునే స‌రికి.. తెలుగు సినిమా మ‌రి కొన్నాళ్లు ఇక్క‌డితోనే ఆగిపోయే ప‌రిస్థితి క‌నిపిస్తూ ఉంది!

పుష్ప 2 సినిమాను చూస్తే.. అది తొలి భాగం విడుద‌లైన స‌మ‌యంలోనే అల్లుకున్న క‌థ‌లా అగుపించ‌దు! అస‌లు.. ఆ పుష్ప క‌థ వేరు, ఇది వేరు! తొలి భాగంలో 90ల నాటి తెలుగు ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ క‌థ అన్న‌ట్టుగా సాగుతుంది. ఆ పార్టులో పోలిస్ స్టేష‌న్ సీన్ల‌లో చంద్ర‌బాబు ఫొటోను చూపిస్తారు.

చంద్ర‌బాబు సీఎం హోదాలో ఉన్న‌ప్ప‌టి క‌థ అన్న‌ట్టుగా చూపించారు. అయితే సెకెండ్ పార్టుకు వ‌చ్చే స‌రికి సీఎం ప‌ద‌వి చుట్టూరానే చాలా క‌థ‌న‌డుస్తుంది. ఇక్క‌డ‌కు వ‌చ్చే సరికి ఫిక్ష‌న‌ల్ సీఎంలు! అయితే మొత్తం ఫిక్ష‌న‌ల్ గా ఉండాలి, లేదంటే అస‌లు వాళ్ల‌ను చూపాలి. కానీ ఫ‌స్ట్ పార్టులో రియ‌లిస్టిక్ సీఎం, రెండో పార్టుకు వ‌చ్చే స‌రికి మొత్తం ఫిక్ష‌న‌ల్ సీఎంలు! అలాగే పాడుబ‌డ్డ ఆల‌యంలో ఫైటు జ‌ర‌గ‌డం, హీరో అమ్మవారి వేషంతో ఫైట్లు చేసేయ‌డం కూడా.. ఇదంతా రెండు మూడేళ్ల ట్రెండ్!

కాంతారా, కార్తికేయ 2, హ‌నుమాన్ వంటి సినిమాలు ఎలా వ‌ర్క్ ఔట్ అయిన విష‌యాన్ని గ్ర‌హించి.. క‌థ‌న‌మంతా ఈ ట్రాక్ కు తిప్పార‌ని స్ప‌ష్టం అవుతూనే ఉంది! ఆ వ్యూహ‌మే ఫ‌లించింది కూడా! హిందీ బెల్ట్ ఈ సినిమాకు భారీ వ‌సూళ్లు అట‌! హిందీ వెర్ష‌న్ కు ఇప్ప‌టి వ‌ర‌కూ రెండున్న‌ర కోట్ల‌కు పైగా టికెట్లు తెగాయ‌ట‌. తెలుగు వెర్ష‌న్ కు కోటిన్న‌ర స్థాయిలో టికెట్లు అమ్ముడ‌యితే.. హిందీ వెర్ష‌న్ ఏకంగా రెండున్న‌ర కోట్ల టికెట్ల‌ను అమ్మింద‌ట‌. అయితే హిందీ బెల్ట్ లో భారీ జ‌నాభా ఉండొచ్చు. అయినా.. రెండున్న‌ర కోట్ల టికెట్లు అంటే త‌క్కువ కాదు. ఇంకా ర‌న్ ఉందంటున్నారు. ఈ ర‌కంగా టార్గెటెడ్ ఆడియ‌న్స్ ను పుష్ప 2 క్యాష్ చేసుకుంది!

మ‌రి ఇదే త‌ర‌హా క‌థ‌నంతో.. మూడో పార్టుకు కూడా హిందీ జ‌నాలు వెల్క‌మ్ చెబుతున్నార‌నుకోవాలి! ఆ సంగ‌త‌లా ఉంటే.. పుష్ప 2 ఎలివేష‌న్లు, ఫైట్లతో ఇలా వెయ్యి కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లు అనే స‌రికి.. తెలుగు సినిమా ఆ చ‌ట్రంలోనే మ‌రింత‌గా కూరుకుపోయే అవ‌కాశాలు కూడా క‌నిపిస్తున్నాయి. ఇక‌పై తెలుగు సినిమాలు ఇలానే వ‌స్తాయి. ప్ర‌త్యేకించి స్టార్ హీరోల సినిమాల‌న్నీ.. ఇలాంటి ఎలివేష‌న్లు, హిందీ బెల్ట్ టార్గెట్లు, పాన్ ప‌రాగ్ పాత్ర‌లే వ‌స్తాయి, ఎందుకంటే.. ఇలాంటి సినిమాలే జ‌నాల‌కు న‌చ్చుతున్నాయ‌ని పుష్ప 2 క‌లెక్ష‌న్ల లెక్క‌లు క్లూ ఇస్తున్నాయి!

పుష్ప 2 ఇచ్చిన ఈ క్లూ ఫ‌లితంగా.. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన్ మెంట్ పేరుతో.. మైండ్ లెస్ , లాజిక్ లెస్, స్టోరీ లెస్ సినిమాలే తెలుగు నుంచి మ‌రిన్ని ఇబ్బ‌డిముబ్బ‌డిగా రాబోతున్నాయ‌ని క‌చ్చితంగా చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ లా అటు చ‌రిత్ర‌కు, ఇటు ఫిక్ష‌న్ కు సంబంధం లేకుండా.. ఎలివేష‌న్ల స్టోరీ, ఇప్పుడు ఎర్ర‌చంద‌నం స్మగ్ల‌ర్ పాత్ర‌కు వాస్త‌విక‌త‌తో సంబంధం లేని క‌థ‌, క‌థ‌నాల‌తో కూడిన సినిమా.. ఇవే ఇప్పుడు సేల్ అవుతున్నాయి కాబ‌ట్టి.. ఇక భారీ సినిమాల‌న్నీ ఈ త‌ర‌హాలోనే వ‌స్తాయి. ప్ర‌తి సినిమా వెయ్యి కోట్ల టార్గెట్ అంటుంది. దీని కోసం ఎలివేష‌న్లు పెట్టి.. హిందీ పాన్ ప‌రాగ్ జ‌నాల టార్గెట్ గా తెలుగు సినిమా రూపొంద‌బోతోంది!

గ‌తంలో నాన్ సెన్సిక‌ల్ యాక్ష‌న్ సినిమాలు.. హిందీలోకి అనువాదం అయిపోయి యూట్యూబ్ లో సూప‌ర్ హిట్ అయ్యాయి. మాస్, డాన్ నంబ‌ర్ వ‌న్, బోయ‌పాటి సినిమాలు, ఇలాంటి వ‌న్నీ యూట్యూబ్ లో హిందీ జ‌నాల‌ను తెగ ఆకట్టుకున్నాయి. మ‌రి అది అక్క‌డితో పోయేది. ఇప్పుడు డైరెక్టుగా హిందీ థియేట‌రిక‌ల్ మార్కెట్ తెలుగు హీరోల‌కు రుచిగా మారింది. దీంతో ఇక‌పై హిందీ మాస్ జ‌నాల టేస్టుకు త‌గ్గ‌ట్టుగా తెలుగు స్టార్ హీరోల సినిమాలు క్యూ క‌ట్ట‌బోతున్న దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి. హిందీ బెల్ట్ పై ఆధిప‌త్యం కోసం ఇప్ప‌టి తెలుగు హీరోలు ఇక పోటీలు ప‌డ‌తారు. దీంతో ఊర‌మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్లే దిక్కువుతాయి!

అయితే తెలుగు ప్రేక్ష‌కుల ప‌రిస్థితి వేరేలా ఉంది, వారు ఇప్ప‌టికే వీటిని భ‌రించ‌లేని స్థితికి చేరుకుంటున్నారు. రొడ్డ సినిమాలు తీసి వేల రూపాయ‌ల టికెట్ ధ‌ర పెడుతున్నార‌నే వాద‌న‌లు ప్ర‌బ‌లుతున్నాయి. దీంతో ప్రేక్ష‌కులే స్టార్ హీరోల సినిమాల‌ను ప‌ట్టించుకోని స్థితికి వ‌చ్చేశారు. అయితే వారిని ప‌ట్టించుకునే ప‌రిస్థితుల్లో తెలుగు స్టార్ హీరోలు ఇప్పుడు లేర‌ని చెప్పొచ్చు. వారి టార్గెట్ ఇప్పుడు వేరే!

8 Replies to “పుష్ప ఇచ్చిన ప్రోత్సాహం.. మ‌రిన్ని డిజాస్ట‌ర్ల‌కు వెల్క‌మ్!”

  1. It is true that spectators encourage both positive and negative emotions. In fact, most of the films strike people with emotions. This happened with this film though negative. But history revealed already that such films without solid story and reason will definitely be rejected by spectators even though participated by big stars.

Comments are closed.