దీని తొలిభాగం చీకట్లో సూర్యుడు 01లో చదవండి. హీరో బయలుదేరిన స్పేస్‌షిప్ పేరు సుహృద్భావ. సుహృద్భావలోకి వాయుపుత్ర తను కొత్తగా తయారుచేసిన కంప్యూటర్ను కూడా తీసుకు వచ్చాడు. దాని పేరు బ్రహ్మవిద్య. మనిషికి ఏ మాత్రం తీసిపోదు. సలహాలు చెప్తుంది, జోకులేస్తుంది, ఆటలాడుతుంది, కావలసిన వాళ్ల కోసం అబద్దాలాడుతుంది. చివరకు త్యాగాలు కూడా చేస్తుంది. ఈ ప్రయాణంలో చెప్పుకోవలసినదేమిటంటే అనూహ్య పడే మానసిక సంఘర్షణ. ఆమె దురదృష్టం కొద్దీ యశ్వంత్, వాయుపుత్ర యిద్దరూ ఆమె కళ్ల ఎదుటే వున్నారు. ఏ ఒక్కరున్నా ఆమె వాళ్లతో ఎటాచ్ అయిపోయేదేమో! ఇద్దరూ వుండడంతో ఎవరివైపు మొగ్గు చూపాలో తెలియక కొట్టుమిట్టులాడేది. 'నా భర్త యశ్వంతే' అని వాయుపుత్రకు చెప్పాలంటే ధైర్యం లేదు. 'నిన్ను వదిలేశాను, యిప్పుడు వాయుపుత్రే నా ప్రియుడు' అని యశ్వంత్‌కు చెప్పాలన్నా ధైర్యం లేదు. సైకియాట్రిస్టు సలహా మేరకు విషయం యిదీ అని చెబుతూ యశ్వంత్‌కు ఉత్తరం రాసింది కానీ అది అతనికి అందకుండానే ప్రయాణం ప్రారంభమైంది.
ఇదిలావుండగానే వీళ్లు అంతరిక్షంలో వెళుతూండగా రెండు ఉపగ్రహాలు గుద్దుకున్నాయి. వాటిని వీళ్లు తప్పించుకున్నారు కానీ అవి ఢీ కొట్టడం వలన ఉత్పన్నమైన కైనెటిక్ ఎనర్జీ ఈ నౌకను అతలాకుతలం చేసింది. నౌక ఒరిగిపోయింది. నిఖిల్ కాలు పానెల్ కింద యిరుక్కుపోయింది. యశ్వంత్ కింద పడిపోవడంతో తలకు దెబ్బ తగిలింది. చాలా రోజులు స్పృహ కోల్పోయాడు. డాక్టర్ ఫిలిప్స్ తన రక్తం యిచ్చి అతన్ని కాపాడాడు. అనూహ్య యశ్వంత్‌కు నిరంతరంగా సేవ చేసింది. ఆ ప్రాసెస్‌లో అతనితో మానసికంగా దగ్గరయింది. యశ్వంత్‌కు ఈ ప్రమాదం జరిగితే వాయుపుత్రకు మరో ప్రమాదం జరిగింది. ఈ ఉపగ్రహాలు కొట్టుకోవడటంలో నౌక సోలార్ ప్యానెల్ దెబ్బతింది. సోలార్ ఎనర్జీ లీకయి, స్పీడు తగ్గిపోయింది. అది కనుక రిపేరు చేయాలంటే, బయటకు వెళ్లి బాగుచేయాలి. దాన్ని ముట్టుకుంటే షాక్ కొట్టి ప్రాణాపాయం కలుగుతుంది. వాయుపుత్ర అంత రిస్కు తీసుకోవడం యశ్వంత్‌కి యిష్టం లేదు. వద్దన్నాడు. కానీ వాయుపుత్ర వెళ్లాడు. రిపేరు చేశాడు కానీ షాక్ తిని మూర్ఛపోయాడు.
అతన్ని నౌకలోకి తీసుకురావాలి. డాక్టర్ ఫిలిప్స్, యశ్వంత్ యిద్దరూ వీక్ గానే వున్నారు. నిఖిల్ కాలికి దెబ్బ. వెళ్లలేదు. అనూహ్యకు అంత శక్తి లేదు. అప్పుడు డాక్టర్ ఫిలిప్స్ త్యాగం చేశాడు. 'కావలసిన మందులన్నీ బ్రహ్మవిద్యలో ఫీడ్ చేశాను, నా అవసరం లేదు' అంటూ అతను బయటకు వెళ్లాడు. వాయుపుత్ర నడుముకున్న బెల్టు పట్టుకుని వెనక్కు ఈదడం ప్రారంభించాడు. వాయుపుత్రను ద్వారంలోంచి లోపలికి తోస్తూండగానే ఫిలిప్స్‌కి గుండెపోటు వచ్చింది. తను వుంటే నౌకకు భారమే తప్ప వుపయోగం లేదనుకుని అతను వెలుపలే వుండిపోయాడు. అంటే అంతరిక్షంలో అలా అలా కొట్టుకుపోయాడు. ఫిలిప్స్ పోతూ పోతూ అనూహ్యకు తన మనసులో మాట చెప్పేయమని సలహా యిచ్చాడు. ఆమె వాయుపుత్రను పిలిచి తన భర్త వేరెవరో కాదు, యశ్వంతే అని చెప్పింది. యశ్వంత్ పై అపారగౌరవం వున్న అతను వెంటనే 'అతనే నీకు సరైన భర్త, అతనిలాటి వ్యక్తి సంతోషం కోసం నాలాటివాడు తప్పుకుంటే మంచిది' అన్నాడు.
అలాగే యశ్వంత్ వద్దకు వెళ్లి వాయుపుత్ర గురించి చెప్పబోతే 'ఉత్తరంలో రాశావుగా' అన్నాడతను. 'అరే, మీకందిందా?' అంటే 'అందింది. మనిద్దరి మధ్యా వున్నది వాత్సల్యం, భక్తి, అవి కాదు కావలసినది. మీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోండి.' అన్నాడు. అప్పుడు అనూహ్య 'నేను యిప్పుడు కనుక్కున్న యాంటీ వైరస్ పరిశోధనల్లో డాక్టర్ ఫిలిప్స్కూ భాగం వుంది. ఆయన మానవాళికి ఎంతో చేశాడు. ఆ మానవాళిని కాపాడాలని, వాయుపుత్ర కోసం తన ప్రాణం త్యాగం చేశాడు. నిజమైన మానవత్వం అది. ఇద్దరు మగవాళ్ల ప్రేమలో ఎవర్ని ఎన్నుకోవాలి అన్న సందేహంలో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాను నేను. ఎంత అల్పమైంది నా సమస్య! నా కిప్పుడు తెరిపిగా వుంది. నాకు మీ యిద్దరూ కావాలి, స్నేహితులుగా! బ్రతికి బయటపడితే భూమికి తిరిగి వెళ్లి పరిశోధనలకు ప్రాణం పోస్తాను' అంది.
ఈ లవ్ ట్రయాంగిల్ యిలా సుఖాంతమైంది కానీ సరిగ్గా యిదే సమయంలో ఈ నౌక బ్లాక్‌హోల్‌లో చిక్కుకుంది. బ్లాక్‌హోల్ గురించి కాస్త చెబుతాను. ఇప్పుడు మనమంతా భూమికి ఎందుకు అంటి పెట్టుకుని వున్నాం? ఆకర్షణశక్తి వల్ల. అది లోపలకు లాగే శక్తి, అంటే భూమిని సంకోచింపచేస్తుంది. దీని పై భాగపు ఒత్తిడికి అంతర్భాగంలో విపరీతమైన వేడి జనిస్తుంది. దాని వల్ల భూగోళం వ్యాకోచిస్తుంది. ఈ వ్యాకోచ, సంకోచాల మధ్య నిరంతర ఘర్షణ. కోట్లాది సంవత్సరాలు యిలా జరుగుతూనే వుంటాయి. ఎక్కడో ఓ స్టేజి దగ్గర ఈ రెండు శక్తులూ రాజీకి వస్తాయి. ఒకవేళ ఏదైనా కారణంగా అంతర్భాగంలో వేడి చల్లారిపోయిందనుకోండి. అప్పుడేమవుతుంది? వ్యాకోచ ప్రక్రియ ఆగిపోతుంది. కానీ సంకోచం సాగుతూనే వుంటుందిగా. ఆకర్షణశక్తి వల్ల లోపలికి కుంచించుకుపోతూ వుంటుంది. ఆ స్టేజీగాని భూమికి వస్తే అది ఫుట్ బాల్ సైజు అయిపోతుంది. ఇలా అయిపోయిన గోళాల్ని న్యూట్రాన్ స్టార్స్ అంటారు. దానివల్ల ఆకర్షణ శక్తి మరింత పెరుగుతుంది.
ఎందుకు? ఆకర్షించే ఏరియా తక్కువ, దూరం తక్కువ. అందువల్ల అలా అలా భూకేంద్రంలోకి ఈ పదార్థాలు, లేదా అణుసముదాయాలు వెళ్లిపోతూ, వెళ్లిపోతూ చివరకు ఫుట్బాలై, టెన్నిస్బాలై, తర్వాత గోళీ ఐ, ఆ తర్వాత గోళీ కూడా వుండదు. ఒట్టి ఆకర్షణశక్తే మిగులుతుంది. ఆ శక్తి ఎంతటిదంటే వెలుతుర్ని కూడా మింగేస్తుంది. బయటకు పోనివ్వకుండా తనవైపుకు లాక్కుంటుంది. అందువల్ల దీన్ని బ్లాక్ హోల్ అంటారు. అందులో పడ్డవాళ్లు బయటకు రావడం ఉత్తది. వీరేంద్రనాధ్ తన సుహృద్భావ్ నౌకను బ్లాక్‌హోల్‌లోకి పంపేశారు కాబట్టి కథ సమాప్తం అనుకోవద్దు. ఆయన కాల్పనిక రచయిత కాబట్టి వాళ్లని బయటకు లాక్కుని వచ్చారు. 70 సంవత్సరాలపాటు వాళ్లు అందులో పడి వున్న తర్వాత వేరే గ్రహవాసులు, ప్లానెట్ వేగా వాళ్లు, బ్లాక్‌హోల్ శక్తితో పోరాడగలిగిన శక్తి సామర్థ్యాలున్న మొనగాళ్లు వీళ్లను కాపాడారు.
వాయుపుత్ర కళ్లు తెరిచాడు. బ్రహ్మవిద్యా అని అరుస్తూ లేవబోయాడు. 'మీరంత గట్టిగా మాట్లాడవలసిన పని లేదు. మాకసలే సౌండ్ ఎలర్జీ.' అని వినబడింది. కళ్ల ఎదురుగా మనిషి కనబడటం లేదు. వాళ్లు టెలివతీ ద్వారా వీళ్ల ఆలోచనలను గ్రహించి, వీళ్లతో కమ్యూనికేట్ చేస్తున్నారు. వీళ్ల భాషను వాళ్ల కంప్యూటర్ అనువదించి చెప్పేస్తుంది వాళ్లకు వీళ్లు. వీళ్లకు వాళ్లు మొత్తం కథంతా చెప్పుకున్నారు. ఆల్ఫా గ్రహం గురించి, ఇంటర్ ప్లానెటరీ సొసయిటీ గురించి, వీళ్ల నౌకను వాళ్లు ట్రాక్ చేయడం గురించి, బ్లాక్‌హోల్ లోంచి బయటకు లాగడం గురించి….! కాస్సేపటికి వెలుతురు కాస్త కళ్లకు అలవాటు పడ్డాక వాళ్లు దర్శనమిచ్చారు. ఒకతని పేరు వేగా బి సెవెన్. వాళ్లలో వాయురూపం ఎక్కువుంటుంది. వాళ్ల గ్రహానికి ఆకర్షణ ఎక్కువ లేదు. అందుకని కవచాలు ధరించి నడుస్తారు. కళ్లప్రాంతంలో రెండు వజ్రాలు బిగించినట్టు మెరుపు వుంది. సన్నగా, పొడుగ్గా వున్నారు. వాళ్లు ఆండ్రోమిడా గాలక్సీనుండి న్యూట్రాన్ శక్తిని తెచ్చుకుని వాడుకుంటున్నారు, అక్కడంతా నిశ్శబ్దంగా వుంది. వాళ్లకు వినోదం కావాలంటే భూలోకవాసుల పార్లమెంటు దృశ్యాలు చూస్తారట. అందరూ తిట్టుకుంటూ, తన్నుకుంటూ వుంటే వాళ్లకు వినోదం.
వాళ్లు వీళ్లని ఆల్ఫా గ్రహంలో జరిగే సొసైటీ మీటింగుకు పంపించారు. ఐదు గ్రహాలనుండి ఐదుగురు జడ్జిలు వచ్చారు. ఆల్ఫానుండి ఒక ప్రతినిథి. భూమినుండి యశ్వంత్ ప్రతినిథి. యశ్వంత్ తాము సూర్యుడి మీద ఎంత ఆధారపడివున్నామో చెప్పి ఆల్ఫా వాసులు సూర్యుడి నుండి శక్తి తీసుకోకుండా నిరోధించాలని అభ్యర్థించాడు. ఆల్ఫా వాళ్ల వాదనేమిటంటే, సూర్యుడు చిన్న నక్షత్రం. ఆ శక్తినంతా పదార్థంగా మారిస్తే కేవలం రెండు చదరపు మైళ్ల వస్తువుగా మారుతుంది. దాన్ని మా గ్రహానికి తరలించడం సులభం. పైగా సూర్యుణ్ని తేవడం వల్ల భూమి నాశనం అయి మనకు రుచికరమైన మాంసం లభిస్తుంది. మా అంతరిక్షనౌకలోంచి ఓ మానవుణ్ని హిప్నటైజ్ చేసి బయటకు లాగాం. అతని పేరు రాయ్. అతని మాంసం చాలా రుచిగా వుంది. మీ అందరికీ పంపాం. అందరికీ నచ్చింది. ఇప్పుడు మాకు అనుమతి నిస్తే భూలోకవాసుల మాంసం బోల్డంత లభిస్తుంది. మన అయిదు గ్రహాల వాళ్లకు కొన్ని వందల ఏళ్లకు సరిపోతుంది అని వాదించారు.
నవల క్లయిమాక్స్‌కి వచ్చాం కదా. వీరేంద్రనాథ్ దీన్ని చాలా బాగా మలిచారు. ఒక మానవీయ కోణాన్ని ప్రవేశపెడుతూ, భూలోకవిజయానికి ఓ ఉపాయం కూడా సూచించారు. ఆల్ఫా వాసుల వాదన వినగానే ఎంతన్యాయం? అనిపిస్తుంది కదా. అదే అంటాడు యశ్వంత్. అప్పుడు ఆల్ఫావాళ్లు మనం జంతువులపై చేసే అత్యాచార దృశ్యాలను చూపిస్తారు. వేడుక కోసం తిమింగలాలను చంపడం, విలాస వస్తువుల కోసం, సౌందర్య సాధనాల కోసం, అత్తర్ల కోసం జంతువులను హింసించడం, యివన్నీ చూపించి, 'తమ కంటె తెలివితక్కువ ప్రాణులు కదాని వీళ్లు వాటిని నాశనం చేస్తున్నారు. మనం వీళ్లకంటె తెలివైన వాళ్లం, వీళ్లని చంపితే తప్పేముంది? అంతే కాదు, తమతో సమానమైన జీవులను కూడా జాతి వివక్షత పేరుతో హింసిస్తున్నారు. వీళ్లా మనకు ధర్మపన్నాలు చెప్పేది?' అంటాడు ఆల్ఫా ప్రతినిథి.
యశ్వంత్ నోరెత్తలేకపోయాడు. మర్నాడు తీర్పు భూలోకవాసులకు వ్యతిరేకంగా వెలువడింది. 'ఇంతటి క్రూరులైన వీళ్లకు బ్రతికివుండే అర్హత లేదు. వాళ్లు పవిత్రమైన బుద్ధిజీవులు కారు. వారి బుద్ధి బ్రతకటానికి కాక, మారణహోమం కోసం ఉపయోగపడుతోంది. అందువల్ల సూర్యుడి శక్తిని వాడుకోవడానికి ఆల్ఫా గ్రహానికి అనుమతి యిస్తున్నాం' అని తీర్పు. అది వినగానే ఆల్ఫావాసులు డాన్సు చేయడం మొదలెట్టారు. అంతలోనే ఆ సంబరాల మధ్య ఎక్కడ నుంచో శబ్దం రాసాగింది. యశ్వంత్ ఫీడ్ చేసిన శబ్దాల్ని బ్రహ్మవిద్య రిపీట్ చేస్తోంది. సౌండ్ అలర్జీ వున్న అక్కడి గ్రహవాసులు ఆ అల్ట్రాసోనిక్ శబ్దతరంగాలు సృష్టించే శబ్దానికి మతిభ్రష్టులవుతున్నారు. అప్పుడు వాయుపుత్ర జడ్జీల వైపు తిరిగి “సంపూర్ణ శక్తిమంతులంటూ ఎవరూ వుండరు. మేం బలహీనులమన్నారుగా. శక్తి వుంటే యీ శబ్దాన్ని ఆపండి. మామూలు శబ్దమే స్టీరియోఫోనిక్ సౌండ్‌లో వినిపిస్తే ఆమడదూరం వెళ్లిపోతారు మీరు. ఇది దానికి లక్షరెట్లు శక్తివంతమైంది. శూన్యంలో శబ్దతరంగారలను అల్ట్రాసానిక్గా మార్చే పరికరాన్ని యశ్వంత్ ఈ నౌకలో వుండగా కనుగొన్నాడు. దాన్ని బ్రహ్మవిద్యలో ఫీడ్ చేశాడు. ఆ శబ్దం దరిదాపుల్లోకి వెళ్లడమంటే మృత్యువుని కోరి తెచ్చుకున్నట్టే. ఇప్పటికీ మేమూ మీకంటె తెలివిహీనుల మంటారా?” అన్నాడు. జడ్జీలు చాలా సేపు తర్కించుకున్నారు. “కావాలంటే మీ సౌండ్‌కి ఇన్సులేటర్లను మేం కొద్దిగంటల్లో తయారుచేయగలం. కానీ మీ తర్కానికి, తెగువకూ ముగ్ధులమయ్యాం. సూర్యుడి జోలికి రాం.” అన్నారు.
దీని తర్వాత వేగా గ్రహవాసులు వీళ్లను తమ గ్రహానికి తీసుకెళ్లారు. భూమిమీద వున్న పరిస్థితి చూపించారు. వీళ్లు బయలుదేరేసరికి నిఖిల్ భార్య గర్భవతి. ఆమె ఎలా వుందో చూపమని నిఖిల్ అడిగాడు. “మీరు బయలుదేరి 76 సంవత్సరాలయింది. మీరు బ్లాక్‌హోల్‌లో 70 సంవత్సరాలుండిపోయారు. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మాయి నిఖిల్ మనవరాలి కూతురు.” అన్నాడు. వీళ్లు మ్రాన్పడిపోయారు. ఇప్పుడు వెనక్కి వెళ్లేటప్పటికి ఎన్నేళ్లు పడుతుందో? అప్పుడు వేగా వాళ్లు ఓ ఉపకారం చేశారు. “మీ నౌకను కాంతి వేగానికి మూడు రెట్లు ఎక్కువ వేగంతో తిప్పి పంపిస్తాం. టైమ్ మెషిన్లో మిమ్మల్ని గతంలోకి పంపుతాం.” అని వాళ్లు పన్నెండు రోజుల్లో భూమిని చేరే ఏర్పాట్లు చేశారు. అయితే ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే అంత వేగంతో వెళ్లే నౌక భూమి కక్ష్యలోకి వచ్చేటప్పుడు వేగం తగ్గించాలి. బరువు తగ్గించాలి. అందువల్ల ఒక్కోటి రోదసిలోకి వదిలేయడం మొదలెట్టారు. నౌకలోని లాబ్, ఆహారపదార్థాలు, దుస్తులు, గదులు అన్నీ వదిలేసినా బరువు తగ్గలేదు. చివరకు బ్రహ్మవిద్య నన్ను కూడా బయటకు తోసేయండి అంది. అచ్చు మనిషిలాగే త్యాగం చేసింది. దాన్ని రోదసిలోకి తోసేశారు.
ఈ టీము తమ పనిని విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చింది. నిఖిల్ తన భార్యను కలుసుకున్నాడు. అనూహ్య రిసెర్చిలో పడిపోయింది. యశ్వంత్, వాయుపుత్ర ఎవరి పనుల్లో వాళ్లు పడ్డారు. అద్భుతరసం మహాద్భుతంగా పోషించిన ఈ నవల నీతి ఏమిటో రచయిత వాయుపుత్ర ద్వారా చెప్పించారు. వాయుపుత్రను ఓ విలేఖరి అడుగుతుంది, 'గాలక్సీ అంచులదాకా వెళ్లి వచ్చిన మీరు మానవాళికోసం యిచ్చే సందేశం ఏమిటి?' అని. 'ఆటవిక న్యాయం వదిలేయమని' అంటాడు వాయుపుత్ర క్లుప్తంగా, ఇదీ 'చీకట్లో సూర్యుడు' నవల కథాకథనం. పుస్తకరూపంలో దొరుకుతోంది. చదవండి. బాగుంటుంది. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)