అనంత టీడీపీలో ఆగ‌ని వ‌ర్గ‌పోరు!

అనంత‌పురం జిల్లా.. టీడీపీకి ఒక‌ప్పుడు కంచుకోట‌. 80ల‌లో, 90ల‌లో అనంత‌పురం జిల్లాలో తిరుగులేని స్థాయిలో ఉండిన టీడీపీ ఆ త‌ర్వాత క్ర‌మం త‌ప్ప‌కుండా త‌న ప‌ట్టును చేజార్చుకుంటూ వ‌స్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ…

అనంత‌పురం జిల్లా.. టీడీపీకి ఒక‌ప్పుడు కంచుకోట‌. 80ల‌లో, 90ల‌లో అనంత‌పురం జిల్లాలో తిరుగులేని స్థాయిలో ఉండిన టీడీపీ ఆ త‌ర్వాత క్ర‌మం త‌ప్ప‌కుండా త‌న ప‌ట్టును చేజార్చుకుంటూ వ‌స్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో టీడీపీ గ‌రిష్టంగా 12 సీట్ల‌ను నెగ్గినా..  అది కేవ‌లం రైతు రుణ‌మాఫీ హామీ వ‌ల్ల మాత్ర‌మే! రైతు రుణ‌మాఫీపై ఎన్నో ఆశ‌ల‌తో అనంత‌పురం జిల్లాలో టీడీపీకి అనుకూలంగా అప్పుడు భారీ ఎత్తున ఓటింగ్ జ‌రిగింది. అయితే ఆ హామీ విష‌యంలో చంద్ర‌బాబు అనుస‌రించిన మోస‌పూరిత వైఖ‌రికి ఫలితంగా గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అనంత‌పురం జిల్లాలో రెండు సీట్ల‌లో మాత్ర‌మే నెగ్గింది.

2104లో రెండు సీట్ల‌లో మాత్ర‌మే ఓడిన పార్టీ 2019 నాటికి రెండు సీట్ల‌లో మాత్ర‌మే గెలిచే స్థితికి రావ‌డం అంటే, స్థానికంగా జ‌రిగిన ఎన్నో మార్పుల ఫ‌లితం అది. ప్ర‌త్యేకించి టీడీపీకి ద‌శాబ్దాలుగా న‌మ్మ‌క‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు ఆ పార్టీకి క్ర‌మం త‌ప్ప‌కుండా దూరం అవుతూ వ‌స్తున్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి ప్ర‌వేశ పెట్టిన ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ప‌థ‌కం ద‌గ్గ‌ర నుంచి బీసీల్లో గ‌ణ‌నీయ‌మైన మార్పు మొద‌లైంది. ఆ త‌ర్వాతి రాజ‌కీయ ప‌రిణామాల్లో తెలుగుదేశం పార్టీకి బీసీలు పూర్తిగా దూరం అవుతూ వ‌చ్చారు.

ఫ‌లితంగానే ఒక‌ప్ప‌టి కంచుకోట‌ల‌న్నింటిలోనూ టీడీపీ చిత్త‌య్యింది. టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిందెవ‌ర‌నే అంశంతో నిమిత్తం లేకుండా కంచుకోటల్లో ఆ పార్టీ చిత్త‌య్యింది. మ‌రి ఇదంతా జ‌రిగి మూడేళ్లు గ‌డిచిపోతున్నా… అనంత‌పురం జిల్లా ప‌రిధిలో టీడీపీ మాత్రం పెద్ద‌గా కోలుకున్న వైనాలు క‌నిపించ‌డం లేదు! ప్రజాద‌ర‌ణ‌ను తిరిగి పొంద‌డం మాట ఎలా ఉన్నా.. టీడీపీ క‌నీసం అంత‌ర్గ‌త వ‌ర్గ‌పోరును కూడా ప‌రిష్క‌రించుకోలేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రో!

ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల స‌మ‌యం కూడా లేన‌ట్టే. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడే.. త‌ర‌చూ ఒక మాట చెబుతున్నారీ మ‌ధ్య‌. ఎన్నిక‌లు ఎప్పుడైనా రావొచ్చ‌ని, అతి త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు అంటూ చంద్ర‌బాబు నాయుడు ప‌దే ప‌దే చెబుతూ ఉన్నారు. చెప్ప‌డం వ‌ర‌కూ బాగానే ఉంది కానీ, నిజంగానే ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. వాటిని ఎదుర్కొన‌డానికి నేత‌లున్నారా… అనేది ఆయ‌న ఆలోచిస్తుంటారా? అనేది స‌హ‌జంగా వ‌చ్చే సందేహం. ఎక్క‌డో.. వ‌ద్దు ఒక‌ప్ప‌టి కంచుకోట అనంత‌పురం జిల్లాలోనే చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే టీడీపీ క‌థ అగ‌మ్య‌గోచ‌రంగా అగుపిస్తుంది.

ఈ జిల్లాలో టీడీపీ నేత‌లు చాలా మంది అజ్ఞాత‌వాసంలో ఉన్నారు. కొంద‌రు బీజేపీలో, మ‌రి కొంద‌రు త‌మ అంతఃపురాల‌ను వీడ‌టం లేదు. ఎన్నిక‌ల స‌మ‌యానికి వీరు యాక్టివేట్ అవుతారట‌!

కొంద‌రు ఎన్నిక‌ల స‌మ‌యానికి బీజేపీని వీడి తిరిగి తెలుగుదేశంలో చేర‌తార‌ట‌. మ‌రి కొంద‌రు ఎన్నిక‌ల స‌మ‌యం వ‌ర‌కూ బ‌య‌ట‌కు రార‌ట‌. అప్ప‌టికి త‌మ విలువ ప్ర‌జ‌ల‌కు తెలుస్తుంద‌ని, అందుకే వారు ఇళ్లు క‌ద‌ల‌డం లేద‌ట‌. ఇప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తే ప్ర‌జ‌ల‌కు త‌మ విలువ తెలియ‌ద‌ని, ఎన్నిక‌ల స‌మ‌యానికి వ‌చ్చేస్తే.. వ‌ర‌స పెట్టి ఓట్లు గుద్దేస్తార‌నేది వారి వ్యూహ‌మ‌ట‌!

నిరంత‌రం ప్ర‌జ‌ల మ‌ధ్య‌న ఉండాల్సిన ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు ఈ త‌ర‌హాలో ఆలోచిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌జ‌ల ధోర‌ణి మారింది. నెల రోజుల పాటు నేత‌ల యాక్టివిటీలు పెద్ద‌గా క‌నిపించ‌క‌పోయినా.. ఏదో జ‌రిగింది, అందుకే సైలెంట్ అయ్యార‌ని ప్ర‌జ‌లే విశ్లేషించుకుంటారిప్పుడు. ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేత‌లు.. ఇలా ఎవ‌రైనా స‌రే. ప్ర‌జ‌ల మ‌ధ్య‌న క‌న‌బ‌డ‌క‌పోతే వారిని తెర‌మ‌రుగు అయిన నేత‌లుగానే ప‌రిగ‌ణిస్తున్నారిప్పుడు. అలాంటిది టీడీపీ నేత‌లు.. ఎన్నిక‌ల స‌మ‌యానికి తెర‌పైకి వ‌స్తే చాలు అనే లెక్క‌లు ఎలా వేస్తున్నారో మ‌రి!

ప్రెస్ స్టేట్ మెంట్ల‌ను విడుల చేస్తే చాలు. వాటిని ప‌తాక శీర్షిక‌ల్లో ప్ర‌చురించ‌డానికి ప‌చ్చ‌మీడియా ఎలాగూ ఉండ‌నే ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో… ప్రెస్ నోట్ల‌నే త‌మ ఆయుధాలుగా భావిస్తున్నారు ప‌చ్చ పార్టీ నేత‌లు. లోకేష్ బాబు ట్విట‌ర్ కు ప‌రిమితం అయిన‌ట్టుగా, టీడీపీ నేత‌లు ప్రెస్ నోట్ల‌కు ప‌రిమితం అయ్యారు.

క్యాడ‌ర్ ను క‌లుపుకుపోయేవారు లేరు!

టీడీపీ ఎంత ప్ర‌తిప‌క్షంలో ఉన్నా, ప‌త‌నావ‌స్థ‌లో ఉన్నా.. ఆ పార్టీకి అభిమాన‌గ‌ణం ఉంది. క్యాడ‌ర్ ఉంది. పార్టీ ప‌రిస్థితి బాగా లేకున్నా.. జెండాలు భుజాన మోసుకుని న‌డ‌వ‌డానికి వారు రెడీగా ఉంటారు. అయితే ఆ క్యాడ‌ర్ ను స‌మీకృతం చేసుకోవ‌డాన్ని టీడీపీ నేత‌లు పూర్తిగా మానేయ‌డం గ‌మ‌నార్హం. క్యాడ‌ర్ ను క‌లుపుకుపోయే ప‌నిని నియోజ‌క‌వ‌ర్గం ఇన్ చార్జిలు పూర్తిగా అట‌కెక్కించారు. 

అలాంటి ప‌ని ఒక‌టి ఉంద‌ని కూడా మ‌రిచిపోయారేమో! లేదా ఎన్నిక‌ల స‌మ‌యానికి తాము పిలిస్తే చాలు అంతా ప‌రిగెత్తుకు వ‌స్తార‌నే లెక్క‌లు కాబోలు! నియోజ‌క‌వ‌ర్గానికి ఒక నేత త‌మ‌కు అండ‌గా ఉంటార‌నిపించిన‌ప్పుడే ఏ పార్టీ క్యాడ‌ర్ అయినా ధైర్యంగా క‌దులుతుంది. అయితే పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు అంతా తామే అనిపించుకుని, మంత్రులుగా ముఖ్య నేత‌లుగా చ‌లామ‌ణి అయిన వారు మూడేళ్లు అయినా పూర్తి స్థాయిలో ప‌ని చేయ‌క‌పోవ‌డంతో క్యాడ‌ర్ లోనూ నిస్పృహ స‌హ‌జంగానే ఏర్ప‌డింది. వాస్తవానికి ఇదే తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన అంశం! క్యాడ‌ర్ ఉన్నా.. నేత‌ల తీరుతో ప‌రిస్థితి ఇలా ఉంది.

చంద్ర‌బాబు తెచ్చిన ఇక్క‌ట్లు!

ఇక అధికారం కోస‌మో, అధికారంలో ఉన్న‌ప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌తీయ‌డానికో కానీ.. చంద్ర‌బాబు నాయుడు ఎడాపెడా నేత‌ల‌ను చేర్చుకున్నారు. అలాంటి వారి వ‌ల్ల పార్టీకి ప్ర‌యోజ‌నం ఏమీ ద‌క్క‌లేదు. అయితే ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో.. వారి వ‌ల్ల కొత్త ఇబ్బందులు త‌లెత్తుతున్న‌ట్టుగా ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌లు గ్రూపులుగా విడిపోయింది. 

టీడీపీ పాత కాపు కందికుంట వెంక‌టప్ర‌సాద్ కు తోడు మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా వేరే గ్రూపును మెయింటెయిన్ చేస్తున్నారు. ఈ రెండు గాక మ‌రో గ్రూపు కూడా ఉంద‌క్క‌డ‌! ఇలా చంద్ర‌బాబు నాయుడు తెచ్చి పెట్టిన నేత‌ల వ‌ల్ల పార్టీ గ్రూపులుగా విభ‌జ‌న‌కు గుర‌య్యింది.

టికెట్ వారికా.. వీరికా!

ధ‌ర్మ‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ ప‌రిటాల కుటుంబం ఇన్ చార్జిగా ఉంది. అలాగ‌ని ఆ ఫ్యామిలీ నుంచినే ఎవ‌రో  ఒక‌రు ఇక్క‌డ క‌చ్చితంగా పోటీ చేస్తార‌నే న‌మ్మ‌కం మాత్రం ఎవ‌రిలోనూ ఉన్న‌ట్టుగా లేదు! ఈ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న వ‌ర‌దాపురం సూరి తిరిగి టీడీపీలోకి వ‌స్తార‌ని.. అప్పుడు ఆయ‌న‌కే టికెట్ అని ఒక ప్ర‌చారం ఉంది. పార్టీ వీడి వేరే పార్టీకి వెళ్లిపోయిన వ్య‌క్తి ఎప్పుడు చేరినా అత‌డికే టికెట్ అనే ప్ర‌చారం జ‌రుగుతోందంటే టీడీపీ ద‌యనీయ‌మైన‌ స్థితిని సులువుగా అర్థం చేసుకోవ‌చ్చు. 

అలాగ‌ని ప‌రిటాల ఫ్యామిలీ ఈ నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌ల‌ను మోయ‌గ‌ల‌దా? అనేది కూడా అనుమాన‌మే! రాప్తాడులోనే ప‌రిటాల కుటుంబం గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యింది. ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని నిల‌బెట్టుకోవ‌డ‌మే వారికి ఈ సారికి క‌ఠిన ప‌రీక్ష‌. ఇలాంటి నేప‌థ్యంలో ధ‌ర్మ‌వ‌రం బాధ్య‌త‌లు వారికే ఇచ్చినా.. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో నెట్టుకు రాగ‌ల‌రా? అనేదీ సందేహమే! దీంతో డోలాయ‌మాన ప‌రిస్థితి కొన‌సాగుతూ ఉంది.

క‌ల్యాణ దుర్గం, రాయ‌దుర్గం వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా గ్రూపుల గోల‌. ఎవ‌రు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్నారో అనే క్లూ కూడా లేదు! పెనుకొండ ఇన్ చార్జిగా ఉండిన పార్థ‌సార‌ధిని ఏకంగా హిందూపురం లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఇన్ చార్జిగా ప్ర‌క‌టించేశారు. కంచుకోట లాంటి పెనుకొండ‌లో ఓడిన ఆయ‌న పేరు ఈ నియోజ‌క‌వ‌ర్గం ఆవ‌ల తెలిసిందే త‌క్కువ‌! అలాంటి వ్య‌క్తి, రాజ‌కీయంగా ఫేడ్ ఔట్ అయిన పార్థ‌సార‌ధి, కాలువ శ్రీనివాసులు లాంటి వాళ్ల‌ను లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోటీ చేయిస్తే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌కే అవుతుంది! విశేషం ఏమిటంటే.. వారు ఇన్ చార్జిలు మాత్ర‌మే. వారే రేపు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని ఎవ్వ‌రూ అన‌లేరు కూడా!

ఎప్పుడు ఏం చేస్తారో!

చంద్ర‌బాబు నాయుడు ఎప్పుడు ఎవ‌రిని ఇన్ చార్జిగా ప్ర‌క‌టిస్తారో, ఎవ‌రిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేస్తారో అనేది ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోవ‌చ్చు. 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు ఈ త‌ర‌హాలోనే వ్య‌వ‌హ‌రించారు. అంత వ‌ర‌కూ త‌ను విమ‌ర్శించిన వారికి పిలిచి టికెట్లు ఇచ్చారు. పాత వాళ్ల‌ను ప‌క్క‌న పెట్టారు. ఎడా పెడా.. తోచిన రీతిలో వ్య‌వ‌హ‌రించారు. 

అనంత‌పురం జిల్లా వంటి ఒక‌ప్ప‌టి కంచుకోట‌లోనే టీడీపీ ప‌రిస్థితి పై ఏ మాత్రం క్లారిటీ లేదు. రాజ‌కీయంగా ప్ర‌జ‌ల ఆస‌క్తిని, ఆద‌ర‌ణ‌ను కోల్పోయిన నేత‌ల‌తోనే టీడీపీ బండి ముక్కుతూ మూలుగుతోంది. ఈ ప‌రిస్థితి వ‌చ్చే ఎన్నిక‌ల‌పై గ‌ట్టిగానే ప్ర‌భావం చూప‌వ‌చ్చు.