అన్నయ్య పరువు తీసేసావు కదయ్యా పవన్ కళ్యాణ్

అయ్యా పవన్ కల్యాణ్! ఏంటయ్యా నీ తీరు? సరిగ్గా ఎన్నికల ముందో, ప్యాకేజీ అందినప్పుడో, సినిమా రిలీజుకి ముందో జనాల్లోకొస్తావు. వచ్చినప్పుడల్లా నీ మాటల్లో కొట్టొచ్చినట్టు కనపడేవి మాత్రం..కుళ్లు, అసూయ, కడుపుమంట.  Advertisement అప్పట్లో…

అయ్యా పవన్ కల్యాణ్! ఏంటయ్యా నీ తీరు? సరిగ్గా ఎన్నికల ముందో, ప్యాకేజీ అందినప్పుడో, సినిమా రిలీజుకి ముందో జనాల్లోకొస్తావు. వచ్చినప్పుడల్లా నీ మాటల్లో కొట్టొచ్చినట్టు కనపడేవి మాత్రం..కుళ్లు, అసూయ, కడుపుమంట. 

అప్పట్లో టికెట్ల సమస్య కొలిక్కొస్తోందనుకున్న సమయంలో నువ్వు ప్రభుత్వాన్ని కెలుక్కున్నావు. సరే అది పక్కన పెట్టు. మరో మూడ్రోజుల్లో నీ సినిమా రిలీజు పెట్టుకుని మళ్లీ ప్రభుత్వం మీద ఇవాళ పేలావు. ఏం? ఏ కారణం చేతనో ప్రభుత్వం ఫిబ్రవరి 25 లోగా జీవో ఇవ్వకపోతే “అదిగో నేను మాట్లాడిన మాటల వల్ల నా మీద కక్షగట్టి నా సినిమాకి ఇబ్బంది కలగజేయాలని ప్రభుత్వం జీవో ఇవ్వలేదు” అని చెప్పుకుని నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలనా? 

అదలా ఉంచితే మీ అన్నయ్య చిరంజీవి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముందు వినయంగా మాట్లాడిన దాని గురించి ప్రస్తావిస్తూ ఆయనని అనుకరిస్తూ వెక్కిరించావేంటి? ఫ్లోలో నీ మూర్ఖత్వాన్ని ఎలా బయటపెట్టుకుంటున్నావో అర్థమవుతోందా? అయినా మీ అన్నయ్య చేసిన తప్పేంటి? వినయంగా మాట్లాడడం అవలక్షణమనుకుంటున్నావా? సీయం ముందు కూడా కాలు మీద కాలేసుకుని మెడ రుద్దుకుంటూ మాట్లాడాలంటావా? నీ నిరక్షరాస్యత, కుసంస్కారం ఇక్కడే తెలుస్తుంది.

“నేను వంగి వంగి దండాలు పెట్టడానికి రాజకీయాల్లోకి రాలా” అంటూ ఓండ్ర పెట్టావు ఇవాళ. ఒక్క సారి ఫ్లాష్ బ్యాక్ సీనేసుకో…మాయావాతికి తొంభై డిగ్రీల యాంగిల్లో వంగి మరీ పాదనమస్కారం చేసావు గుర్తుందా? చంద్రబాబుకి కనీసం 45 డిగ్రీలు వంగి దండం పెట్టావు మర్చిపోయావా? 

నీకు నువ్వు చాలా రేంజ్ ఇచ్చుకుంటావు కానీ అక్కడంత లేదన్న సత్యం నీకెప్పుడు తెలుస్తుందో. 

నీ చిన్నప్పుడు రేడియోలో పొద్దున్నే “కేయూరాణి నభూషయంతి పురుషం… వాగ్భూషణం భూషణం” అనే శ్లోకం వచ్చేది గుర్తుందా? 

“మనిషికి మాటే అసలైన భూషణం తప్ప ఇంకేవీ కావ”ని దానర్థం. అది మీ అన్నయ్యకుంది కానీ నీకు లేదు. కారణమేంటంటే ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగాడు. ఎండ, వాన అన్ని తెలిసిన మనసది. నువ్వేమో ఎండకన్నెరగకుండా ఆయన నీడలో పెరిగిన మొక్కవి. నీకేం తెలుస్తుంది ఎవరితో ఎలా మాట్లాడాలో. 

చిరంజీవిని ఏవన్నా సహించలేని నాగబాబు కూడా వేదికమీదుండగానే మీ అన్నయ్య చూపిన వినయాన్ని వెక్కిరించావంటే నిన్నేమనాలి? 

నీకు తెర మీద జీవితానికి, బయటి జీవితానికి తేడా తెలియట్లేదల్లే ఉంది. హీరోలు సినిమాల్లో సీయంలతో ఫైటింగులు కూడా చేసేస్తారు. నువ్వెంత అన్నట్టు మాట్లాడతారు. సీయంలు బెదిరిపోతారు. అదంతా సినిమా నాయనా! 

నిజజీవితంలో పద్ధతులుంటాయి. కోట్ల మంది జనం ఎన్నుకున్న సీయం నీ ఎదురుగా ఉన్నాడంటే నువ్వు కోట్లమంది పౌరుల ముందు నిలబడ్డట్టు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ఆ ప్రభువులు ఎన్నుకున్న వ్యక్తే సీయం. ఆ కుర్చీకిచ్చే గౌరవమంటూ ఒకటుంటుంది. 

మీ సినిమా వాళ్లనట్లా ప్రేక్షక దేవుళ్లని? నీ ఫ్యాన్స్ అనట్లా నువ్వు దేవుడివని? మరి ఒక పౌరుడైన మీ అన్నయ్య సీయం ముందు వినయం చూపిస్తే నీ బాధేంటి? 

వినయం చూపేవాడు ఎప్పుడూ ఎదుగుతాడు. జనం మనసులో ఒదుగుతాడు. ఈ సూత్రం తెలియకే నువ్వలా గెడ్డం పెంచుకుని మేధావి కటింగిస్తూ కాలక్షేపం చేస్తున్నావు తప్ప ఏం చేస్తే రాజకీయాల్లో రాణిస్తావో నీకస్సలూ తెలియడంలేదు. ఏం చేస్తాం? అది నీ తప్పు కూడా కాదు. నీ నైజం అంతే. 

ప్రసాద బాబు. ఎల్