గట్టిగా దృష్టి పెట్టాల్సిన టైమ్ వచ్చింది జగన్!

జగన్ అంటే సంక్షేమం.. సంక్షేమం అంటే జగన్.. ఏపీ ప్రజల మనసుల్లో పాతుకుపోయిన ఫీలింగ్ ఇది. ఇదే ఫీలింగ్ ను ఎల్లో మీడియా, టీడీపీ జనాలు రివర్స్ చేయడం మొదలుపెట్టారు. ఓన్లీ సంక్షేమం, నో…

జగన్ అంటే సంక్షేమం.. సంక్షేమం అంటే జగన్.. ఏపీ ప్రజల మనసుల్లో పాతుకుపోయిన ఫీలింగ్ ఇది. ఇదే ఫీలింగ్ ను ఎల్లో మీడియా, టీడీపీ జనాలు రివర్స్ చేయడం మొదలుపెట్టారు. ఓన్లీ సంక్షేమం, నో డెవలప్ మెంట్ అంటూ దాదాపు ఏడాదిగా ఎల్లో ప్రచారం చేస్తూనే ఉన్నారు. నిజానికి ఈ విషయంలో వాళ్లను తప్పుబట్టడం కంటే, ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేస్తోందనే స్వీయ విమర్శ చేసుకోవడమే మేలు.

చేస్తున్న అభివృద్ధి కంటే, సంక్షేమమే ఎక్కువగా హైలెట్ అవుతోంది. ఈ నేపథ్యంలో.. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిపై ముఖ్యమంత్రి గట్టిగా దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. జగన్ నుంచి సంక్షేమాన్ని ఎంతమంది ఆశిస్తున్నారో, ఆయన ప్రభుత్వం నుంచి అభివృద్ధిని ఆశిస్తున్న వాళ్లు కూడా అంతేమంది ఉన్నారు. 

న్యూట్రల్ గా ఉండే ఓటర్లు, విద్యావంతులు ఇప్పటికే ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. మొన్నటివరకు రోడ్లు కూడా బాగు చేయలేదంటూ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో పరిశ్రమలు రాలేదు. చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా సంక్షేమ కార్యక్రమాల రేంజ్ లో పబ్లిసిటీకి నోచుకోవడం లేదు. ఈ దశలో ప్రభుత్వం తక్షణ కర్తవ్యం ఏంటి..?

పోలవరంలో భజనలు అక్కర్లేదు, కనీసం పని జరగాలి కదా..?

పోలవరం ప్రాజెక్ట్ సహా.. అనేక ఇతర నీటిపారుదల ప్రాజెక్ట్ లు జగన్ హయాంలో పూర్తవుతాయనే నమ్మకం లేదు. చంద్రబాబు హయాంలో భజనా కాలక్షేపంతో, పోలవరం టూర్లతో.. ఏదో జరిగిపోయిందనే హడావిడి కొనసాగింది. బాబు హయాంలో ప్రచారం తప్ప పని జరగలేదు అనే నిజాన్ని జనాలకు చెప్పాల్సింది పోయి.. 2022లో పోలవరం పూర్తి చేస్తాం చూసుకోండి అంటూ వచ్చీ రాగానే టార్గెట్లు ఫిక్స్ చేసుకున్నారు. తీరా ఏమైంది. కేంద్రం మెలిక పెట్టింది, నిధులు ఆపేసింది, అనుమతుల్లో కొర్రీలు వేసింది, బాబు హయాంలో జరగని పునరావాసం వైసీపీ తలపై భారమైంది.

దీంతో పోలవరం విషయంలో జగన్ ఫెయిలయ్యారనే ప్రచారం ఊపందుకుంది. ఇక్కడ జగన్ తప్పేమీ లేదు, అంతా కేంద్రం చేతుల్లోనే ఉంది అని చెప్పినా ఎవరూ నమ్మలేని పరిస్థితి. దానికి కారణం అధికారంలోకి వచ్చీ రాగానే వైసీపీ విసిరిన సవాళ్లే. పోలవరం పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుంది కాబట్టి, కేంద్రం కచ్చితంగా సహకరించదు, అది రాజకీయం, దాన్ని అదే కోణంలో ఎదుర్కోవడం వైసీపీకి అత్యవసరం.

కరోనా కారణంగా ఉన్న ఉద్యోగాలు సైతం ఊడిపోయాయి. అలాంటి సందర్భంలో కొత్త కంపెనీలు ఎక్కడొస్తాయి, కొత్త ఉద్యోగాలు ఎక్కడ్నుంచి పుట్టుకొస్తాయి. కానీ ఏపీకి పరిశ్రమలు రావడంలేదంటూ ఇక్కడ ప్రతిపక్షాలు రచ్చ చేస్తున్నాయి. వైసీపీ వచ్చీ రాగానే సచివాలయాలు ఏర్పాటు చేసి భర్తీ చేసిన లక్షల కొలువులు మాత్రం వీరికి కనిపించవు. ఒకేసారి ఉద్యోగాలన్నీ ఇచ్చేయడంతో ఇప్పుడు క్యాలెండర్లు కావాలంటూ రోడ్లెక్కుతున్నాయి ప్రతిపక్షాలు. వైసీపీ దీనికి కౌంటర్ ఇవ్వలేకపోతోంది.

అప్పులు చేయంది ఎవరు..?

ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేస్తోందనేది తాజా విమర్శ. అసలు అప్పులు చేయంది ఎవరు. వరల్డ్ బ్యాంక్ వద్ద అప్పులకు ఆద్యుడు చంద్రబాబు కాదా..? కానీ జగన్ ఇప్పుడు అందరికీ టార్గెట్ అవుతున్నారు. నిధుల సమస్య, ఆస్తుల తాకట్టు ఇలా అన్నిటికీ జగన్ నే బాధ్యుడిగా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. కనీసం దీనికి కౌంటర్లు ఇవ్వడానికి కూడా వైసీపీ నుంచి ఎవరూ ముందుకు రావడంలేదు. 

విమర్శకులపై తిట్లదండకం అందుకోవడం కాదు, లెక్కలు చూపెట్టి వారి నోళ్లు మూయించే వారు కావాలిప్పుడు. ఆఖరికి ఆర్థిక శాఖ అధికారులతో ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఇప్పుడు వచ్చింది. అధికారులు కాదు, నాయకులే ఆ పని చేయాలి. అపనిందల్ని కాచుకోవాలి. ఇప్పటికైనా అధికార పార్టీనుంచి అది మొదలవ్వాలి. ఆ టీమ్ రెడీ అవ్వాలి.

సంక్షేమాన్ని తప్పుబట్టే వరకు రాకూడదు..

ప్రస్తుతం ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలతో పోల్చి చూస్తే సంక్షేమ కార్యక్రమాలకే ఎక్కువ కేటాయింపులు జరుగుతున్నాయనేమాట వాస్తవం. ఏపీలోని ప్రతి కుటుంబం కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలతో ఏదో ఒక లబ్ధి పొందుతోంది. కానీ అభివృద్ధి జరగడంలేదని అవే నోళ్లు మాట్లాడే పరిస్థితి. ఇక్కడ సమతుల్యత అవసరం. సంక్షేమమే వైసీపీకి గుదిబండ కాకూడదు. అలాగని, అభివృద్ధి భుజానికెత్తుకుంటే సంక్షేమంలో కోత పెట్టాల్సి రావొచ్చు. ఈ బ్యాలెన్సే ఇప్పుడు జగన్ కి అత్యవసరం.

ఇప్పట్నుంచే బ్యాలెన్స్ గా అడుగులు వేస్తే తప్ప, వచ్చే ఎన్నికలనాటికి పరిస్థితి అదుపులోకి రాదు. లేకపోతే ప్రతిపక్షాల విషప్రచారాన్నే ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ గట్టిగా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.