వివేకా హత్య కేసును అవినాశ్ చుట్టూనే తిప్పుతోంది తెలుగు మీడియా. భీకరంగా హత్య చేయబడి, రక్తసిక్తంగా ఉన్న వివేకా శవాన్ని చూసి కూడా అవినాశ్ గుండెపోటుతో పోయాడని చెప్పినది అతనికి వ్యతిరేకంగా ఉన్న బలమైన పాయింటు. రెండోది అక్కడి రక్తాన్ని తుడిపించి, బాండేజిలు కట్టించాడు అని పనిమనిషి చెప్పిన సాక్ష్యం. ఆ కడిగింపులు, కట్టించడాలు జరిగినపుడు అతనితో పాటు యింకా కొందరు కూడా ఉన్నారు కదా. అలా చేయండి, యిలా చేయండంటూ యితనే వాళ్లకి ఆదేశాలిస్తూ ఉంటే వాళ్లు అభ్యంతర పెట్టలేదా? వివేకా పెద్ద బావమరిది శివప్రకాశ రెడ్డి చేసిన కాల్ రిసీవ్ చేసుకుని, అవేళ అక్కడికి వెళ్లకుండా ఉంటే నాకీ తిప్పలుండేవి కాదు అని అవినాశ్ వీడియోలో వాపోతున్నాడిప్పుడు. వెళ్లినా ఫర్వాలేక పోయేది, సాక్ష్యాలను మరుగు పరచడానికి, తారుమారు చేయడానికి, గుండెపోటంటూ పోలీసులను, మీడియాను తప్పుడు దోవ పట్టించడానికి ప్రయత్నించకుండా ఉండి ఉంటే!
ఇలా చేసినందుకు కారణాలేమిటో అతనే చెప్పగలగాలి. ఇప్పటిదాకా చెప్పలేదు కాబట్టి మనమే ఏదో ఊహించాల్సి వస్తుంది. తప్పకుండా ఊహిద్దాం. దానికి ముందు అసలు పాయింటు, అతనే హత్య చేశాడా అనేది చర్చించాలి. హత్య చేయడానికి మోటివ్ ప్రధానం. అది అవినాశ్‌కు ఉందా? కడప ఎంపీ సీటును ఆశించిన అవినాశ్ తనకు వివేకా అడ్డు వస్తాడని చంపించాడు అనేది అభియోగం. కడపలో అవినాశ్ సిటింగ్ ఎంపీ. 2014లో తెలుగుదేశం కూటమి హవాలో కూడా 1.90 లక్షల మెజారిటీతో నెగ్గాడు. 25 మందిలో వైసిపి నుంచి 8 మంది ఎంపీలు నెగ్గితే దానిలో ముగ్గురు ఎంపీలు టిడిపి వైపు జంప్ అయిపోయినా, జగన్నే అంటిపెట్టుకుని ఉన్న ఐదుగురిలో అతనొకడు.
2019 నాటికి తనకు కడప టిక్కెట్టు రాకుండా పోతుందనే సందేహం అవినాశ్‌కు వచ్చే ఉండదు. (గతంలో కంటె రెట్టింపు మెజారిటీతో నెగ్గాడు) తనను కాదని, 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన వివేకాకు టిక్కెట్టివ్వడం అసంభవం. ఇక వివేకా అతనికి అడ్డెలా అవుతాడు? ఆయన్ను చంపవలసిన అవసరం ఏముంది? చంపితే యితనికి వచ్చే లాభమేముంది? అవినాశ్ వైయస్సార్ కజిన్ భాస్కరరెడ్డి కొడుకు. అంటే జగన్‌కు సెకండ్ కజిన్. అతని భార్య భారతికి ఫస్ట్ కజిన్. బావ వరుస. వివేకా జగన్‌కు సొంత బాబాయి. అయినా వారిద్దరి మధ్య సయోధ్య అంతగా లేదు. 2004-09 మధ్య వివేకా కడప ఎంపీగా, వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ రాజకీయాల్లోకి వద్దామనుకుని, బాబాయిని తప్పించమని తండ్రిని అడిగాడు. వైయస్సార్ తమ్ముణ్ని పిలిచి పదవికి రాజీనామా చేయమన్నాడు. ఆ విషయం వివేకా ఆంధ్రజ్యోతి దిల్లీ కరస్పాండెంట్ కృష్ణారావుగారికి చెప్తే (ఆయనే యిదంతా రాశారు) ఆయన సోనియాకు చేరవేశారు. వెంటనే సోనియా వైయస్సార్‌కు ఫోన్ చేసి, యిదంతా కుదరదు, వివేకాయే కంటిన్యూ అవుతాడు అని చెప్పారు.
2009 వచ్చేసరికి సిటింగ్ ఎంపీ వివేకాను పక్కన పెట్టి వైయస్సార్ జగన్‌కు టిక్కెట్టు యిప్పించుకున్నాడు. ఇలాటి పరిస్థితుల్లో వివేకాకు జగన్ మీద ప్రేమెందుకు ఉంటుంది? అందుకే అన్నగారు పోయాక, జగన్ కాంగ్రెసులోంచి బయటకు వెళ్లినపుడు అతనితో పాటు నడవలేదు. కాంగ్రెసు ప్రోత్సహిస్తే పులివెందుల అసెంబ్లీ స్థానానికి 2011 నాటి ఉపయెన్నికలో వదినగారి మీదే పోటీ చేసి 81 వేల తేడాతో ఓడిపోయాడు. ఇప్పుడు సునీత మీద కక్ష కట్టిన ‘‘సాక్షి’’ పేపరు ఆ రోజు సునీత, ఆమె భర్త ప్రోద్బలంతోనే వివేకా పోటీ చేశారని రాస్తోంది. నిజమే కావచ్చు, తన తండ్రి పదవికి ఎసరు పెట్టిన జగన్ మీద సునీతకు ప్రేమెందుకు ఉంటుంది? శర్మిల యిప్పుడు ‘మంచివాడు మా బాబాయి’ పాట పాడుతోంది కానీ అప్పట్లో అంతా కలహించుకున్నారు కదా. శర్మిల, జగన్ యిద్దరూ వివేకాపై విరుచుకు పడ్డారని పుకార్లు వచ్చాయి.
కాంగ్రెసు పాలనలో మంత్రిగా చేసి, రాష్ట్రంలో ఆ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుని పోయాక విధిలేక వివేకా జగన్ పంచన చేరారు. జగన్ గతాన్ని పక్కన పెట్టి, 2017లో ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి అవకాశం యిచ్చాడు. వైసిపి ఎంపిటిసిలు అధిక సంఖ్యలో ఉన్నా, ప్రత్యర్థిగా ఉన్న టిడిపి అభ్యర్థి బిటెక్ రవి కొందర్ని తమవైపు తిప్పుకుని యీయన్ని ఓడించేశాడు. దీన్ని బట్టి రాజకీయంగా ఆయన ఎంత బలహీనుడో తెలుస్తోంది. అలాటాయన కడప ఎంపీ సీటు కావాలని జగన్‌ను ఏ మొహం పెట్టుకుని అడుగుతాడు? పైగా సిటింగ్ ఎంపీ అవినాశ్ జగన్‌ను వెంటనంటే ఉన్నపుడు అతన్ని మార్చి నాకిమ్మనమని పట్టుబట్ట గలడా?
అబ్బే తన గురించి కాదు, కడప సీటు విజయమ్మకో, శర్మిలకో యిమ్మనమని చెప్పాడని, వాళ్లంటే పడని భారతి వివేకాను చంపించేసిందని ఓ కథనం షికారు చేస్తోంది. ఈ కేసులో అవినాశ్‌ను తప్పుపట్టి, జగన్‌ను కూడా యిరికిద్దామని కొందరు ప్రయత్నిస్తూ ఉంటే ఆచంట మల్లనలు భారతిని కూడా లాక్కుని వద్దామని చూస్తున్నారు. వారి వాదనే యిది. భారతి చంపిద్దామనుకుంటే ఏకంగా శర్మిలనే చంపించవచ్చు కానీ ఆమె పేరు సిఫార్సు చేసిన వివేకాను ఎందుకు చంపిస్తుంది? ఇదంతా అర్థం లేని వాదన. హత్య జరిగాక అవినాశ్ జగన్, భారతిలకు ఫోన్ చేశాడు కాబట్టి వారికీ భాగస్వామ్యం ఉందని యాగీ చేయడం సబబా? హత్యకు ముందు యిలా చేయబోతున్నామని ఫోన్ చేసి, ఆదేశాలు తీసుకుని, ఆ టాక్ లీకైతే అది ముఖ్యమైన అంశమౌతుంది కానీ, పోయాక మన బంధువు పోయాడని అన్నావదినలకు చెప్తే దానిలో వింతేముంది?
కొడుకు కోసం తనను బలి యివ్వబోయిన అన్నగారిపై, ఆయన కుటుంబంపై వివేకాకు ప్రేమ కారిపోతోందని అనుకోవడానికి లేదు. అంత యిదే ఉంటే, అన్నగార్ని అవినీతిపరుడిగా చిత్రీకరించి, కేసులు పెట్టిన కాంగ్రెసు పక్షాన వదినగారిపై పోటీ చేసేవాడే కాదు. 2019 వచ్చేసరికి పాదయాత్ర చేసి వచ్చిన జగన్ మంచి ఊపులో ఉన్నాడు కాబట్టి వైసిపి అధికారంలోకి వస్తుందేమో, ప్రచారం గట్టిగా చేసి అవినాశ్‌ను గెలిపిస్తే, తనకు ఏదో ఒక పదవి దక్కుతుందేమో అనుకుని ఉండవచ్చు. లేదా జగన్ పేరు చెప్పి పైరవీలు చేసుకోవచ్చనే ఆశతో పుట్టి ఉండవచ్చు. అందుకే అవినాశ్ అభ్యర్థిత్వాన్ని జగన్ నిర్ధారించగానే వివేకా అభ్యంతర పెట్టలేదు. అవినాశ్ తరఫున ప్రచారం చేశాడు. చచ్చిపోవడానికి కొన్ని గంటల ముందు దాకా ప్రచారం చేసినట్లు సునీతే చెప్పారు.
ఇదంతా చూస్తే అవినాశ్‌కు మోటివ్ లేదని స్పష్టమౌతోంది. సిబిఐ యీ కోణాన్ని పట్టుకుని వదలకపోతే కేసుని నీరు కార్చడానికే అని అనిపిస్తోంది. ఇక్కడో యింకో మాట చెప్పాలి. వివేకా పెద్ద బావమరిది, అల్లుడి అన్నగారు ఐన శివప్రసాదరెడ్డి వైపు ‘‘సాక్షి’’ వేలెత్తి చూపుతూ వివేకా రాజకీయ వారసత్వం కోసం యిదంతా చేశారంటోంది. ఇదీ హాస్యాస్పదమే. వివేకాకే దిక్కు లేక వేరే వాళ్లకి ప్రచారం చేసుకుంటున్నారు. కనీసం అసెంబ్లీ సీటు టిక్కెట్టు కూడా దక్కించుకో లేకపోయారు. ఇక ఆయన వారసత్వం ఏముంటుంది?
ఇక వివేకాపై అప్పటి టిడిపి మంత్రి ఆదినారాయణ రెడ్డికి, బిటెక్ రవికి వివేకా పట్ల రాజకీయ వైరం ఉందని, వారిని కూడా అనుమానించాల్సిందే అని సాక్షి అంటోంది. తండ్రి మరణానంతరం సునీత కూడా ఆదినారాయణ రెడ్డి దోషి అని, బాబు ఆయన్ని కాపాడుతున్నారని, కుటుంబసభ్యులను చంపుకునే కుటుంబం కాదు మాది అని, ప్రెస్మీట్లో మాట్లాడారు. ఇప్పుడా థీమ్ వదిలేసి అవినాశ్ మీదే పడ్డారనుకోండి. అప్పట్లోనైనా టిడిపి వాళ్లపై సందేహం దేనికి? ఆదినారాయణ రెడ్డి వైసిపి ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికై, టిడిపిలోకి వెళ్లి మంత్రి అయ్యారు. బిటెక్ రవి వివేకాపై 2017లో ఎమ్మెల్సీగా గెలిచారు. రవి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కెలో మాట్లాడుతూ ‘ఓడించినా వివేకా నాపై కోపం పెట్టుకోలేదు. కనబడినప్పుడు పిలిచి పక్కన కూర్చోబెట్టుకునేవారు. ‘నాకు వ్యతిరేకంగా ఎవరెవరికి డబ్బిచ్చావో చెప్పు’ అని అడిగితే ‘అలా చెప్పడం కరక్టు కాదన్నా’ అనేవాణ్ని.’ అని చెప్పుకున్నారు.
ఇతనిలా చెపితే సిబిఐ వేరేలా వాదన వినిపిస్తోంది. తన ఓటమికి కారణం అవినాశ్, అతని తండ్రి భాస్కరరెడ్డి కారణభూతులని వివేకా అనుకుని, వెళ్లి వాళ్లను తిట్టాడని, అందుకని వాళ్లు ఆ కోపంతో వివేకాను చంపారని చెప్తోంది. 2017లో తిడితే, రెండేళ్లదాకా వాళ్లు ఆగి, సరిగ్గా జనరల్ ఎన్నికల ముందు ప్రచారమధ్యంలో చంపించారంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది? వివేకా రాజకీయంగా స్పెంట్ ఫోర్స్. చంపదగ్గ శత్రువేమీ కాదు. చంపితే వచ్చే లాభమూ లేదు. ఫ్యాక్షనిస్టు రాజకీయాల్లో కూడా ఎవర్ని టార్గెట్ చేస్తారో వాళ్లనే చంపుతారు తప్ప, కుటుంబంలోని స్త్రీలను, పిల్లలను చంపరు. ఇతరుల జోలికి వెళ్లరు. అలాటిది ఏ మోటివూ లేకుండా ఊరికే వివేకాను ఎందుకు చంపుతారు వాళ్లు? ఈ పొలిటికల్ యాంగిల్‌తోనే సిబిఐ ముందుకు సాగితే కోర్టులో కేసు వీగిపోతుంది. అవినాశ్ బయట పడిపోతాడు. సిబిఐ ఉద్దేశం అదేనేమో మరి!
అవినాశ్‌కు వ్యతిరేకంగా ఉన్న అంశమేమిటంటే అప్రూవర్‌గా మారిన దస్తగిరి సాక్ష్యం. అతను కూడా అవినాశ్ నాచేత చేయించాడు అని చెప్పలేదు. తనను యీ పనికి పురమాయించిన ఎర్ర గంగిరెడ్డి ‘నీకేం ఫర్వాలేదు, మన వెనక్కాల భాస్కరరెడ్డి, అవినాశ్ రెడ్డి వగైరాలు ఉన్నారు’ అని చెప్పాడని సిబిఐకు చెప్పాడు. ఇక్కడ రెండు అంశాలున్నాయి. అలా అన్నానని గంగిరెడ్డి ధృవీకరించలేదు. ఒకవేళ గంగిరెడ్డి అలా అన్నా అది నిజం కావాలని లేదు. ట్రాఫిక్ పోలీసు మనని హెల్మెట్ లేదని ఆపితే పోలీసు కమిషనర్ కొడుకు నా క్లాస్మేటని దబాయించవచ్చు. పోలీసు నమ్మేసి వదిలేస్తాడా? కమిషనర్ గారి చేత ఫోన్ చేయించండి అంటాడు. ఇక్కడ అవినాశ్ వగైరాలతో ఫోన్ చేయించి ‘నువ్వు వేసేశేయ్, మేం చూసుకుంటాం’ అనిపించాడని దస్తగిరి క్లెయిమ్ చేయటం లేదు. గంగిరెడ్డి మాట గుడ్డిగా నమ్మేశానని అంటున్నాడు. అసలు గంగిరెడ్డి, అవినాశ్‌ల మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిందా?
మా యింటి పక్క ఒకతను డ్రైనేజి కాలువ ఆక్రమించి కాంప్లెక్స్ కట్టేస్తున్నాడు. అలాఎలా చేస్తాడు అని అంటే దీనిలో అమిత్ షాకు భాగస్వామ్యం ఉందట అని టాక్. అలాగే హైటెక్ సిటీ దగ్గర ఓ విలువైన స్థలం కబ్జాకు గురైతే దానిలో అమిత్ హస్తం ఉందని ఎవరో అన్నారు. ఇక్కడిలాటిది ఉందని ఆయనకెలా తెలుస్తుందండీ అంటే లోకల్ బిజెపివాళ్లు చెప్తారండీ అంటారు. ఇలాటి మాటలు పట్టుకుని ఆరోపణలు చేస్తే గూబ పగులుతుంది. ఇలాటి వాటిని హియర్సే ఎవిడెన్స్ అంటారు. ఇవి కోర్టులో నిలబడవు. ఇవి సిబిఐకు విచారణకు పనికి వస్తాయి. ఇది ఒక క్లూ మాత్రమే. ఈ దారాన్ని పట్టుకుని విచారణ కొనసాగించి, సిబిఐ గట్టి తాడు పేనాలి. దీన్ని పట్టుకునే వేళ్లాడితే పుటుక్కున తెగుతుంది.
అసలీ దస్తగిరి మాటలు ఎంతవరకు నమ్మాలో తెలియకుండా ఉంది. వివేకాను చంపడానికి సుపారీ 40 కోట్లు అంటే అబ్బా అనిపిస్తోంది. మర్డర్‌కు సుపారీ ఎంతుంటుందో నాకు తెలియదనుకోండి. ఏదో జెడ్ కేటగిరీ వ్యక్తిని చంపాలంటే అంత రేటుంటుందేమో! అతి సులభంగా చంపేసిన యీ కేసుకి కూడా అంతా?
హంతకుడి కాలిబర్ కూడా లెక్కలోకి తీసుకుంటారుగా? ఈ దస్తగిరి ‘డే ఆఫ్ ద జాకాల్’లో జాకాల్ వంటి స్థాయి కలవాడు కాదుగా! అంటే నా ఉద్దేశం – హత్య అని తెలియకుండా చంపేవాడికో, తెలిసినా చేయించినవాడెవడో బయటకు రాకుండా నేర్పుగా చేసే హంతకుడికో పెద్ద రేటు యివ్వవచ్చు. ఈ దస్తగిరేమిటి, అతి క్రూడ్‌గా నరికేశాడు. ఇతనికి 5 కోట్లు వాటా యిస్తానన్నారా!? ఒక కోటి ఎడ్వాన్సు యిచ్చారా? సాక్షి రాస్తున్న ప్రకారం హత్యకు రెండు రోజుల ముందు కూడా దస్తగిరి డబ్బు కోసం యాచిస్తున్నాడట. కోటి రూపాయల అడ్వాన్సు తీసుకుంటే అదేం ఖర్మ? అతని దగ్గర దొరికిన డబ్బు వివేకా బీరువాలోంచి కొట్టేశాడేమో! ఏమో! ఆ కోణమూ చూడాలి.
పైగా డ్రైవర్ ప్రసాద్ నన్ను కొట్టాడంటూ హతుడి చేత లేఖ రాయించడంలో ఉద్దేశమేమిటో గందరగోళంగా ఉంది. వివేకా ఆ లేఖను ఏ పరిస్థితుల్లో రాసి ఉంటారని పోలీసులు భావించాలని హంతకుడి ఉద్దేశం? ప్రసాద్ తనను కొట్టి వెళ్లిపోయిన తర్వాత వివేకా లేని ఓపిక తెచ్చుకుని, రక్తసిక్తమైన హస్తాలతో ప్రసాద్‌పై ఆరోపణ లేఖ రాసి, తర్వాత రక్తమోడ్చుకుంటూ పోయారనుకోవాలనా? అంటే ప్రసాద్ యీయన్ని చావకొట్టేసి, మధ్యలో అర్జంటుగా బయటకు వెళ్లిపోయాడనుకోవాలనా? ఎంత అసంబద్ధంగా ఉంది!
అసలీ లేఖలో ప్రసాద్ పేరే ఎందుకుంది? అవినాశ్ వాళ్లు చేయిస్తే సునీత, భర్తపై తోసేస్తూ రాయించవచ్చు. సునీత వాళ్లూ చేయిస్తే, అవినాశ్ మీద తోసేస్తూ రాయించవచ్చు. ఇద్దరూ కలిసి టిడిపి వాళ్లపై తోసేద్దామనుకుంటే బిటెక్ రవి, ఆదినారాయణ రెడ్డికి వ్యతిరేకంగా రాయించవచ్చు. మధ్యలో యీ డ్రైవర్ కథేమిటి? దస్తగిరికీ, అతనికీ పడదా? తనను తీసేసి అతన్ని పెట్టుకున్నారన్న కచ్చేమైనా ఉందా? సందట్లో సడేమియా లాగ దస్తగిరి సొంత తెలివితేటల్తో ప్రసాద్‌ను యిరికించ బోయాడా? ఎనీవే, యిది సవ్యంగా ప్రొఫెషనల్‌గా జరిగిన హత్య కాదు, బాచ్డ్ అప్ ఎటెంప్ట్లా ఉంది. దస్తగిరి స్టేటుమెంటు పరీక్షలు తట్టుకుని పూర్తి పాఠం బయటకు వస్తేనే నిజాలు తెలియవచ్చు.
ఇక ముఖ్యమైన పాయింటుకి వస్తే, అవినాశ్ రెడ్డి మీడియాకు గుండెపోటు అని ఎందుకు చెప్పాడు? రక్తం కడుగుతూంటే ఎందుకు వారించలేదు? దీనివలన హత్య అతనే చేశాడని ఎవరూ నిరూపించలేరు. గూగుల్ టేక్ఔట్ వంటి సాంకేతిక అంశాలు ఒక కొలిక్కి వస్తే స్పష్టత రావచ్చు. వాటి మాట ఎలా ఉన్నా సాక్ష్యాలను టేంపరింగ్ చేశాడని మాత్రం కేసు పెట్టవచ్చు. కానీ ఆ కేసు యితనొక్కడి మీదే పెడతారా? హత్యానంతరం వివేకా బంధువులందరూ అసహజంగానే ప్రవర్తించారని నాకు తోస్తోంది. నాకు గుర్తున్నంత వరకు జరిగిన సీక్వెన్స్ రాస్తున్నాను. తప్పులుంటే ఎత్తి చూపండి. వివేకా పిఏ కృష్ణారెడ్డి వచ్చి శవం చూశాడు. అక్కడ రక్తసిక్తమైన ఒక లేఖ పడి ఉంది. వెంటనే కొత్త బాస్ అయిన రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేశాడు. అది సహజం. చేశాడు. సునీత గారు ఏం చేయాలి? పోలీసులకు ఫోన్ చేసి మా నాన్న పోయారు. వెళ్లి చూడండి అని చెప్పాలి.
ఆవిడ డాక్టరు. మెడికో లీగల్ కేసులు చాలా హేండిల్ చేసి ఉంటారు. ఇలాటి కేసుల్లో పదిమంది వచ్చి క్రైమ్ సీనంతా తొక్కేసి, సాక్ష్యాలు నాశనం చేస్తారు. ఆరుషి కేసులో అదే జరిగింది. మా నాన్న కేసులో అలా జరగకుండా వెంటనే మీరు వెళ్లి కార్డన్ ఆఫ్ చేయండి అని చెప్పాలి. ఆవిడ ఫోన్ చేసినట్లు లేదు. వివేకా రెండో బావమరిది రాజశేఖర రెడ్డియే ఆవిడ భర్త. ఆయనా చేసినట్లు లేదు. ఎర్ర గంగిరెడ్డి కడిగించేస్తూ ఉంటే అతనితో పాటు వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టరు శంకరయ్యతో తన ఫోనులో ఆయన మాట్లాడాడని పిఏ కృష్ణారెడ్డి చెప్తున్నాడు. సునీత భర్త చెప్పడం బట్టి హైదరాబాదులో ఉన్న పెద్ద బావమరిది శివప్రకాశరెడ్డికి విషయం తెలిసింది. ఆయనైనా వెంటనే పోలీసులకు ఫోన్ చేసి, యిందాకా రాసిన జాగ్రత్తలు తీసుకోమని కోరి ఉండాలి. అది చేయలేదు. ఆయన కృష్ణారెడ్డికి ఫోనే చేసి విషయం కనుక్కున్నాక ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేశారట. ఆయన వైసిపి నుంచి టిడిపికి వెళ్లి ప్రస్తుతం బిజెపిలో చేరారు. ఆయన వివేకాకు రాజకీయ ప్రత్యర్థి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఓటమికి కృషి చేసినవాడు.
ఆయనకు అర్జంటుగా ఫోన్ చేయవలసిన అవసరం ఏముంది, అదీ కుటుంబసభ్యుల కంటె ముందుగా… అని సాక్షి ప్రశ్న. నిజమే అంత అర్జన్సీ లేదు, కానీ చేయడంలో వింతా లేదు. టిడిపిలో చేరినా వైసిపిలో ఉండగా స్నేహితుడే కావచ్చు. ప్రయారిటీ లిస్టులో ఆయన ఉండనక్కరలేదు. కానీ చేసినంత మాత్రాన వాళ్లిద్దరూ కలిసి కుట్ర చేశారని సాక్షి చేసే వాదనను నమ్మలేం. ఈ ఫోన్కాల్కి ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే, శివప్రకాశరెడ్డి యీ ఫోన్‌కాల్‌లోనే ఆదినారాయణ రెడ్డితో ‘వివేకా గుండెపోటుతో పోయారు’ అని చెప్పారట. ‘సిగరెట్లు ఎక్కువగా కాలుస్తారు కదా, అందువలన గుండెపోటు వచ్చి ఉంటుంది’ అని అదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారట. ఈ విషయాన్ని ఆదినారాయణ రెడ్డి మీడియాతో చెప్పారట.
దీనికి రుజువుగా ఆదినారాయణ రెడ్డి ప్రసంగిస్తున్న సివిఆర్ న్యూస్ టీవీ వీడియో చూడండి అంటూ సాక్షి తన 060223 సంచికలో ఆ వీడియో లింకు యిచ్చింది. https://www.youtube.com/watch?v=uGiQpc ఆ లింకు నొక్కితే ‘దిస్ వీడియో ఈజ్ నాట్ ఎవైలబుల్ ఎనీమోర్’ అని వస్తోంది. ఎవరు విత్‌డ్రా చేశారో, ఎందుకు చేశారో తెలియదు. శివప్రకాశ్కు కానీ, ఆదినారాయణ రెడ్డికి గాని గుండెపోటు అని ఎవరు చెప్పారు? ఇదే ముఖ్యమైన విషయం. పిఏ కృష్ణారెడ్డి తను చెప్పలేదన్నాడు. అసలు గుండెపోటు న్యూస్ ఎలా ప్రారంభమైందో తెలియదంటున్నాడు. దీని విషయంలో స్పష్టత వచ్చేవరకు గుండెపోటు కథను ప్రారంభించినది శివప్రకాశరెడ్డే, అవినాశ్ కాదు అని సాక్షి వాదించడానికి యిది పనికివస్తోంది. ఎవరు మొదలుపెట్టినా, అవినాశ్‌కు కళ్లున్నాయి కదా, చూడగానే గుండెపోటు కాదని తెలిసిపోతుంది కదా. శివప్రకాశ్ రెడ్డి అవినాశ్‌కు ఫోన్ చేసి, హత్య గురించి చెప్పడం, అతను అక్కడకు వెళ్లడం జరిగింది.
ఇక హంతకుడు డ్రైవర్ ప్రసాద్ తనను కొట్టాడని వివేకాను ఒత్తిడి పెట్టి రాయించిన లేఖకు చాలా ప్రాధాన్యత ఉంది. అది పిఏ కంటపడింది. అతను దాని గురించి సునీతకు చెప్పినప్పుడు వాళ్లు దాన్ని దాచి ఉంచమని, ఎవరికీ యివ్వవద్దనీ ఎందుకు చెప్పారు? సెల్‌ఫోన్‌ను కూడా తన వద్దే ఉంచుకోమని ఎందుకు చెప్పారు? పిఏ వాళ్లు చెప్పిన ప్రకారమే చేశాడు. అవినాశ్‌కు చెప్పలేదు సరే, పోలీసులకూ చెప్పలేదు. సాక్ష్యాన్ని దాచడమూ తప్పే కాబట్టి అతనూ దోషే. సునీత వాళ్లు 1.30కు హైదరాబాదు నుంచి వచ్చి, లేఖ చూసుకుని, సెల్‌ఫోన్‌లోని మెసెజెస్ డిలీట్ చేసి (ఇది సాక్షి కథనం, పోలీసులు ఏమంటున్నారో తెలియదు) అప్పుడు పోలీసులకు లేఖ, సెల్‌ఫోన్ యిచ్చారు. ఇది టాంపరింగ్ కిందే వస్తుంది కాబట్టి సునీత, ఆమె భర్త కూడా దోషులే.
బిటెక్ రవికి వివేకా కుటుంబంపై ప్రేమ ఉండే అవసరమేమీ లేదు. కానీ ఓపెన్ హార్ట్‌లో దీనిపై మాట్లాడుతూ ‘ఆ లేఖ బయటకు వస్తే ఎవరో ఒకరు కోపంతో డ్రైవర్ ప్రసాద్‌ను చంపేస్తారని, యిస్యూ క్లోజ్ అవుతుందని హంతకులు అనుకున్నారు. దీనిని గ్రహించి, లెటర్‌ను భద్రంగా ఉంచాలని సునీత చెప్పారు.’ అన్నారు. వివేకా మరణించాక నిరసన ప్రదర్శనలు జరిగాయా? వైయస్సార్ పోయినప్పుడు జరిగినట్లు ఆత్మహత్యలు జరిగాయా? ప్రజలు ఆగ్రహంతో బస్సులు తగలేశారా, ఈ ప్రసాద్‌ను చంపడానికి? దస్తగిరి తన తండ్రిని గొడ్డలితో లోకభీకరరీతి ఎలా వధించాడో వర్ణించి చెప్తున్నా సునీత గారు అతనిపై ఆగ్రహం ప్రకటించటం లేదు. సిబిఐ అతనికి బెయిలు యిస్తే, తక్కిన అన్ని కేసుల్లో యింప్లీడ్ అవుతున్నామె, దీనిలో కాలేదు, అభ్యంతర పెట్టలేదు.
ఇక యీ ప్రసాద్ హత్య చేయలేదని సునీత గారికి ముందే ఎలా తెలుసు? పోలీసులు కదా నిర్ధారించవలసినది? ప్రసాద్‌ను చంపేసి యిస్యూ క్లోజ్ చేస్తారని రవి చెప్పినట్లు యీవిడ ముందే యీవిడ ఊహించారా? అయినా పోలీసులకు ఆ మాత్రం తెలివిడి ఉండదా? అవసరమైతే అతనికి రక్షణ కల్పించరా? సునీత వచ్చి స్వయంగా లేఖ యిస్తేనే తప్ప రక్షణ యివ్వరా? లేఖాంశాలు అప్పుడే బయటకు వచ్చాయి. అయితే ప్రసాద్‌కు ముప్పు వాటిల్లిందా? తండ్రి హత్య జరిగింది, అనుభవజ్ఞులైన పోలీసులను వాళ్ల పని వాళ్లు చేసుకోనీయకుండా, మధ్యలో సునీత విలువైన సమాచారాన్ని దాదాపు 10 గంటల పాటు దాచడమేమిటి? నిజంగా ప్రసాదే నిందితుడైతే అతను యీలోగా ఊరొదిలి పారిపోతే?
జగన్ మొదట్లో టిడిపిపై నింద వేసినప్పుడు లేఖ గురించి సాక్షి పెద్దగా ఆగం చేయలేదు. కానీ ఎప్పుడైతే సునీత తుపాకీ మొన అవినాశ్ వైపు తిప్పిందో, అప్పణ్నుంచి యీ లేఖ గురించి సాక్షి పదేపదే అడుగుతోంది. ప్రసాద్‌ను రక్షించడానికి లేఖ దాచమన్నారన్నారు. మరి సెల్‌ఫోన్ ఎందుకు దాచమన్నారు? ఈనాడు అనేక కేసుల్లో సెల్‌ఫోనే కీలకమౌతోంది. సెల్‌ఫోన్ లోంచి మెసేజెస్, యితర సమాచారం తీసేశారని బయటపడితే మాత్రం సునీత చాలావాటికి సంజాయిషీ చెప్పాల్సి వస్తుంది. చనిపోయేందుకు కొన్ని గంటల ముందు వివేకా తనతో మాట్లాడారని షమీమ్ అన్నది నిజమే అయితే అది డైయింగ్ డిక్లరేషన్ అవుతుంది. దాన్ని టేంపర్ చేయడం శిక్షార్హమే కావచ్చు.
ఇక రక్తం కడిగించడం, బాండేజి కట్టించడం దాని గురించి, నేను 2019 మార్చి 20న రాసిన ఆర్టికల్‌లో కొంత సమాచారం ఉంది. https://telugu.greatandhra.com/articles/mbs/what-ys-viveka-murder-conveys-97998.html
దాని కంటె పిఏ కృష్ణారెడ్డి చెప్తున్నది మోర్ ఆథెంటిక్‌గా ఉంది. అతను చెప్పిన ప్రకారం ఎర్ర గంగిరెడ్డి, సిఐ శంకరయ్య వచ్చారు. వివేకా రక్తం కక్కుకుని చచ్చిపోయాడు అని గంగిరెడ్డి తీర్మానించి, పోలీసు రిపోర్టు అక్కరలేదు అని డిక్లేర్ చేసి, కడిగించడం మొదలుపెట్టాడు. ఇంత భీకరంగా చనిపోయిన వ్యక్తి శవాన్ని కదిలించకూడదన్న యింగితజ్ఞానం మీకు లేదా అని శంకరయ్య అడిగినట్లు తోచదు. నుదుటిపై దెబ్బలు ఉన్నాయి కదా అంటే కమ్మోడు మీద నుంచి పడి ఉంటాడు అన్నాడు. ఇతను విభేదించి, యీ విషయం రాజశేఖర్‌కు చెప్పాడు. అతను కడగడం ఆపండి అని చెప్పలేదు. సిఐతో మాట్లాడతాను అన్నాడు. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో యితనికి తెలియదు. 6.30కు అవినాశ్ వచ్చి చూసి, అయ్యో అని అని బయటకు వెళ్లి ఎవరెవరికో ఫోన్లు చేసుకున్నాడు. తర్వాత యితను అవినాశ్‌ను చూడలేదు. గంగిరెడ్డి పనివాళ్ల చేత అంతా కడిగించాడు. బాండేజిలు వేయించాడేమో యితను చూడలేదు. బయట హాల్లో ఉన్నాడు. మనోహర్ రెడ్డి మాత్రం ఆ బెడ్రూమ్లో ఉండడం చూశాడు. ఇతను హాల్లో ఉండగానే శవాన్ని యాంబులెన్సులో ఆస్పత్రికి తీసుకుని పోయారు.
సునీత, భర్త 1.30కి వచ్చారు. ఇతను లేఖ, ఫోన్ వాళ్లకు యిచ్చాడు. అవినాశే గుండెపోటు అని పోలీసులకు చెప్పాడని యిప్పటి వార్తలు. అప్పుడేమో అవినాశ్ ఉద్యోగి భరత్‌రెడ్డి చెప్పాడని వచ్చింది. గుండెపోటు వార్త ఎవరు వ్యాపింప చేశారో తనకు తెలియదని పిఏ అంటున్నాడు. రక్తం ఉందని సిఐకు చెప్పానని అవినాశ్ యిప్పుడు అంటున్నారు. సునీత వచ్చాక రక్తం ఎవరు కడిగించారని అడిగినట్లు, వారి మీద మండిపడినట్లు వార్తలు లేవు. టిడిపికి వ్యతిరేకంగా మాట్లాడే మూడ్‌లోనే ఉన్నారావిడ అప్పుడు. ఇదంతా చూస్తే ఏమనిపిస్తోంది? వివేకా కుటుంబమంతా కలిసి హత్యను కామాపు చేయడానికి చూశారని తోచటం లేదూ?
ఉంచుకున్నదాని యింట్లో చచ్చిపోయిన వాడి కుటుంబం నానా అవస్థలూ పడుతుందని సామెత. శవాన్ని అక్కణ్నుంచి రహస్యంగా తరలించుకుని వచ్చి, సొంతింట్లో పడేయాలి. పోలీసులు వచ్చి శవాన్ని ఎవరు కదిపారు? ఈ యాంగిల్లో ఎలా పడి ఉంది? అని అడిగితే అందరూ బిత్తర చూపులు చూడాలి. వివేకా జీవితంలో బయటకు తెలియకూడని కోణాలున్నాయనే భావన కుటుంబంలో ఉండి ఉండవచ్చు. అందుకే అందరూ కలిసి కూడబలుక్కుని గుండెపోటు కథను ప్రచారంలోకి తెచ్చారు. పైన బాబు ప్రభుత్వం ఉన్నా, లోకల్ పోలీసులపై వీళ్ల పలుకుబడి ఉంటుంది కదా, ఎంపీ చేత చెప్పిస్తే ఊరుకుంటారని అనుకుని ఉంటారు. అందుకే అవినాశ్‌ను ముందుకు నెట్టారు. టీవీ స్క్రోలింగ్స్ అలా వచ్చేట్లు చేశారు.
మధ్యతరగతి కుటుంబాలలోనే అబ్బాయో, అమ్మాయో, గృహిణో ఆత్మహత్య చేసుకుంటే పలుకుబడి ఉపయోగించో, పోలీసులకు లంచం యిచ్చో బయటకు రానీయరు. సహజమరణమని డాక్టరు చేత సర్టిఫికెట్టు యిప్పించుకుంటారు. పేదసాదల న్యూస్ మాత్రమే బయటకు పేపర్లలో వస్తుంది. అవినాశ్ హత్య చేయించి ఉంటే గుండెపోటు అని చెప్పకుండా ‘ఇది హత్యే, హంతకుడు పారిపోతూండగా నేను చూశాను’ అనేవాడు. హత్యే కానట్లు ఎందుకు నటిస్తాడు? అతని పొరబాటు దీన్ని సహజమరణంగా చిత్రీకరించబోవడం. ఇది కుటుంబసభ్యులందరూ కూడబలుక్కుని చేసిన పని. లేకపోతే పోలీసులు రాగానే ఒక్కొక్కరూ ఒక్కొక్క వెర్షన్ వినిపించేవారు. అవినాశ్ గుండెపోటు అని చెప్తూంటే ఖండించేవారు. అయితే వీళ్ల కుటుంబం పరువు బయట పడేయడానికి నిశ్చయించుకున్న వారెవరో యిది హత్యే అనే నిజం బయటకు వచ్చేట్లు చేశారు.
మొదట్లో కుటుంబమంతా కలిసి టిడిపిని నిందించారు. ఇప్పుడు తమలో తామే కలహించుకుంటూ విషయాలు బయట పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో సత్యం బయటకు వస్తుందేమో చూడాలి. ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. హత్య చేయాలంటే తలపై దిండు నొక్కి పెట్టి సునాయాసంగా చంపేయవచ్చు. కానీ దీన్ని చూస్తే కక్షతో చంపేరని తెలిసిపోతోంది. ఆ కక్ష మహిళపరంగా కావచ్చు, లేదా డబ్బు విషయంలో జరిగిన మోసమైనా కావచ్చు. మహిళ పరంగా అయితే రెండో వివాహం పట్ల కుటుంబం ప్రవర్తించే తీరుని, డబ్బు విషయమైతే బెంగుళూరు డీల్‌ను పరామర్శించాలి. ‘షమీమ్ కోణం మాటేమిటి?’’ అనే వ్యాసంలో వాటి గురించి చర్చిద్దాం. –
ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2023)