మొత్తానికి విశాఖ భూదందాల డొంక కదలబోతోంది. భూములను చాప చుట్టేసిన ఘనులెవరో ఘనాపాఠీలెవరో తేలబోతోంది. భూములను దిగమింగేసిన పెద్దల రుట్టు రట్టు చేసే సిట్ నివేదిక ప్రభుత్వం చేతికి రానుంది.
త్వరలోనే సిట్ తుది నివేదికను వైసీపీ సర్కార్ ని అందచేయనుంది. గత ఏడాది అక్టోబర్ లో ప్రభుత్వం విశాఖ భూ దందాపైన సిట్ ని ఏర్పాటు చేసిన సంగతి విధితమే. డాక్టర్ విజయకుమార్ నేతృత్వంలో ఏర్పాటు అయిన సిట్ ఈ ఏడాది మార్చి వరకూ చురుకుగా దర్యాప్తు చేసి మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది.
కరోనా తరువాత మిగిలిన విచారణను గత మూడు నెలలుగా చేపడుతూ వచ్చింది. విశాఖలోని 13 మండలాలలో వేలాది ఎకరాల భూములు ఎలా బకాసురుల పాలిట చిక్కుకున్నాయో సిట్ కళ్ళకు కట్టినట్లుగా చూపించిందని చెబుతున్నారు.
ప్రభుత్వ భూములను ప్రైవేట్ గా మార్చడం, ప్రైవేట్ భూములను ప్రభుత్వ భూములుగా చూపించడం వంటి తకరారు పనులు చేసిన అధికారుల విషయాన్ని కూడా సిట్ లో ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు.
ప్రభుత్వ భూములను ఎలా కాపాడుకోవాలో కూడా ప్రభుత్వానికి సిట్ కొన్ని సూచనలు చేయనుందని అంటున్నారు. మొత్తానికి సిట్ నివేదిక తొందరలోనే సర్కార్ చేతికి రానుండడంతో విశాఖ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలైపోయాయి. ఏం జరుగుతుందో చూడాలి.