రామోజీరావు ఇప్పుడెలా తప్పించుకుంటారో!

శ్రీకృష్ణుడు ప్రయోగించిన సుదర్శనచక్రం లక్ష్యాన్ని చేదించే వరకు ఆగదట. లక్ష్యం ఎంత దూరం వెళ్లినా, ఏ లోకంలో ఎక్కడ దాక్కున్నా వెనకలే వెళ్లి వెళ్లి, వేటాడి వేటాడి ఖండిస్తుందని భాగవత కథలు చెబుతాయి.  Advertisement…

శ్రీకృష్ణుడు ప్రయోగించిన సుదర్శనచక్రం లక్ష్యాన్ని చేదించే వరకు ఆగదట. లక్ష్యం ఎంత దూరం వెళ్లినా, ఏ లోకంలో ఎక్కడ దాక్కున్నా వెనకలే వెళ్లి వెళ్లి, వేటాడి వేటాడి ఖండిస్తుందని భాగవత కథలు చెబుతాయి. 

ప్రస్తుతం రామోజీరావుకి మార్గదర్శి కేసు అలా తయారైంది. వైఎస్సార్ తన హయాములో ఉండవల్లి అనే సుదర్శనచక్రాన్ని సంధించారు మార్గదర్శి పైన. వైఎస్సార్ అవతారం చాలించేసినా ఉండవల్లి అనబడే ఆ చక్రం మాత్రం రాజమండ్రి-హైదరాబాద్- ఢిల్లీ ల మధ్య ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. 

ఇన్నేళ్లుగా రామోజీరావు పరుగెత్తుతూనే ఉన్నారు. 

చేసిన చట్టవ్యతిరేకమైన పనిని చట్టబద్ధంగా ఎలా సమర్ధించుకుని తప్పించుకోవచ్చో రకరకాల ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు రామోజీ. ఒకానొక దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోర్టు యొక్క ఆఖరి రోజున మార్గదర్శి కేసుని క్వాష్ కూడా చేయించగలిగారు రామోజీ తరపు న్యాయవాదులు. దాంతో ఇక ఏ ఉండవల్లి తననేమీ చేయలేరని ఊపిరి పీల్చుకున్నారు. 

కానీ వైఎస్సార్ అంశ అయిన జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ఆ కేసుని తిరగతోడమని అనేక మార్లు ఉండవల్లి మీడియా ముఖంగానే సూచించారు. ఇటు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ కి కూడా అదే సూచన చేసారు. ఈస్ట్ న్యూస్ పేరుతో నడిచే ఒక రాజమండ్రి యూట్యూబ్ చానల్లో ఎన్నో ప్రెస్మీట్స్ పెట్టి ఎప్పటికప్పుడు ప్రజల్ని, ప్రభుత్వాల్ని మార్గదర్శి విషయాన్ని మరిచిపోకుండా తన వాగ్ధాటితో నిలబెట్టారు. ఉండవల్లి సూచన వల్లో, లేక ఆయనకే బుద్ధిపుట్టో మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి ఆ కేసుని తిరగతోడి సుప్రీం కోర్టుకి పంపారు. దాంతో ఉండవల్లికి ప్రాణం లేచొచ్చినట్టయ్యింది. ఇక ఈ సారి లక్ష్యాన్ని మిస్సయ్యే పరిస్థితి ఉండకూడదన్నుట్టుగా పనిచేస్తున్నారు. 

ఇక్కడ అనేకమందికి అనేకమైన ప్రశ్నలు. ఉండవల్లి తన ప్రెస్మీట్లల్లో చెప్పిన విషయాలని వినని వాళ్లే ఈ ప్రశ్నలు వేసే వారిలో అధికులు. ఆ ప్రశ్నలేంటంటే- 

* ఇంతకీ ఉండవల్లికి రామోజీపైన ఇంత అక్కసు ఎందుకు?
* ఆయన ఈయనికి వ్యక్తిగత అన్యాయమేమీ చెయ్యలేదు కదా?
* ఒకవేళ వైఎస్సార్ సంధించిన చక్రమే ఉండవల్లి అనుకుంటే ఆయనే పోయాక ఈయనకెందుకు ఇంకా ఈ గొడవ?
* ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి పార్టీలో కూడా ఉండవల్లి లేరు కదా? మరి ఎందుకొచ్చిన ప్రయాస!?

..ఇలా ఎన్నో. 

ఉండవల్లి అరుణ్ కుమార్ కి నిజంగా రామోజీపై ఎటువంటి ద్వేషమూ లేదు. ఇప్పుడీ కేసు గెలవడంవల్ల తనకి ఒనగూరే రాజకీయ ప్రయోజనం కూడా ఏదీ ఉండదు. ఈ కేసు విషయంలో ఉండవల్లి ప్రెస్మీట్లన్నీ చూసిన వాళ్ళకి తప్ప ఇది అర్ధం కాదు. 

ఆయన చెప్పేదల్లా ఒక్కటే. ఒక న్యాయవాదిగా తాను “ఈ దేశంలో ఎంతటి పెద్దవాడైనా చట్టం ముందు అందరితోనూ సమానుడే” అనేది నిరూపించాలనుకుంటున్నారంతే. ఈ కేసులో రామోజీ తప్పించుకుంటే దీనిని అడ్డం పెట్టుకుని మరింత మంది ఆర్ధిక పరమైన నేరాలు చేస్తారని, అలా జరగకూడదంటే రామోజీ చేసింది నేరమని కోర్టు చెప్పాలని అంటున్నారు. అంతే తప్ప తాను రామోజీకి జైలు శిక్ష పడాలనో, కోట్లకి కోట్లు జరిమానా విధించబడాలనో అస్సలు కోరుకోవట్లేదని నాలుగైదు సార్లు చెప్పారు. 

ఇంతకీ రామోజీ చేసిన నేరమేంటి? 

అవిభాజ్య హిందూ కుటుంబం (అన్-డివైడెడ్ హిందూ ఫ్యామిలీ) క్రింద మార్గదర్శి రిజిష్టర్ అయ్యిందట. అంటే సుమారు 22 రకాల కుటుంబసంబంధాలున్న వారి నుంచే డిపాజిట్లు సేకరించవచ్చు. అంటే తల్లి, తండ్రి, కూతురు, కొడుకు..ఇలాగన్నమాట. కానీ దీనిని ఉల్లంఘిస్తూ మార్గదర్శి పేరున లక్షలాది మంది ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు. ఇది చట్టరీత్యా ఆర్ధిక నేరం. 

దీనిపై స్పందిస్తూ…ఏ డిపాజిట్ దారుడు మార్గదర్శిపై కంప్లైంట్ ఇవ్వనప్పుడు అసలిది నేరమెందుకవుతుందన్నది రామోజీ వైపు లాయర్ల తొలి వాదన. దీనికే ఉండవల్లి ఒక ఉదాహరణ తెలిపారు. 

ఫుల్ బాటిల్ మద్యం తాగి ఒకడు బైక్ మీద వెళ్తూ పోలీసులకి దొరికాడనుకుందాం. బ్రీత్ ఎనలైజర్లో వచ్చిన నెంబర్ చూసి పోలీసులు వెంటనే చర్యలు తీసుకోబోతే, “నేను రోజూ ఫుల్ బాటిల్ తాగే డ్రైవ్ చెస్తాను. ఇప్పటి వరకు ఏ ఏక్సిడెంటు చెయ్యలేదు. ఎవరూ నా మీద కంప్లైంట్ ఇవ్వలేదు. కనుక ఈ చట్టం నాకు వర్తించదు. నా మీద కేస్ పెట్టడానికి వీల్లేదు” అని అంటే పోలీసులు వదిలేస్తారా? అది ఎలాగో ఇదీ అంతే అని వివరించారు. 

ఒక సందర్భంలో మదుపర్లందరికీ వేల కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించేసామని, కనుక తమని వదిలేయొచ్చని కోర్టుకు చెప్పుకున్నారు. అంటే తాము చేసింది నేరమని పాక్షికంగా ఒప్పుకున్నట్టే కదా! దీనికీ ఒక ఉదాహరణ ఉంది. ఏ బ్యాంకుకో కన్నం వేసి లేపేసిన సొమ్ముని తిరిగి వెనక్కి ఇచ్చేస్తే కేసు లేకుండా పోతుందా? అది ఎలాగో ఇదీ అంతే అని చెప్పారు. 

అదొక్కటే కాదు..తిరిగి ఇచ్చేసినట్టైతే ఎవరెవరికి ఎంతెంత ఏ రూపంలో ఇచ్చారో చెప్పమంటే చెప్పమని భీష్మించుకుని కూర్చున్నారు రామోజీ వైపు లాయర్లు. అంటే అందులో ఏదో మతలబుందని చెప్పకనే చెబుతున్నట్టే కదా!

మార్గదర్శి కేసు పురాణం చాలా పెద్దది. కానీ మెయిన్ ప్లాట్ పాయింట్ అర్ధం కావాలంటే ఇంతవరకు తెలుసుకుంటే చాలు. 

నేడు మొదటి సారిగా కోర్టు నుంచి రామోజీకి ఎదురు దెబ్బ తగిలింది. తన ఇన్నేళ్ల ప్రస్థానంలో ఈ స్థాయి దెబ్బ మొదటిది. కోర్టు జూన్ 10 వరకు సమయాన్నిచ్చి రెండు విషయాలపై వివరణ కోరింది. 

– మార్గదర్శి అనేది హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ క్రింద నమోదైన కంపెనీ అయితే మరి రామోజీరావుగారు రసీదుల పైన ప్రొప్రైటర్ గా ఎందుకు సంతకం పెడుతున్నారు? ఇది హిందూ అన్ డివైడెడ్ కంపెనీయా? లేక ప్రొప్రైటర్షిప్ కంపెనీయా?

– సొమ్ముని తిరిగిచ్చామంటున్నారు కనుక, ఎవరెవరికి ఎప్పుడు ఎంత సొమ్ముని ఏ రూపంలో వెనక్కి ఇచ్చేసారో చెప్పడానికి ఇబ్బందేమిటి? ఆ వివరాలు పట్టుకు రండి. 

అంతే! 

ఈ రెండు ప్రశ్నలకి రామోజీ వైపు న్యాయవాదులు తెలిపే జవాబులతో కథ అయిపోదని, అసలు కథ మొదలౌతుందని చెబుతున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఎందుకంటే ఆ సమాధానాల్లో తీగ లీగితే డొంక కదిలి మొత్తం రామోజీరావు ఆర్ధికపరమైన తప్పిదాలన్నీ బయటపడతాయని కావొచ్చు. 

ఇదే కేసుపై తరచూ తన వాదనని వినిపిస్తున్న నాగార్జున యాదవ్ ప్రకారం..ఒకవేళ జనం నుంచి తీసుకున్న మొత్తం రూ 2600 కోట్లైతే చట్టం ప్రకారం తిగిరి చెల్లించాల్సింది రూ 5200 కోట్లట. దీని పైన వడ్డీ కూడా వేస్తే ఆ అంకె ఇంకేదో అవుతుంది. 

కేసు ఏమౌతుందో, కోర్టు ఏం చెబుతుందో తెలియదు కానీ రామోజీరావు ఆస్తులపై చూస్తుండగానే ఉండవల్లి, ఆ.ప్ర రాష్ట్ర ప్రభుత్వం తుపాకులు ఎక్కుపెట్టినట్టుంది. రామోజీ ఈసారి ఎలా తప్పించుకుంటారో చూడాలి. 

హరగోపాల్ సూరపనేని