భూతద్దంలో అసమ్మతి

అసమ్మతి అంటేనే రాజకీయపార్టీలకు ఓ భూతం లాంటిది. అలాంటి అసమ్మతిని భూతద్దంలో చూపిస్తే…మరీ పెనుభూతంలా వుంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్  విషయంలో జరుగుతున్నది ఇదే. పార్టీలో అక్కడక్కడా వినిపిస్తున్న సణుగుళ్లు గొనుగుళ్లను ఒడిసిపట్టి, వాటికి అసమ్మతి…

అసమ్మతి అంటేనే రాజకీయపార్టీలకు ఓ భూతం లాంటిది. అలాంటి అసమ్మతిని భూతద్దంలో చూపిస్తే…మరీ పెనుభూతంలా వుంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్  విషయంలో జరుగుతున్నది ఇదే. పార్టీలో అక్కడక్కడా వినిపిస్తున్న సణుగుళ్లు గొనుగుళ్లను ఒడిసిపట్టి, వాటికి అసమ్మతి స్వరాలు జోడించి, మాంచి బలమైన బీట్ గా వినిపించే ప్రయత్నం ప్రారంభమైంది. ఎందుకిలా అని ప్ర‌శ్నించుకుంటే..

సాధారణంగా మానవనైజం ఎలా వుంటుందీ అంటే మనకు అలవిగాని శతృవు వాడి పాపాన వాడే పోతాడు అనుకోవడం. ఇది రాజకీయ పార్టీలకు వచ్చేసరికి వేరేలా వుంటుంది. ఆ పార్టీలో అసమ్మతి పొంగి పొర్లాలని, నేతలు పార్టీని వీడిపోవాలని ఆపై పార్టీ వీకైపోవాలని కోరుకోవడం. ఇప్పుడు ఆంధ్ర నాట అదే జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీతో సామాజిక బంధాలను దశాబ్దాల కాలంగా పెనవేసుకున్న ఓ వర్గం మీడియా ఇప్పుడు ఇదే పదే పదే పలవరిస్తోంది. ఎందుకంటే జగన్ అనే మొండివాడిని ఆ మీడియా కానీ, ఆ మీడియా నమ్ముకున్న రాజకీయ పార్టీ కానీ ఏమీ చేయలేకపోతున్నాయి. పోనీ భాజపా అనే జాతీయ అధికారపార్టీని ఎగదోసి, కాగల కార్యం ఆ రూట్లో చేయిద్దామా అంటే అక్కడా పని జరగడం లేదు.

ఒకటికి మూడు సార్లు ఈ మీడియా సంగతి, ఈ మీడియా భుజాలపై వున్న తెలుగుదేశం పార్టీ సంగతి బాగా అనుభవం అయిపోయింది భాజపాకు, దాని కేంద్ర నాయకులకు అందుకే వారు ఈ గోలను గోడును చూసీ చూడనట్లు, వినీ విననట్లు వదిలేసారు.

ఇక కింకర్తవ్యం. ఏమిటి గత్యంతరం? వైకాపా భవంతి దానంతట అది కూలిపోవాలి. ఆ పార్టీలో అసమ్మతి పొంగి పొర్లాలి. దాని నేతలు ఒకరికి ఒకరు కొట్టేసుకుని, వీలైతే పార్టీ వదిలేయాలి. దాంతో వైకాపా అధికారం కూలిపోవాలి. ఈ విధంగా ఆలోచనలు సాగుతున్నాయి. అయితే ఇదంతా పొగ మాత్రమేనా? నిజంగా అస్సలు నిప్పు అనేది లేదా? ఏ నిప్పు లేకుండానే ఇంతో అంతో పొగరాజేయడం సాధ్యమేనా? అంటే…కాదు అనే చెప్పాలి.

అసమ్మతి జాడలు

అధికారంలో వున్న రాజకీయ పార్టీలో, ఏడాది పాలన తరువాత కూడా అసమ్మతి అన్నది రాలేదంటే ఏదో తేడా వున్నట్లు లెక్క. అక్కడ ఇనుపతెర వున్నట్లు లెక్క. సాధించిన అధికారం కొందరి చేతుల్లో బంధీ అయినా, లేదా సాధించిన అధికారం తమ ఆర్జనకు ఉపయోగపడకపోయినా, కాదూ, సాధించిన అధికారం తమ మాట చెల్లుబాటుకు పనికిరాకపోయినా అసమ్మతి స్వరం అన్నది వినిపించడం రాజకీయాల్లో సర్వ సాధారణం.

అందుకే ఇప్పుడు దాదాపు ఏడాది దాటిన తరువాత వైకాపా లో కూడా అసమ్మతి జాడలు కనిపించడం ప్రారంభమైంది.  ఇలా కనిపించడం అన్నది అంతర్గత ప్రజాస్వామ్య సంకేతమే. కానీ ఆ స్వరం సరైనదా? అపస్వరమా అన్నది పార్టీ అధిష్టానం దృష్టి సారించాలి. అపస్వరం అయితే కచ్చితంగా సరిచేయాలి. సరైన స్వరమైతే, తనను తాను సరి చేసుకోవాలి. ఈ రెండింటిలో ఏది చేయకున్నా గాలి బీటలు పెద్దవై భవనాన్నే కబళించే ప్రమాదం ఎప్పుడూ వుంటుంది. 

తోటకూరనాడే

ఏదైనా పునాదుల లెవెల్ లోనే పరిష్కరించుకోవాలి. అలా కాదు అంటే గోడల పగుళ్లలో పడిన మర్రి విత్తనాల మాదిరిగా ఇంతై, అంతై, అంతింతై అన్నట్లుగా తయారవుతుంది వ్యవహారం. ఆఖరికి భవనాన్నే కూల్చేస్తాయి. ఇప్పుడు వైకాపాలో వినిపించేవి గొణుగుళ్లు, సణుగుళ్లే కావచ్చు, అవి అరుపులై, కేకలై మిన్ను ముట్టేలా కాకూడదు అన్నది గమనించాలి. 

నిజానికి బలమైన నాయకుడు అయిన వైఎస్ జగన్ వున్న వైకాపా వున్న చోట ఇంత సీన్ వుంటుందా? అని అనుకోవడానికి వుంటుందా? అని ఎవైనా అనొచ్చు. కానీ జగన్ మనస్తత్వం, పనితీరు, ఆలోచనా విధానం తెలిసిన వారు మాత్రం అలా అనుకోరు.  

జగన్ అస్సలు జనాలను గారాబం చేయరు. దగ్గరకు తీయరు. ఆయనకు అవసరం అయితే పిలుస్తారు. పలకరిస్తారు. మాట్లాడతారు. లేదంటే లేదు. ఆయనకు ఏమాత్రం తేడా అనిపించినా కిలోమీటర్ల దూరం పెడతారు. అలగడాలు, పిలవడాలు, బుజ్జగించడాలు లాంటి వ్య‌వ‌హారాలు ఆయన దగ్గర వుండవు.  

ఇది రాజకీయపార్టీల్లో రెగ్యులర్ వ్యవహారం కాదు. ఇక్కడ పట్టువిడుపులు వుండాల్సింది. అవసరమైనపుడు నాయకుడైనా కాస్త తగ్గాల్సిందే. కానీ జగన్ కు ఆ విషయంలో ఎవ్వరూ చెప్పలేరు. మరే రాజకీయ పార్టీలోనైనా అయితే రఘురామ కృష్ణం రాజు వ్యవహారం ఈపాటికి తేలిపోయేది. రావణ కాష్టంలా అలా రగులుతూ వుండేది కాదు.

గత పదేళ్ల కాలంగా జగన్ వ్యవహార శైలి చూస్తున్నవారంతా ఆయన డీల్ చేసే వ్యవహారం ఎలా వుంటుందో తెలియనిది కాదు. అంతే కాదు, ఇప్పడు జగన్ ఆలోచ‌నా విధానం మంచిదా, సరైనదా, కాదా అన్న సంగతి అలా వుంచితే, వర్తమాన రాజకీయాలకు సూటవుతుందా? కాదా అన్నది ఆలోచించుకోవాల్సి వుంది. 

అలా అని రాజకీయ నాయకులను బుజ్జిగించి, రాజకీయ అవినీతికి పూర్తిగా తెరలేపాల్సిన పని లేదు. నొప్పివ్వక, తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న మాటలు మరిచిపోకూడదు. జగన్ మరీ చంద్రబాబు మాదిరిగా పార్టీ జనాలను గారాబం చేయనక్కరలేదు. వైఎస్ మాదిరిగా చంకనెత్తుకోనక్కరలేదు. కనీసం వారి సమస్యలు వినాలి. బాధలు వినాలి. అవసరమైన మేరకు, చేయగిలిన మేరకు సాయం చేయాలి.

ఎన్నికలకు ముందు..తరువాత

2019 ఎన్నికలకు ముందు దాదాపు పదేళ్ల పాటు జగన్ తో ప్రయాణం సాగించిన వారు అనేక మంది వున్నారు. జగన్ పార్టీ కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేసి వుండొచ్చు. కానీ వీరు కూడా లక్షలు, కోట్లు ఖర్చు చేసి పదేళ్ల పాటు పార్టీని బతికించుకుంటూ వచ్చారు. కార్యకర్తలను పోషించుకుంటూ వచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చాక తమకు ఏదో ఒకటి జరుగుతుందని, ఒరుగుతుందని అనుకోవడం సహజం. రెగ్యులర్ రాజకీయ నాయకుల మాదిరిగా నియోజకవర్గం లెవెల్ లో హవా చెలాయించాలని అనుకోవడం అంతకన్నా సహజం.

పైగా తమ తమ నియోజకవర్గాల పరిథిలో తమ మాట పూచికపుల్లపాటి కూడా విలువ చేయకపోతే కార్యకర్తల దగ్గర చులకనైపోతారు. కానీ ఇవన్నీ జగన్ కు పట్టమన్నా పట్టవు. ఎంతసేపూ ఆయన అనుకున్నదే. ఆయన ఆలోచనా విధానమే. జనానికి తాను డబ్బులు ఇస్తున్నా. వాళ్లే ఓట్లు వేస్తారు. జనమే గెలిపిస్తారు. ఈ రాజకీయ నాయకులు అంతా తన ఫోటో పెట్టుకు, తన చరిష్మాతో గెలిచారు. అందువల్ల ఇకపై కూడా తనకు జనాలతో తప్ప నాయకులతో పని లేదు అని అనుకుంటే అంతకన్నా ఆత్మహత్యాసదృశం మరేమీ వుండదు.

ఎన్నికల తరువాత జగన్ ఏమి చేసారు? గత పదేళ్లుగా తన కోసం కష్టపడిన యాభై మందినో వంద మందినో గుర్తించి వారికి తలా పదవి ఇచ్చి, లక్షో, లక్షన్నరో జీతం పెట్టేసారు. కానీ ఇదంతా ఆయనకు తెలిసిన వారు, ఆయన దృష్టికి వచ్చిన వారు. వీరు కాక పార్టీని నమ్ముకున్నవారు ఇంకా చాలా మందే వున్నారు. అయితే వీరందరికీ పదవులు ఇవ్వలేకపోవచ్చు. 

ఇవ్వాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ వాళ్లకు ఏవైనా  పనులు అవసరం అయితే చేయాల్సిన అవసరం వుంది. జగన్ దగ్గర పనులు జరగడం లేదు. జగన్ దగ్గర ఎమ్మెల్యేలకు ఎంట్రీ దొరకడం దుర్లభంగా వుంది. అక్కడే అసలు సమస్య స్టార్ట్ అవుతోంది. దీంతో జగన్ కు ఎమ్మెల్యేలకు మధ్య విజయసాయి, సుబ్బారెడ్డి, సజ్జల లాంటి వాళ్లు వుంటున్నారు. వీళ్లతో తేడా వస్తే ఇక జగన్ తో తేడా వచ్చినట్లే.

వర్తమాన రాజకీయం

ఇవ్వాళ ఆంధ్రలో వున్న రాజకీయ పరిస్థితులు ప్రత్యేకమైనవి. రాజకీయాలను కులం ప్రభావితం చేస్తుంది. కానీ అదే రాజకీయాలను డబ్బు శాసిస్తుంది. అధికారం, అసమ్మతి, అలకలు, గెలుపు ఓటములు వీటన్నింటిని డబ్బు ప్రభావితం చేస్తుంది. ఆఖరికి కొంత వరకు ఓట్లను కూడా. ఇసుక దగ్గర నుంచి  ప్రతీదీ ఆదాయమార్గమే. ప్రతీదీ డబ్బుతో కొలిచేదే. అధికార వ్యవహారాలు సమస్తం ఎంత చెప్పుకున్నా డబ్బు చుట్టూనే తిరుగుతాయి.

ఇలాంటి నేపథ్యంలో ఓ ఎంపీనో, ఎమ్మెల్యేనో గెలవాలి అంటే కోట్లు కావాల్సిందే. అవసరం అయితే ఆస్తులు అమ్మాల్సిందే. 2019 ఎన్నికల్లో ఇలా ఆస్తులు అమ్మి,  ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన వారెందరో. వీరందరి ధీమా ఒకటే. అధికారంలోకి వస్తే చాలు అంతకు అంతా సంపాదించేయవచ్చు అనే. కానీ అక్కడే తేడా కొట్టేసింది. 

జగన్ ఆ అవకాశం ఇవ్వడం లేదు. ప్రతిపక్షం, దాని అనుకూల‌ మీడియా తన మీద, తన ప్రభుత్వం మీద ఎన్ని కళ్లేసి వుంటాయో ఆయనకు తెలియనిది కాదు. ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా వదిలేస్తే ఏం జరుగుతుందో తెలియంది కాదు. అందుకే అధికారం అందిన కొత్తలోనే తన ఎమ్మెల్యేలకు ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు.

2024 ఎన్నికల్లో వారి ఎన్నికల నిధుల బాధ్యత తనదే అని, ఎటువంటి అవినీతి వద్దని, అధికారులను వారి పని వారిని చేసుకోనివ్వమని చెప్పేసారు. అప్పటి నుంచి అంటే దాదాపు ఏడాదిగా ఆంధ్రలో ప్రజా ప్రతినిధుల పని ఎలా వుందీ అంటే విస్తర్లో అన్నీ వడ్డించి వున్నా, చేయి పెట్టడానికి లేనట్లు అయింది. 

గతంలో ఇలా కాదు, ప్రభుత్వం ఎవరిదైనా, ఏ పార్టీదైనా రాజకీయ నాయకులకు పనులు జరిగేవి. అయితే మాట పలుకుబడి లేదా డబ్బు. కానీ ఇప్పుడు రెండు విధాలుగానూ బండి నడవడం లేదు.  ఈ ట్రెండ్ వర్తమాన రాజకీయానికి సెట్ అయ్యేది కాదు.

ఆర్డర్ మరిచిపోతే ఎలా?

రాజకీయాల్లో ఓ ఆర్డర్ అంటూ వుంటుంది. గ్రామ నాయకులు, సర్పంచ్ లు, మండల నాయకులు, ఎమ్మెల్యేలు ఇలా. ఇక్కడ ఎవ్వరూ ఎవ్వర్ని ఇగ్నోర్ చేయడం అనేది సాధ్యం కాదు.

ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ లో జనాలకు టచ్ లో వుంటూ, అంతో ఇంతో మాటసాయం చేస్తూ వుండకపోతే ఓట్లు రాబట్టడం అంత సులువు కాదు. అలాగే ఎమ్మెల్యేలతో టచ్ లో వుండడం అన్నది ముఖ్యమంత్రికి కూడా అవసరమే. అలా అని వారిని గారాబం చేయనక్కరలేదు. కానీ అడిగినపుడు అపాయింట్ మెంట్ ఒకసారి కాకుంటే ఒకసారి అయినా ఇవ్వాల్సి వుంటుంది.

ప్రజలకు ఇష్టం వచ్చినట్లు డబ్బులు పంచేసినంత మాత్రాన పని జరిగిపోతుంది అనుకంటే పొరపాటు. గ్రౌండ్ లెవెల్ లో పార్టీని, పార్టీ నిర్ణయాలను ఎవరు డిఫెండ్ చేస్తారు? గ్రౌండ్ లెవెల్ లీడర్లు. వారిని ఎవరు చూసుకుంటారు ఎమ్మెల్యేలు చూసుకోవాలి.  

2024లో టికెట్ ఎవరికి ఇస్తారు?  అన్నది అలా వుంచితే పార్టీని నియోజకవర్గం స్థాయిలో ఎవరు ముందుకు తీసుకెళ్తారు? ఎమ్మెల్యేలు, ఆ స్థాయి నాయకులేగా. మరి వారిని కని పెట్టుకుని వుండకపోతే  ఎలా? ఈ విషయం లో సిఎమ్ జగన్ వైఖరి కచ్చితంగా పార్టీ జనాల్లో కాస్త అసంతృప్తి రేకెత్తిస్తోందని వాస్తవం.

త్రిమూర్తులు ముగ్గురు

సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, రామకృష్ణారెడ్డి. ఈ ముగ్గురికి పార్టీ బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్.  ఎందుకంటే ఆయన అధికారిక బాధ్యతల్లో బిజీగా వుంటారు కాబట్టి. కానీ సమస్య ఏమిటంటే ఈ ముగ్గురికే పొసగదు. అది పార్టీలో వినిపించే వాస్తవం. అప్పటికీ ముగ్గురిని ఓ తాటి మీద వుండమని జగన్ గట్టిగా చెప్పనే చెప్పారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర బాధ్యతలు చూస్తున్నారు. 

అక్కడ ఇప్పటికే బొత్సలాంటి సీనియర్లు వున్నారు. విజయసాయి రెడ్డి వన్ సైడెడ్ గా దూసుకుపోతూ వుంటే సహజంగానే బొత్స లాంటి వారికి కాస్త ఇబ్బందిగానే వుంటుంది. కానీ అది బయటకు చెప్పుకునేది కాదు. కానీ ఎక్కడో అక్కడ ఏదో విధంగా బయట పడుతూ వుంటుంది.

గంటా శ్రీనివాసరావు ఎంట్రీ విషయంలో కిందా మీదా పడ్డారు. తీసుకోవాలని కొందరి ప్రయత్నం. ఆపాలని మరి కొందరి యాగీ. వీటన్నింటి వెనుక పార్టీ లుకలుకలు వున్నాయని టాక్. లేటెస్ట్ గా కరణం ధర్మశ్రీ అనే ఎమ్మెల్యే మిలటీరీ జవాను భూముల కొనుగోలు విషయంలో తగాదా వచ్చింది. 

తన దందా కు విజయసాయి సహకరించడం లేదని ఆయన ఆవేదన. ఒక పక్కన మీడియా ఈ దందా సరి అయినది కాదు అని చెబుతున్నపుడు విజయసాయి ఎలా సహకరిస్తారు? కానీ ఇలాంటి సున్నితమైన విషయాలను విజయసాయి అయినా మరెవరు అయినా సున్నితంగా డీల్ చేసుకోవాలి. అంతే గానీ బాహాటంగా వేదిక మీద మాట్లాడేసరికి మీడియాకు చాన్స్ ఇచ్చినట్లు అయింది.

దక్షిణ కోస్తాలో ఎమ్మెల్యే శ్రీదేవి వ్యవహారం చూడండి. నానా గత్తర అవుతోంది. ఆ యొక్క భగవంతుడు నోరు ఇచ్చాడని చిత్తానికి వచ్చినట్లు ఫోన్ ల్లో మాట్లాడేస్తే పరిస్థితులు తేడావచ్చినపుడు మాటలే తూటాలై పేలతాయి. ఇఫ్పుడు అదే జరుగుతోంది. 

ఇది కాస్తా ఇప్పుడు భూతద్దంలో చూపించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 'రెడ్లు మనల్ని వాడేసుకుంటారు..అవసరం తీరాక వదిలేస్తారు..' అనే అర్థం వచ్చేలా ఆవిడ మాట్లాడిందట. అదిగో చూసారా రెడ్లు ఎలాంటి వారు అని వైకాపా వాళ్లే అంటున్నారో అంటూ మీడియాలో హడావుడి మొదలు. ఆ మాటకు వస్తే ఎవరైనా వాడుకునేవారే. అవసరం తీరాక అల్లుడు గిల్లుడు అనేవారే.

చంద్రబాబు చేసిన తప్పిదం

నిజానికి అధికారంలో వున్నపుడు చంద్రబాబు చేసిన తప్పిదమే జగన్ కూడా చేస్తున్నారు. పార్టీని లోకేష్ చేతిలో పెట్టి, ఆయన ఊళ్లు తిరగడంతోనే సరిపోయింది. లోకేష్ ఆయన కోటరీ పార్టీని నడిపారు. దాంతో చాలా మంది నాయకులకు వారితో పొసగలేదు. పార్టీలో అసమ్మతి చాపకింద నీరులా రాజుకుంది. తీరా అది రగులుకునే వేళకు చంద్రబాబు ఎంటర్ అయినా, కొడుకుగా లోకేష్ నే సమర్థించాల్సి వచ్చింది.

ఇప్పుడు జగన్ కు కూడా అదే సమస్య వస్తుంది. ఎమ్మెల్యేలా? విజయసాయి రెడ్డినా? అన్నపుడు ఆయన విజయసాయి వైపే మొగ్గుతారు. దాంతో ఎమ్మెల్యేలకు అసంతృప్తి పెరుగుతుంది కానీ తగ్గదు. ఇదే పరిస్థితి ఇలాగే ఒకటి ఒకటిగా పేరుకుంటూ వెళ్తే పార్టీకి ఇబ్బంది. 

అందుకే ఇప్పటి నుంచే దీనిపై జగన్ దృష్టి పెట్టాల్సి వుంది. అవసరం అయితే విజయసాయి, సుబ్బారెడ్డి, సజ్జల లాంటి వాళ్ల నిర్ణయాలను సైతం జగన్ సమీక్షించడం అవసరం. అప్పుడు ఎమ్మెల్యేలకు కూడా కాస్త విలువ ఇచ్చినట్లు అవుతుంది.

ఎంత ఏకఛత్రాధిపత్యం వున్నా, మెజారిటీ వచ్చినా, ఇక్కడ బలమైన ప్రతిపక్షం, అంతకన్నా బలమైన మీడియా వ్యతిరేకత వుందని మరిచిపోవడానికి లేదు. దానిని దృష్టిలో పెట్టుకుని అయినా కింది స్థాయి నాయకులతో,  ఎమ్మెల్యేలతో టచ్ లో వుండాల్సి వుంది. 

రేపు దురదృష్టవశాత్తూ జగన్ కు ఏదైనా సమస్య వచ్చినా, దాన్ని జనంలోకి తీసుకెళ్లి ఉద్యమించాల్సింది లోకల్ నాయకులు, ఎమ్మెల్యేలు. కేవలం విజయసాయి, సుబ్బారెడ్డి, సజ్జల వల్ల సాధ్యం కాదు. ఇప్పుడు ఆ ముగ్గురి వెనుక వున్నవారు కూడా సమయం సరిగ్గా లేకపోతే వెనుక వుంటారన్న గ్యారంటీ లేదు.

మొత్తానికి ప్రతిపక్షం వైకాపాలో అసమ్మతిని భూతద్దలో చూపించాలని చూస్తోంది. కానీ నిజానికి అంత సీన్ లేదు. కానీ వైకాపా కూడా ఈ అసమ్మతిని భూతద్దంలో చూడడమే మంచిది. ఎందుకంటే భవిష్యత్ లో ఇంతై అంతింతై వటుడంతై అన్నట్లుగా కాకుండా ఇప్పుడే ఆపరేషన్ చేసి, ఆ కణితిని బయట పారేయవచ్చు. లేదంటే ఆ క్యాన్సర్ వళ్లంతా వ్యాపిస్తుంది. తస్మాత్ జాగ్రత్త

చాణక్య‌