2020-సినిమా చూపించేసింది

తెలుగు కమర్షియల్ సినిమా ఫార్మాట్ ఎలా వుంటుంది? సినిమా మాంచి ఆసక్తికరమైన నోట్ తో స్టార్ట్ అవుతుంది. మాంచి మాస్ సాంగ్ తో హీరో ఎలివేషన్ వుంటుంది. అలా ముందుకు వెళ్లి ఇంటర్వెల్ కు…

తెలుగు కమర్షియల్ సినిమా ఫార్మాట్ ఎలా వుంటుంది? సినిమా మాంచి ఆసక్తికరమైన నోట్ తో స్టార్ట్ అవుతుంది. మాంచి మాస్ సాంగ్ తో హీరో ఎలివేషన్ వుంటుంది. అలా ముందుకు వెళ్లి ఇంటర్వెల్ కు పెద్ద ట్విస్ట్. ఆ తరువాత ఏమవుతుందా? అన్న ఆసక్తి. చివరకు పాజిటివ్ ముగింపునే వుంటుంది. అయినా ఆ శుభం కార్డు పడేవరకు కాస్త టెన్షన్.

ఇప్పడు తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అచ్చం ఇలాగే వుంది. 2020 సంవత్సరం టాలీవుడ్ కు నిజంగా సినిమా చూపించేసింది. ఓ పెద్ద హీరో డిజాస్టర్ సినిమాన అభిమానులు తమ మైండ్ లోంచి ఎలా తుడిచేసి, మంచి సినిమాలనే జ్ఞాపకం పెట్టుకుంటారో టాలీవుడ్ కూడా 2020 ని అలాగే మరిచిపోయే ప్రయత్నం చేస్తోంది. 2021 లోకి కొత్త ఆశలతో వెళ్లాలనుకుంటోంది.

2020 ప్రారంభానికి కొద్దిగా ముందు. 2019 క్లయిమాక్స్. ఫుల్ ఎగ్జయిట్ మెంట్. వెంకీమామ, ప్రతి రోజూ పండగే, రూలర్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లు విడుదలవుతాయన్న వార్తలు, సరిలేరు నీకెవ్వరు-అల వైకుంఠపురములో సినిమాలు ఢీ అంటే ఢీ అంటున్న వైనాలు, ఇవి కాక ఎంత మంచివాడవురా, డిస్కోరాజా, అశ్వద్దామ, చూసీ చూడంగానే, జాను, భీష్మ లాంటి సినిమాల ప్లానింగ్,

ఇవన్నీ కలిసి సినిమా రంగంలో, సినిమా అభిమానుల్లో ఓ ఉత్సాహాన్ని, ఓ ఊపును తీసుకువచ్చేసాయి. మాంచి మెగా మూవీ చూస్తున్నంత హుషారు. మాంచి బాలయ్య డైలాగులు వింటున్న ఉత్సాహం. అలాంటి నేపథ్యంలో డిసెంబర్ వచ్చి ప్రతి రోజూ పండగే లాంటి మాంచి ఫ్యామిలీ హిట్ ఇచ్చి, 2020 లోకి లాక్కుపోయింది.

2020 సూపర్ ఎంట్రీ

అలాంటి ఊపుతో 2020 ఎంటర్ అయింది. అలవైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు అనే రెండు పెద్ద హిట్ లు పడ్డాయి. కరెక్ట్ గా చెప్పాలంటే రెండింటి నడుమ ఓ పాతిక శాతం తేడా వుంటుందేమో కానీ రెండూ బ్లాక్ బస్టర్ కలెక్షన్లు నమోదు చేసాయి. కానీ ఆ వెంటనే ఎంత మంచివాడవురా, డిస్కో రాజా, జాను లాంటి పరాజయాలు నమోదయ్యాయి. అశ్వద్దామ లాంటి చిన్న హిట్ లు, ఆ వెంటనే భీష్మ లాంటి పెద్ద హిట్ లు వచ్చేసాయి.

అప్పుడు జనాలకు అర్థం అయితే సరైన సినిమాలు పడితే సంక్రాంతి వసూళ్లు ఎలా వుంటాయో. దాంతో అర్జెంట్ గా రాజమౌళి ఆర్ఆర్ఆర్ ను 2021 సంక్రాంతికి మార్చేసారు. ఇంకా అనేక సినిమాలు చకచకా పాన్ లోకి వచ్చాయి. కానీ ఈ సంబరం ఎంతో కాలం నిలవలేదు.

మార్చి 14 తరువాత

2020 మార్చి 14 తరువాత అంతా మారిపోయింది. సినిమాలో భయంకరమైన కోటీశ్వరుడు ఆస్తి మొత్త పోగొట్టుకుని రోడ్డు మీదకు వచ్చేసినట్లు సినిమా కళ, కల రెండూ చెల్లా చెదురైపోయాయి. ఎక్కడ థియేటర్లు అక్కడ ఆగిపోయాయి. ఎక్కడ షూటింగ్ లు అక్కడ నిలిచిపోయాయి. 

2020 సమ్మర్ కు వస్తాయనుకున్న అనేక సినిమాలు అలా మూలన పడిపోయాయి. మార్చి చివరి వారం, ఏప్రియల్ మొదటి వారం విడుదల అనుకున్న సినిమాలు బీరువాల్లోకి చేరిపోయాయి. కరోనా కల్లోలాన్ని పూర్తిగా అంచనా వేయలేదు. 

నిజానికి ప్రపంచ దేశాల్లో జనవరి నుంచి ఆ పదం వినిపిస్తున్నా, మనకు మాత్రం ఫిబ్రవరి చివర్లో, మార్చి నుంచే పరిచయం అయింది. సరే, ఓ నెల వుండిపోతుంది అనుకున్నారు అంతా. కానీ నెలల తరబడి తిష్ట వేసుకుని కూర్చుంటుందనుకోలేదు.

టాలీవుడ్ చరిత్రలో ఇన్ని నెలల పాటు థియేటర్లు మూత పడడం, ఇన్ని నెలల పాటు షూటింగ్ లు ఆగిపోవడం, ఇన్ని రోజుల పాటు యావత్ సినీ పరిశ్రమ చేతిలో పని లేకుండా స్థంభించిపోవడం ఇదే తొలిసారి. వేలాది మంది థియేటర్ వర్కర్లు రోడ్డున పడ్డారు. వేలాది మంది సినిమా కార్మికులు ఆదాయం లేక అల్లల్లాడిపోయారు. 

తొలిసారిగా టాలీవుడ్ లో నెలనెల వేలాది మందికి నెలవారీ సరుకులు ఉచితంగా అందించే కార్యక్రమం చేపట్టారు. ఇందుకోసం టాలీవుడ్ సెలబ్రిటీలు కోట్ల రూపాయిలు విరాళాలు ఇచ్చారు. నిజానికి ఇక్కడదాకా బాగానే గడచిపోయింది. ఎవరికి వాళ్లు ఇళ్లలో కూర్చున్నారు. విరాళాలు ఇచ్చారు. జనాలను ఆదుకోగలిగినంత ఆదుకున్నారు. మెలమెల్లగా కరోనాకు అలవాటు పడ్డారు. 

కరోనా బారిన పడ్డవారు పడ్డారు. కరోనా కారణంగా కోల్పోయిన వారూ వున్నారు. కానీ ఓ ఏడాది అంతా దాదాపు పోయింది. మార్చి నుంచి అక్టోబర్ వరకు మాయం అయిపోయింది. పెద్ద సినిమాలు అయితే ఇంకా నవంబర్ వైపు చూస్తున్నాయి.

ఈలోగా ఓటిటి హడావుడి మొదలైంది. చకచకా సినిమాలు కొనడం, వదలడం మొదలైంది. ఇంకేం లేదు థియేటర్లు మరిచిపోవాల్సిందే. ఓటిటిదే రాజ్యం లాంటి మాటలు వినిపించడం ప్రారంభమైంది. కానీ ఓటిటికి వెళ్లిన చాలా సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. 

సినిమాలు బాగా లేకనే ఓటిటికి ఇచ్చారు. బాగుంటే థియేటర్ కోసం వెయిట్ చేసేవారు అనే వాదనలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో కరోనా తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోవచ్చు అన్నారు.

ఇక ఇప్పుడంతా అయోమయం

అయిపోయిందేదో అయిపోయింది. కరోనా కల్లోలం కాస్త చల్లారింది. ఇకనైనా సినిమాలు చేయాలి. చేసుకోవాలి. థియేటర్లు తెరవాలి. కలెక్షన్లు కనిపించాలి. అంతా బాగానే వుంది ఇలా అనుకోవడానికి. కానీ ఏడాదికి అరడజను అయినా పెద్ద సినిమాలు వస్తేనే ఇండస్ట్రీకైనా థియేటర్లకు అయినా కళ. కానీ పెద్ద సినిమాలు అనుకున్నవి అన్నీ అయోమయంలోనే వున్నాయి. ఆ మాటకు వస్తే టాలీవుడ్ మొత్తం అయోమయంలో వుంది.

కళ్ల ముందే దాదాపు ఏడాది మాయం అయిపోయింది. సినిమా రంగంలో హీరోలు కావచ్చు, డైరక్టర్లు కావచ్చు, బ్యానర్లు కావచ్చు, అన్నీ అక్కడిక్కడే తిరుగుతుంటాయి. అన్నీ ఇంటర్ లింక్. హీరో ఒక సినిమా ఫినిష్ చేస్తే  మరో డైరక్టర్ కు చాన్స్. ఇంకో బ్యానర్ కు చాన్స్. ఒక డైరక్టర్ ఒక సినిమా పూర్తి చేస్తే ఇంకో డైరక్టర్ కు అవకాశం. హీరోకు మరో సినిమా. ఇలా వుంటుంది పరిస్థితి.

ఇప్పుడు అదంతా చిక్కులు పడిన దారం మాదిరిగా తయారైంది. అంత సులువుగా సాల్వ్ చేయలేని పజిల్ గా మారిపోయింది. ఏ సినిమా ఎప్పుడు సెట్ మీదకు వెళ్తుందో తెలియదు. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఎప్పుడు ఏ హీరో ఖాళీ అవుతారో తెలియదు. ఎప్పుడు తమ వంతు వస్తుందో తెలియదు.

రోజులు..డబ్బులు

టాలీవుడ్ లో నిర్మాతల విషయం పక్కన పెడితే మిగిలిన అందరిదీ దాదాపు ఒకటే బాపతు. టైమ్ ఈజ్ మనీ. కాల్ షీట్ కు ఇంత. హీరో..హీరోయిన్లు మినహా మిగిలిన వారి పరిస్థితి. హీరో..హీరోయిన్లు కూడా నలభై నుంచి అరవై రోజులు కేటాయిస్తే చాలు ఓ సినిమా. 

మరి ఆ రోజులు అన్నీ అలా మాయం అయిపోతే ఎంత నష్టం? ఆచార్య సినిమా మీద దర్శకుడు కొరటాల శివ లాక్ అయిపోయి ఏళ్లు దాటేస్తోంది. ఈ లోగా ఆయన కనీసం మరో రెండు సినిమాలు చేసి వుండేవారు. అంటే ఎన్ని కోట్ల ఆదాయం. అలాగే ఆచార్య ఇన్ టైమ్ లో పూర్తయిపోయి వుంటే మెగాస్టార్ మరో సినిమా మీదకు వెళ్లి వుండేవారు. మెగాస్టార్ కోసం కనీసం ముగ్గురు దర్శకులు, నిర్మాతలు లైన్ లో వేచి వున్నారు. అటు కొరటాల శివ కోసం అలాగే ఎదురుచూపులు.

కానీ ఆచార్య పూర్తి కావాలంటే ఆర్ఆర్ఆర్ నుంచి రామ్ చరణ్ రావాలి. అదే ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ బయటకు వస్తేనే దర్శకుడు త్రివిక్రమ్ సినిమా. ఆయన సినిమా వచ్చి పదినెలలు దాటేసింది. నిజానికి హీరో రెడీగా వుంటే ఈ పాటికి ఆయన మరో సినిమా చేసేసి వుండేవారు. 

ఆయనకు ఎన్ని కోట్లు నష్టం? పవన్ కళ్యాణ్ దీ ఇదే పరిస్థితి. మహేష్ బాబుదీ ఇదే సీన్. ఎన్నో హిట్ లు ఇచ్చిన ఎందరో డైరక్టర్లదీ ఇదే తరహా. వెంకటేష్ నారప్ప ఫినిష్ చేస్తే తప్ప ఎఫ్ 3 స్టార్ట్ కాదు.  ప్రభాస్ రాథేశ్వామ్ పూర్తి చేస్తే తప్ప తరువాత సినిమాలకు పచ్చలైట్ వెలగదు.

నిర్మాతల గోడు

నిర్మాతల సమస్య ఏమిటంటే సినిమా కోసం కీలకమైన హీరో, దర్శకులకు అడ్వాన్స్ లు ఇచ్చి వుంటారు. అదేమీ ఇంట్లో స్వంత సొమ్ము కాదు. అంత స్వంత సొమ్ము టాలీవుడ్ లో రొటేట్ కాదు. ఫైనాన్స్ తెచ్చి ఇస్తారు. ప్రాజెక్టు మీద ఫైనాన్స్, అది కూడా సినిమా ఫైనాన్సియర్ల దగ్గర అయితే వెయిటింగ్ లో వుంటారు. వేరే విధమైన లోన్లు అయితే వడ్డీలు కట్టుకోవాలి.

సినిమా ఆలస్యం అయిన కొద్దీ ఆఫీసు ఖర్చులు వృధాగా పడుతూనే వుంటాయి.  నెల నెలా జీతాలు, అద్దెలు, కరెంట్ బిల్లులు ఒకటేమిటి సమస్తం. ఇవన్నీ వెళ్లి సినిమా మీదే పడతాయి. దీంతో బడ్జెట్ పెరుగుతుంది. ఇదిలా వుంటే కరోనా తరువాత మార్కెట్ ఎలా వుంటుందీ అన్నది క్లారిటీ లేదు. కచ్చితంగా బాగుంటుంది అని ఒకపక్క. జనాలు టీవీ లకు ఓటిటి లకు అలవాటు పడుతున్నారు.  థియేటర్ కు అంతగా రారేమో అన్న భయం మరోపక్క.

ఇలాంటి టైమ్ లో ఖర్చులు తగ్గించుకోవాలనే వుంటుంది. కానీ ఎలా? డిమాండ్ వున్న ఆర్టిస్టులు ఎవ్వరూ అంతగా తగ్గరు. హీరోల దగ్గరకు వెళ్లి రెమ్యూనిరేషన్ తగ్గించుకోమని అడిగేంత సీన్ టాలీవుడ్ లో లేదు. అమాంతం ప్రాజెక్ట్ వెళ్లి మరో నిర్మాత చేతుల్లో పడుతుంది. 

అందువల్ల ఖర్చులు తగ్గవు. వడ్డీలు తగ్గవు. రెమ్యూనిరేషన్లు తగ్గవు. సినిమా ఎప్పుడు వుంటుందో తెలియదు. ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుందో అసలే తెలియదు. అసలు అన్నింటికి మించి కరోనా తగ్గుతుందా? బౌన్స్ బ్యాక్ అంటూ సెకెండ్ వేవ్ ప్రారంభం అవుతుందా?  అదో పెద్ద అనుమానం.

దర్శకుల బాధ

టాలీవుడ్ లో దర్శకులది మరో తరహా బాధ. పెద్ద దర్శకుడైనా, చిన్న దర్శకుడైనా హీరోతో కమిట్ అయతే అలా వెయిటింగ్ లో వుండాల్సిందే. రావడం ఆలస్యం అవుతుందేమో, ఈలోగా మరో సినిమా చేసి వస్తా అనే మాట పెదవి దాటి రాకూడదు. లోలోపలే అణచిపెట్టుకోవాల్సిందే. పోనీ హీరోలకు ఈ విషయం తెలియదా అంటే బాగా తెలుసు. 

కానీ వారు పొరపాటున ఆ విషయం ప్రస్తావించరు. ఎవరికోసం వేచి వుంటారు అనే ఇగో భయంకరంగా వుంటుంది టాలీవుడ్ లో. రాజమౌళి లాంటి కేసు మాత్రమే రివర్స్ వ్యవహారం. అక్కడ ఆయన సినిమా చేసే వరకు హీరోలు వేచి వుండాల్సిందే. మాట్లాడేందుకు లేదు.

ప్రతి హీరో తరువాత ప్రాజెక్టు కోసం కమిట్ అయిన దర్శకులు అంతా మౌనంగా ఇళ్లలో కూర్చుని రోజులు లెక్కపెడుతూ, తాము ఒప్పుకున్న హీరో ఎప్పుడు రన్నింగ్ ప్రాజెక్టు పూర్తి చేసి వస్తాడా? అని చూస్తూ వుండాల్సిందే. నిజానికి ఇలాంటి వ్వవహారం మరే వృత్తిలో వ్యాపారంలో వుండదు. హీరోలకు చెప్పకుండా, వారి కన్సెంట్ లేకుండా, దర్శకులు అడుగు కదపలేరు. అలా కదిపారో మళ్లీ ఆ హీరో డేట్ లు దొరకమన్న దొరకవు.

డిస్ట్రిబ్యూటర్లు/ఎగ్జిబిటర్లు

సినిమా రంగంలో నిర్మాతలు, డైరక్టర్ల పరిస్థితి ఇలా వుంటే, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్య మరోలా వుంది. నిజానికి డిస్ట్రిబ్యూటర్లకు పెద్దగా సమస్య లేదు. వ్యాపారం ఆగిపోయింది అంతే. పైగా ఈ ఏడాది తొలినెలల్లో విడుదలైన సినిమాల అక్కౌంట్లు ఇంకా సెటిల్ కాలేదు. 

అందువల్ల నిజానికి డిస్ట్రిబ్యూటర్ల దగ్గరే ఇంతో అంతో మొత్తం వుంది. కానీ ఎగ్జిబిటర్ల సమస్య వేరు. ఒక్క థియేటర్ వుంటే చాలు నెలకు కనీసం లక్ష నుంచి లక్షన్నర ఖర్చు అవుతోంది. కానీ థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయో అన్నది క్లారిటీ లేదు. వాస్తవానికి ప్రభుత్వాలు థియేటర్లు తెరచుకోవడానికి అనుమతి ఇచ్చాయి.

కానీ వేయడానికి సినిమాలు లేవు. మరో నెల, రెండు నెలల తరువాత కానీ ఓ అరడజను సినిమాలు రెడీ కావు. ఆ తరువాత మళ్లీ ఖాళీ. పైగా యాభై శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు రెడీగా లేరు. దీంతో ఎగ్జిబిటర్లు పూర్తి అయోమయంలో చిక్కుకున్నారు. ఎప్పటికి మళ్లీ పరిస్థితులు చకచకబడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. 

జనవరి నాటికి పరిస్థితులు మామూలు అవుతాయనే నమ్మకంతో వున్నారు. కానీ ఈలోగా కరెంట్ బకాయిలు కట్టడం అన్నది ఎగ్జిబిటర్లకు సమస్యగా మారింది. ఈ విషయంలో రెండు తెలుగు ప్రభుత్వాలు స్పందించడం లేదు.

సెకెండ్ వేవ్ వస్తే..

ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న కొత్త పదం సెకెండ్ వేవ్. అంటే కరోనా మహమ్మారి మరోసారి తిరగబడితే. ఇప్పటికే కొన్ని విదేశాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. విదేశాలతో పోల్చుకుంటే మన దగ్గర కరోనా ఆలస్యంగా ప్రారంభమైంది. ఆలస్యంగా తగ్గుముఖం పట్టింది. కానీ మన జనాభా తో పోల్చుకుంటే ఇక్కడ కరోనా తీవ్రత తక్కువనే చెప్పాలి.

ప్రజలు, ప్రభుత్వాలు తీసుకున్న జాగ్రత్తలు అలాంటివి. అదే విధంగా ఆలస్యంగానైనా మన దగ్గర కూడ సెకెండ్ వేవ్ వస్తుందనే భయం కనిపిస్తోంది. వినిపిస్తోంది. అదృష్టం బాగా లేక అలాంటి పరిస్థితి వస్తే ఇక టాలీవుడ్ కుదలు అయిపోతుంది.

ఇప్పటికే దాదాపు ఓ ఏడాది మిస్ అయిపోయంది. సెకెండ్ వేవ్ అనేది వస్తే మరో ఏడాది మాయం అయిపోతుంది. సినిమాల నిర్మాణం అయోమయంలో పడిపోతుంది. అసలు ఏ సినిమా వుంటుందో, ఏ సినిమా ఉండదో కూడా ఊహించలేము. పరిస్థితి అంతగా చేయిదాటిపోవచ్చు. అలాంటి ప్రమాదం రాకూడదని, టాలీవుడ్ మళ్లీ సినిమాలతో కళకళలాడాలని కోరుకుందాం.

-విఎస్ఎన్