ఓట్ల పథకాలకు దూరంగా…..

రూపాయి ఆదాయం వస్తే, అర్ధరూపాయి ఖర్చులు పోనూ, మిగిలిన అర్థరూపాయితో ఫ్యాక్టరీలు పెట్టడం, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వంటి ప్లానింగ్ వుండేది ఒకప్పుడు. కానీ ఇప్పడు కాలం మారిపోయింది. రాజకీయాలు మారిపోయాయి. జనం ఆలోచనలు…

రూపాయి ఆదాయం వస్తే, అర్ధరూపాయి ఖర్చులు పోనూ, మిగిలిన అర్థరూపాయితో ఫ్యాక్టరీలు పెట్టడం, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వంటి ప్లానింగ్ వుండేది ఒకప్పుడు. కానీ ఇప్పడు కాలం మారిపోయింది. రాజకీయాలు మారిపోయాయి. జనం ఆలోచనలు కూడా మారిపోతున్నాయి. 'మాకేంటీ' అనే డిమాండ్ తప్ప,  రాష్ట్రానికేంటీ అనే ఆలోచన లేదా జిల్లాకు ఏంటీ అనే డిమాండ్ వినిపించడం మానేసాయి.

ఇలాంటి టైమ్ లో ప్రభుత్వాల ఆలోచన కూడా మారిపోయింది. ఎప్పుడో చాలా అంటే చాలా ఏళ్ల క్రితం ఆసుపత్రుల్లో యూజర్ చార్జీలు పెట్టాలనే ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వం చేసి, మళ్లీ వెనకడుగు వేసింది. కానీ ఇప్పుడు జనం రకరకాలుగా పన్నులు కడుతున్నారు. కారు కొంటే లైఫ్ టాక్స్ కడుతున్నారు. మళ్లీ ఎక్కడిక్కడ టోల్ టాక్స్ కడుతున్నారు. పార్క్ చేస్తే పార్కింగ్ ఫీ కట్టాలి.

బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ అనే పథకాలు ఎక్కువగా వుండడం వల్ల ఎక్కడిక్కడ ఏదో రూపంలో జనం చెల్లింపులు చేయాల్సిందే. ఒకప్పుడు కుళాయిలు వుండి మంచి నీరు వచ్చేది మున్సిపాల్టీల్లో. వీధి కుళాయిలు వుండేవి. ఇప్పుడు అపార్ట్ మెంట్లకు ఇళ్లకు కుళాయిలు ఇస్తారు. కానీ మీటర్లు పెట్టి డబ్బు కట్టాలి. ఇంటి పన్ను కట్టినందుకు మీకేమీ మున్సిపాల్టీ నుంచి ఉచితంగా రాదు.

పన్ను..పన్ను..పన్ను

మీ ఆదాయం మీద పన్ను కడతారు. మీ ఉద్యోగానికి పన్ను కడతారు. మీరు తిరిగే రోడ్ కు టోల్ కడతారు. మీరు కొనే ప్రతి వస్తువుకు మళ్లీ పన్ను కడతారు. అంటే ఇరవై శాతం ఆదాయపు పన్ను మాత్రమే కాకుండా మీ వ్యాపకాలను బట్టి రకరకాల పన్నులు ఏడాది పొడవునా చెల్లిస్తూనే వుంటారు.  ప్రభుత్వం తరపున ఏదీ ఉచితంగా రాదు.  ఎక్కడైనా, ఏ రంగమైనా. దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు, ఏ ప్రభుత్వమూ మినహాయింపు కాదు.

పోనీ ఇలా వచ్చిన డబ్బులతో ప్రజలకు ఏమైనా చేస్తారా? అంటే రకరకాల ప్రీ..ఫ్రీ..ఫ్రీ స్కీములు. చంద్రబాబు వుంటే కొన్ని రకాలు, జగన్ వుంటే మరికొన్ని రకాలు. ఎనభై రూపాయల భోజనం అయిదు రూపాయలకు అన్న క్యాంటీన్ అంటూ పెట్టేయడం. తినేవాళ్లు ఎవరు. ఎవరు పడితే వాళ్లు. ఇది అపాత్ర దానం కాదా?

పథకాలు..ఫలితాలు

ప్రభుత్వాలు ఎంత గుడ్డిగా పని చేస్తాయి అంటే, పల్లెటూరులో 65 ఏళ్ల మహిళ వృద్దాప్య పింఛను తీసుకుంటుంది. ఉపాథి హామీ పథకంలో మళ్లీ పాల్గొని డబ్బులు తీసుకుంటుంది. పని చేయలేదని, ఫింఛను ఇస్తూ, మళ్లీ ఉపాథి హామీలో చేర్చి పని ఇవ్వడం అంటే ఎంత అర్థం లేని వ్యవహారమో అర్థం చేసుకోవచ్చు.

అసలు ఈ ఉపాథిహామీ పథకం కింద చాలా చోట్ల చేపట్టే పనులు చూస్తుంటే భలే నవ్వు వస్తుంది. ఎక్కడో కొండ పాదాల్లో ట్రెంచ్ లు తవ్వడం, లేదా ఆ ఊరి పెద్ద మనుషులకు ఉపయోగపడే రీతిలో నిబంధనలకు అనుకూలమైన పనులు అటు మళ్లించడం.

ఎంతో కొంత భూమి వున్నవారికి తెల్ల కార్డు మీద బియ్యం ఇవ్వడం. ఆ బియ్యాన్ని వాళ్లు తినకుండా కిలో పదిహేను రూపాయలకు అమ్మేసుకోవడం. ప్రభుత్వం రూపాయికి ఇవ్వడం ఏమిటో? వాళ్లు తమ స్వంత పంట తింటూ, ఈ బియ్యం అమ్మేసుకోవడం ఏమిటో? రాజకీయాల కారణంగా ఇవేవీ ఆపలేరు. అధికార పక్షం ప్రతిపక్షం అయినా, ప్రతి పక్షం అధికార పక్షం అయినా ఈ పథకాలు ఇలా సాగుతూనే వుంటాయి.

అధికారపక్షం తెల్ల కార్డులు తీసేయాలనుకుంటుంది. ప్రతిపక్షం వద్దు అంటుంది. కానీ అదే ప్రతిపక్షం అధికారంలోకి వస్తే అదే పని చేయాలనుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలో 2019 ఎన్నికలు కొత్త దారి తొక్కాయి. ఏకంగా ఒక్కో ఆడపడుచుకు పది వేలు వంతున ఎన్నికలకు కొద్ది రోజులు ముందుగా నేరుగా డబ్బుఇవ్వడం అనే కొత్త పద్దతికి తెరతీసారు చంద్రబాబు నాయుడు.

కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. బాబు గద్దె దిగిపోయారు. జగన్ అధికారంలోకి వచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చింది ఆదిగా ఈ డబ్బులు పంచే కార్యక్రమం అవిశ్రాంతగా సాగుతోంది. ఇది ఎంత వరకు వెళ్లిందంటే, జనం ఎటిఎమ్ లకు వెళ్లి ఏవైనా డబ్బులు వేసాడేమో జగన్ అని నిత్యం చెక్ చేసుకునేంత.

దీంతో ఇలాంటి స్కీముకు శ్రీకారం చుట్టింది తనే అని మరచిపోయి చంద్రబాబు, ఆయన పార్టీ జనాలు, జనానికి డబ్బులు పంచేస్తున్నాడు బాబోయ్ అని గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. దీనివల్ల రాష్ట్రం దివాలా అనే ఆరోపణ కూడా చేస్తున్నారు.

జగన్ జనాకర్షణ

నిజమే జగన్ జనాకర్షక పథకాలు అమలుచేస్తున్నారు. ఇవన్నీ రేపు ఓట్లు ఏ మేరకు కురిపిస్తాయి అన్నది పక్కన పెడితే, వీటి అంతిమ లక్ష్యం ఓట్ల వేటే అన్నది కాదనలేని సత్యం. కానీ అదే జగన్, ఓట్ల పథకాలతో పాటు, మరిన్ని గట్టి పథకాలు అమలు చేస్తున్నారు. సమస్య ఏమిటంటే, ఈ నోటు పథకాల గోలలో, ఆ అసలు పథకాలు కనిపించకుండా పోతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో చీమ చిటుక్కు అంటేనే మీడియాల తొలిపేజీలు నిండిపోయేవి. చీమ చిటుక్కు మనకుండా కూడా, ఎంత సౌండ్ వస్తుందో అంటూ రీసౌండ్ వినిపించేవి.  

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోట్లకు కోట్లు జనాలకు నగదు రూపంలో కుమ్మరిస్తున్నారు. అది మంచిదా చెడ్డదా అన్న చర్చ అలాగే వుండనిచ్చి, నగదు ఇవ్వడం కాకుండా, అభివృద్ది పనులు కొన్ని చేస్తున్నారు. వాటి మీద ఓసారి దృష్టి సారిద్దాం. ఎందుకంటే జనం కట్టే పన్నుల డబ్బులు ఏదో రూపంలో జనానికి ఉపయోగడపడితే మంచిదేగా. ఆ తరహా పనులు జగన్ ఏం చేస్తున్నారో ఓసారి చూద్దాం.

స్కూళ్ల ఆధునీకరణ

ప్రభుత్వ పాఠశాలలు అంటే కనీస సౌకర్యాలకు కిలో మీటర్ల దూరంలో వుంటాయన్న సంగతి తెలిసిందే. అలాంటి స్కూళ్లు అన్నీ ఒకేసారి యుద్ద ప్రాతిపదికన మరమ్మతు చేసి, సకల సౌకర్యాలు కలిగించి, అందగా ముస్తాబు చేయడం అంటే కచ్చితంగా మెచ్చుకోవాలి కదా?  జగన్ చేసిన పనేమిటీ అంటే గ్రామ గ్రామాన వున్న స్కూళ్లకు ఏం కావాలో డిసైడ్ చేసి, ఆ మేరకు నిధులు ఇచ్చి, వాటిని చకచకా రెడీ చేయడం. టోటల్ రాష్ట్రాన్ని ఓ యూనిట్ గా తీసుకుని, అన్ని పాఠశాలలను ఒకేసారి ముస్తాబు చేయించడం అంటే మెచ్చుకోవాల్సిందేగా.

ఇక్కడ జగన్ చేసిన మరో పని ఏమిటంటే, ఎక్కడ స్కూలు పని అక్కడి స్కూలు కమిటీలకే అప్పగించేయడం. స్కూళ్లకు కీలకంగా చేసే మార్పులు, అత్యాధునిక బాత్ రూమ్ సదుపాయాలు కల్పించడం, గదులన్నీ సిరామిక్ టైల్స్ తో మార్చడం, కొత్తగా మాంచి అందమైన బెంచీలు, నల్ల బల్లలు ఏర్పాటు చేయడం, అన్నింటికి మించి స్కూళ్లకు కొత్త రూపు ఇవ్వడం కోసం ప్రహారీ, గేటు ఏర్పాటు చేయడం. దీంతో ఇప్పుడు స్కూళ్లు అన్నీ ఆంధ్రలో కొత్తగా కళకళలాడుతున్నాయి.

స్కూలు వాతావరణం బాగుంటే పిల్లలకు ఆసక్తిగా వుంటుంది. ప్రయివేటు స్కూళ్లు జనాలను ఆకర్షించడానికి వున్న రకరకాల కారణాల్లో ఇది కూడా ఒకటి.  ప్రభుత్వం కోట్లాది రూపాయలు స్కూళ్ల నిర్వహణ మీద ఖర్చు చేస్తోంది. ప్రభుత్వ టీచర్ల జీతాల వివరాలు తెలుసుకుంటే ఔరా అని అనిపిస్తుంది. ఇంకా చాలదన్నట్లు ఏటా నియామకాలు చేస్తూనే వున్నారు.  అలా చేయడం కూడా రాజకీయ కార్యక్రమాల్లో భాగం అయిపోయింది. 

ఇప్పుడు ఈ వ్యవస్థను ఏమీ చేయలేరు. జీతాలు ఇవ్వాల్సిందే. ఫైనల్ బెనిఫిట్లు ఇవ్వాల్సిందే. పింఛన్లు ఇవ్వాల్సిందే. అలాంటపుడు ఈ వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగిస్తే…ఇప్పుడు జగన్ చేస్తున్నది అదే. ఇంగ్లీష్ మీడియంలో వీళ్ల చేత పాఠాలు చెప్పిస్తే, స్కూళ్లు ఆధునీకరిస్తే.

కానీ మన దరిద్రం ఏమిటంటే ట్రయినింగ్ లేకుండా ఇంగ్లీష్ లో ఎలా చెబుతారు? అసలు తెలుగు వదిలేయడం ఏమిటి? మన సంస్కృతి చట్టబండలు ఏమైపోతాయి. మన తెలుగు జాతి నాశనం అయిపోదా అనేంత గోల. కానీ వీళ్లంతా తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలోనే చదివిస్తారు. అది వేరే సంగతి. ఇప్పుడు జగన్ చేసిన పని వల్ల ప్రభుత్వ స్కూళ్ల వైపు మళ్లీ కాస్త దృష్టి మళ్లు తోంది. ఇక టీచర్లదే బాధ్యత. వాళ్ల ఏ మాత్రం శ్రద్ద తీసుకున్నా, ప్రభుత్వ బడులకు కొత్తకళ వస్తుంది.

జిల్లాకో మెడికల్ కాలేజీ

ప్రతి గ్రామంలోనూ సంచీ డాక్టర్ లేదా ఆర్ఎంపీ డాక్టర్ వుంటారు. కనీసం ఎంబిబిఎస్ డాక్టర్ ఎందుకు వుండరు. ఎందుకంటే మెడికల్ కాలేజీలు తక్కువ. సీట్లు తక్కువ. బయటకు వచ్చేవారు తక్కువ. అలా వచ్చేవారంతా పట్టణాల్లో ప్రయివేటు ప్రాక్టీసు పెడతారు. అదే తామరతంపరగా ఇప్పుడు ఇంజనీర్లు తయారవుతున్న మాదిరిగా డాక్టర్లు కూడా తయారైపోతే, పట్టణాల్లో పోటీ ఎక్కువై కనీసం సెకండ్ క్లాస్ టౌన్ లు లేదా పెద్ద విలేజ్ ల దారి పట్టాల్సిందే కదా.

ఇప్పడు జగన్ తీసుకున్న నిర్ణయం ఆ దిశగా సాగుతోంది. ప్రతి జిల్లా కేంద్రంలో ఓ మెడికల్ కాలేజీ వంతున నిర్మించాలని నిర్ణయించారు. దాదాపు 25 కొత్త మెడికల్ కాలేజీలు. అంటే అయిదేళ్ల తరువాత అయినా ఏటా కనీసం అయిదు నుంచి పది వేల మంది కొత్త డాక్టర్లు తయారవుతారు. అప్పుడు ప్రయివేటు వైద్యం అయినా కనీసం అందరికీ అందుబాటులోకి వస్తుంది.  పైగా ఇక్కడ అసలు సంగతి ఇంకోటి వుంది. ప్రతి కాలేజీకి అనుబంధంగా ఆసుపత్రి వుండాల్సిందే. అంటే 25 ప్రభుత్వ పెద్దాసుపత్రులు. అది కూడా ప్రజలకు మంచిదేగా.

గిరిజనులకు

ఇది కాక జగన్ తీసుకున్న మరో మంచి నిర్ణయం అయిదు గిరిజన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం. కీలకమైన గిరిజన ప్రాంతాల్లో అయిదు ఆసుపత్రులు నిర్మించడం అవి కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు.  ఏటా ఎంతో మంది గిరిజనులు సరైన వైద్యం అందక మరణిస్తున్నారు. అలాంటి గిరిజనులకు ఇది వరం లాంటి నిర్ణయమే కదా.

పైగా ఆరోగ్య శ్రీ పథకం కింద ఏటా వందల కోట్లు ఖర్చు చేసి, ప్రయివేటు ఆసుపత్రులను పోషిస్తున్నారు. ఇప్పుడు ఇలా కొన్నాళ్ల పాటు ప్రభుత్వ వైద్య సదుపాయాలను మెరుగుపరిస్తే, అదే ఆరోగ్య శ్రీ పేషెంట్లను ఈ ఆసుపత్రులకు మరలించవచ్చు. తద్వారా ప్రభుత్వంపై ఆరోగ్య శ్రీ భారాన్ని తగ్గించవచ్చు. ప్రయివేటు ఆసుపత్రుల ఆరోగ్య శ్రీ బిల్లుల దోపిడీని అరికట్టవచ్చు.

రైతు భరోసా కేంద్రాలు

ప్రతి కొన్ని పంచాయతీలకు కలిపి ఓ రైతు భరోసా కేంద్రం. రైతుల గురించి ఉపన్యాసాల వరకు మామూలే. కానీ ఆచరణేదీ? విత్తనాలు కావాలంటే మండల కేంద్రం వరకు పోవాలి. సమాచారం కావాలంటే మండల కేంద్రమే దిక్కు. అలాంటిది అందుబాటులోకి అన్నీ వస్తే..నిజంగా మెచ్చుకోదగ్గ ఆలోచనే కదా. 

ఈ ఏడాది రైతులందరికీ ముందుగా ఆన్ లైన్ లో విత్తనాల బుకింగ్, ఆపై విత్తనాల సరఫరా ఈ కేంద్రాల నుంచే జరిగింది. అలాగే ఎరువుల సరఫరా కూడా. ఇంతకన్నా రైతుకు ఏం కావాలి.

మరి ఎలా అమలులోకి వస్తుందో కానీ, ఇవే కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు కూడా వుంటుందని ప్రకటించారు జగన్. ఇదే కనుక ఆచరణలోకి వస్తే రైతులు ఫుల్ హ్యాపీ. దళారులకు ఏదో ఒక థరకు, ఏదో ఒక కొలతకు ఇచ్చేయక్కరలేదు. సరైన రేటుకు, సరైన కొలతకు తమ తమ కమతాలకు దగ్గరలోనే అమ్ముకోవచ్చు.

అలాగే ప్రతి రైతు భరోసా కేంద్రానికి అనుబంధంగా చిన్న సైజు లో అయినా కోల్ట్ స్టోరేజ్ సదుపాయాలు కలిగించగలిగితే, ఇక అంతకన్నా రైతుకు చేయాల్సింది వుండదు.

సచివాలయాలు

గ్రామ సచివాలయాలు అన్నది నిజంగా పరిపాలన వికేంద్రీకరణలో ఓ విప్లవాత్మక మార్పు. చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. గతంలో వీఆర్వో ను కలవాలి అంటే జనం మండల కేంద్రానికి వెళ్లి, ఆయన ఎక్కడ వున్నారో వెదకాలి. దొరికితే కలవాలి. లేదంటే లేదు. కానీ ఇప్పుడు. థంబ్ ఇంప్రెషన్ వేసి మరీ గ్రామ సచివాలయాల్లో కూర్చోవాలి.  అంటే జనానికి పాలన అందుబాటులోకి వచ్చినట్లే కదా.

ఎమ్మార్వో, ఎండీవో ఆఫీసులకు వెళ్తే కానీ జరగని చిన్న చిన్న పనులెన్నో ఇప్పుడు సచివాలయాల్లో ఇట్టే జరిగిపోతున్నాయి.  అన్నింటికి మించి చిన్న చిన్న పల్లెల్లో కూడా ఓ ప్రభుత్వ కార్యాలయం దాంట్లో కొంత మంది ఉద్యోగులు, ఉదయం నుంచి సాయంత్రం వరకు హడావుడి.

మరోపక్కన గ్రామీణులు సింపుల్ గా తమ డౌట్ లు క్లియర్ చేసుకోగలరు. విలేజ్ వాలంటీర్లు, సెక్రటరీలు ఎక్కువగా ఆ గ్రామంలోని వారే, ఆ గ్రామీణులకు పరిచయం అయినవారే అయి వుంటారు. అందువల్ల ఎటువంటి బెరుకు లేకుండా వాళ్లను అడగగలరు. అవసరం అయితే నిలదీయగలరు.

కార్పొరేషన్ల ఏర్పాటు

బిసి కార్పొరేషన్ ను విడదీసి వివిధ కులాలకు వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. ఇది కూడా సరైనదే. ఇది కాదని అంటున్న తెలుగుదేశం పార్టీ షెడ్యూల కులాల రిజర్వేషన్లు ఎందుకు విడదీయాలని ప్రయత్నం ప్రారంభించింది. ఎన్టీఆర్ టైమ్ లో  శ్రీకాకుళం కాళింగుల్లోని ఒక వర్గాన్ని తీసి బిసి డి లో పెట్టాలని ప్రయత్నించారు. 

ఇక్కడ సమస్య ఏమిటంటే నోరు వున్నవాడిది రాజ్యం అన్నట్లుగా, బిసిలు అందరికీ కలిసి గంప గుత్తగా ఒకే కార్పొరేషన్ వుంటే అన్ని కులాలకు సమాన న్యాయం జరగదు. అదే ఎవరి ఫండ్స్ వారికి వుంటే వాళ్లకు కొంతయినా ఉపయోగపడతాయి.

రెండు విధాల ఆలోచనలు

ఇవన్నీ చూస్తుంటే సిఎమ్ జగన్ రెండు రకాలుగా ఆలోచిస్తున్నట్లు కనిపిపిస్తోంది. జబ్బు తగ్గాలంటే ఆపరేషన్లు అవసరమే. కానీ ఈలోగా రోగి బాధపడకుండా వుండాలంటే నొప్పి నివారణ మాత్రలు కూడా అవసరం. అదే మాదిరిగా ప్రజలకు తనపై అసంతృప్తి కలుగకుండా నగదు జల్లేసే పథకాలు అమలు చేస్తూనే, పాలనా పరమైన మార్పులు, ప్రజలకు కావాల్సిన సదుపాయాలు అందించే పని పక్కాగా పెట్టకున్నట్లు కనిపిస్తోంది. 

ఇవన్నీ పూర్తిగా జరగడానికి కొన్నాళ్లు పడుతుంది. అవన్నీ అమలు జరిగితే జనానికి జగన్ చేసింది ఏమిటో అర్థం అవుతుంది. అలా అర్థం అయిన తరువాత నగదు జల్లే పథకాలు కాస్త తగ్గించినా పెద్దగా సమస్య వుండదు. అలా అని తగ్గిస్తాడు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మప్పడం సులువు. తిప్పడం కష్టం కదా.  

చాణక్య