బిసిలు ముద్దు..కాపులు వద్దు?

బ్రాహ్మణానాం అనేకత్వం అనేది వెనకటికి పెద్దల మాట. కానీ ఆ మాటకు వస్తే, ఇప్పుడు అనేకత్వం అనేది దాదాపు అన్ని కులాలకు పాకేసింది. ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలంటే ఏకత్వం కావచ్చు. అనేకత్వం కావచ్చు అన్ని…

బ్రాహ్మణానాం అనేకత్వం అనేది వెనకటికి పెద్దల మాట. కానీ ఆ మాటకు వస్తే, ఇప్పుడు అనేకత్వం అనేది దాదాపు అన్ని కులాలకు పాకేసింది. ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలంటే ఏకత్వం కావచ్చు. అనేకత్వం కావచ్చు అన్ని కులాలకు కామన్ అయిపోయింది. 

ఎద్దు ఎండకి, ఎనుబోతు నీడకు లాగుతుంది అన్నట్లుగా రాజకీయ పార్టీల పుణ్యమా అని ప్రతి కులం ఓట్లు కూడా నిట్ట నిలువుగా చీలిపోయాయి. తక్కువ సమానం, కాస్త ఎక్కువ సమానం అనే ఈక్వేషన్ మీదే రాజకీయ పార్టీల గెలుపు ఓటములు ఆధారపడి అధికారం దిశగా సాగుతున్నాయి.

ఎప్పుడూ కులమూ కులమేనా,, కూసింత కలాపోసన వుండొద్దా అని ముత్యాల ముగ్గు కాంట్రాక్టరు మాదిరిగా ఎవరైనా అనేయడం సులువే. కానీ తెల్లవారి లేస్తే కులం పేరు ఎత్తని పార్టీ లేదు, మీడియా లేదు, సోషల్ మీడియా అంతకన్నా లేదు.

అసలు ఇప్పుడు ఎందుకిలా ఏకరవు పెట్డడం అంటే తెలుగునాట కులాల రాజకీయం రాను రాను మరింత రంజుగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో 'అధికార సొపాన మధిరోహణము చేరు త్రోవ' ఇదే అన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ఫార్ములా బాగా ప్లాన్ చేసి, అమలు చేసింది. అది చూసి ఇదంతా జగన్ తెలివితేటలు కాదు, వెనుక వుండి, బోలెడు ఫీజు తీసుకుని మరీ రాజకీయ వ్యూహాల పేరుతో కులాల వ్యూహాలు రచించి ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ గొప్పదనం అని మీడియా వయ్యారాలు పోయింది.

సరే, ఎవరి గొప్పదనం అయితేనేం బిసిల ఓట్లు ఓ పక్కకు చేరి, కాపుల ఓట్లు చీలిపోయి తెలుగుదేశం దారుణ పరాజయాన్ని చవిచూసింది అన్నది ఎన్నికల పోస్ట్ మార్టమ్ నిపుణులు తేల్చిన విషయం. కానీ చిత్రమేమిటంటే కులాల ఈక్వేషన్లు ప్లే చేసి ఎన్నికల్లో గెలవడం అన్నది ఇవ్వాళ ప్రశాంత్ కిషోర్ నో, మరొకరో కొత్తగా కనుక్కున్నది కాదు. 

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే వరకు రాజకీయాల్లో యాక్టివ్ గా వుండే కులాల నాయకులు దశాబ్దాల తరబడి ప్రజా ప్రతినిధులుగా వుంటూ, రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. ఎన్టీఆర్ ఇదే ఈక్వేషన్ లో అదే కులాల్లోని యంగ్ జనరేషన్ ను పక్కకు లాగుతూ, అప్పటి వరకు అంతగా ప్రాతినిధ్యం దొరకని వారిని ముందుకు తీసుకువచ్చి, ఇలా రెండంచెల వ్యూహం పన్ని, దానికి తన చరిష్మా జోడించి విజయపథంలో నడిచారు.

ఇక అప్పటి నుంచి ఈ కులాల ఈక్వేషన్ ముందుకు సాగుతూనే వుంది. అయితే ఆ సాగడంలో ఎవ్వరూ కొత్తదనం కోసం ప్రయత్నించలేదు. ఎన్టీఆర్ స్కీములోనే కాంగ్రెస్ అయినా, మరొకళ్లు అయినా ముందుకు వెళ్లిపోయారు. ఓట్లు చీల్చడం లేదా చీలడం అనే సింపుల్ కాన్సెప్ట్ తో వైఎస్ కాపుల ఓట్లు ఓ పక్కకు చాలా వరకు మళ్లించారు. అయినా కూడా తెలుగుదేశం తన పాత వ్యూహాలనే నమ్ముకుంది. నిజానికి 2014లోనే ఈ పాత వ్యూహం వికటించేదే. కానీ రాష్ట్ర విభజన, అనుభవం అనే రెండు అంశాలు తోడే చంద్రబాబు గట్టెక్కేసారు.

ఆ అనుభవం మత్తు జనాలకు దిగిపోయే వేళ జగన్ సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు. బరిలో జనసేన, పవన్ కళ్యాణ్ వుండడం గమనించి, పూర్తిగా బిసి లపై భరోసా పెట్టేసుకున్నారు. ఈ సీట్లు బిసిలకు ఇవ్వడమా అని ఆశ్చర్యపోయేలా కూడా కొన్ని సీట్లు ఇచ్చేసారు. దాంతో బిసిలు చిరకాలంగా వుంటున్న తెలుగుదేశం నీడ నుంచి బయటకు వచ్చేసారు. అలా ఎందుకు వచ్చేసారు? అనే ప్రశ్న వుందీ, దానికి సమాధానము వుంది.

2014 నుంచి పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు దువ్వుతున్న వైనం, కాపు కార్పొరేషన్, కాపులకు ఇబిసి రిజర్వేషన్లు మళ్లించడం చూసి, ఆ కులానికి ఇస్తున్న ప్రయారిటీ గమనించి బిసి లు ఇక తాము కొత్త షెల్టర్ వెదుక్కోవాలేమో అన్న ఆలోచనకు వచ్చారు. అదే టైమ్ లో ఆ షెల్టర్ తాను ఇస్తానంటూ జగన్ ముందుకు వచ్చారు. కాపులకు ఇబిసి రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని కుండ బద్దలు కొట్టేసాడు. దాంతో బిసి లకు భరోసా దొరికేసింది.

జనసేనతో పొత్తు

పైగా జనసేన తో తెలుగుదేశం పార్టీకి లోపాయకారీ ఒప్పందం వుంది అనే ప్రచారం కూడా దాని పని అది చేసేసింది. ఇక తప్పని సరై బిసిలు. పక్కాగా వైకాపా వైపు మొగ్గిపోయారు. పోనీ అలా అని కాపులు ఏమన్నా తెలుగుదేశం పార్టీకి గంప గుత్తగా ఓట్లు వేసేసారా అంటే అదీ లేదు. మూడు ముక్కలుగా విడిపోయారు. మెజారిటీ జనసేనకు, కొంత వరకు తేదేపాకు, మరి కొంత వరకు వైకాపాకు వచ్చేసాయి కాపుల ఓట్లు. 2019 ఎన్నికల ఫలితాలు చూసాక కానీ చంద్రబాబుకు తను నలభై ఏళ్ల అనుభవంతో చేసిన తప్పు తెలిసి రాలేదు.

అక్కరకు రాని చుట్టాన్ని చటుక్కున వదిలేయాలన్నారు వెనకటికి ఎవరో. ఆ విద్యలో ఫస్ట్ ర్యాంక్ చంద్రబాబుదే. అందుకే మళ్లీ తన అడియో ఫైల్ లోంచి పాత పాట బయటకు తీసారు. బిసిలకే పెద్ద పీట, బిసీలకే మొగ్గు అంటూ పాడడం ప్రారంభించారు. సరే, వైకాపా ఎప్పుడూ ఆ విషయంలో గడబిడ, ప్రచారం చేయకున్నా అదే బాటలో వెళ్తోంది. ఇలాంటి నేపథ్యంలో పరిస్థితి ఏమిటి?

అనైకత్యకు అద్దం?

వ్యవహారం చూస్తుంటే రెండు ప్రధాన పార్టీలు కలిసి కాపు ఓట్లను భాజపాకు వదిలేసినట్లు కనిపిస్తోంది. గెలుపు ఓటములు ప్రభావితం చేయగల ఓ బలమైన వర్గాన్ని ఇలా వదిలేయడం అన్నది సరైన ఆలోచన అనిపించుకుంటుందా? అన్నది ఫ్రశ్న. ఇప్పుడు అసలు పాయింట్ కు వద్దాం. కాపుల్లో వున్న అనైక్యతే ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలు ఇలా నిర్ణయానికి రావడానికి కారణం అని అర్థం అవుతోంది. 

ఇది అనైక్యత అనాలా? చాలా కాలంగా ముద్రగడ పద్మనాభం లాంటి వారు ఎంత ప్రయత్నిస్తున్నా, కాపునాడులో అంతర్లీనంగా వున్న వివిధ వర్గాల మధ్య సమస్వయం అన్నది నేతి బీరకాయలో నెయ్యి మాదిరిగా వుండిపోవడమే అనుకోవాలా? కాపుల్లో వున్న వర్గాల మధ్య పోటీ ఏర్పాటుచేయడం ద్వారా రాజకీయ పార్టీలో వాటిలోని అనైక్యతను సజీవంగా వుంచుతున్నాయి.

అలా లేకపోయి వుంటే పవన్ కళ్యాణ్ ఏరికోరి ఓట్ల లెక్కలు చూసి మరీ ఎంచుకున్న రెండు చోట్ల ఓడిపోవడం ఎలా సాధ్యం? చిరంజీవి వెస్ట్ గోదావరిలో ఓటమి పాలు కావడం ఎలా సాధ్యం? కాపులు-వెలమలు అనకాపల్లిలో పోటీ పడితే, ఇద్దరు వెలమ అభ్యర్ధుల, ఒక్క కాపు అభ్యర్థి వుంటే, అనకాపల్లిలో అల్లు అరవింద్ ఓడిపోయడం ఎలా సాధ్యం? ఇదంతా కాపుల్లో వున్న అనైక్యతకు అద్దం పడుతుంది.

దీనికి తప్పు ఎవరిదీ కాదు. కాపునాడులో అంతర్వాహినులు మాదరిగా వివిధ కులాలు కలిసి వున్నాయి. కానీ ఎన్నికల టైమ్ కు వచ్చేసరికి ఎవరి లెక్కలు వారు కడుతున్నారు. పైగా తూర్పు కాపు, కాపు,  మున్నూరు కాపు, బలిజ, తెలగ, శెట్టి బలిజ ఇలా విడివిడి అయిపోతున్నారు. ఒక్క రిజర్వేషన్ల విషయంలో మాత్రమే కలివిడిగా వుంటున్నారు.

బాబు పాట..జగన్ కొత్త  పాట

ఎప్పుడయితే బాబు తన అడియో ఫైల్ నుంచి పాత పాట తీసి బిసిలకే ప్రాధాన్యం, బిసిలకే పెద్ద పీట అన్న పాట పాడడం ప్రారంభించారో జగన్ తన పాటకు కొత్త ట్యూన్ కట్టేసారు. అధికారంలో వున్నన్నాళ్లు అవకాశాలు అందిపుచ్చుని, కాంట్రాక్టులు, ఇతరత్రా ఆర్థిక వ్యవహారాలు ఎక్కడ వుంటే అక్కడ వాలిపోయి నొల్లేసుకున్న వర్గాన్ని పక్కన పెట్టి, ఇప్పుడు పల్లకీ మోసే టైమ్ కాబట్టి బిసిలకు పెద్ద పీట వేసేసారు చంద్రబాబు. 

ఇక్కడి నుంచి మూడున్నరేళ్ల పాటు పీట వేసిన బిసి లు తమ జేబులో డబ్బులు ఖర్చు చేస్తూ, పార్టీని ముందుకు నడిపిస్తే, అప్పుడు అధికారం అందుకుంటే మళ్లీ తెరవెనుకన దాచేసిన అసలు వర్గం బయటకు వచ్చి కోట్లు ఆర్జించడం ప్రారంభిస్తుంది.

ఇది తెలుసు కనుకే జగన్ తన దగ్గర వున్న బిసి బలాన్ని తన దగ్గరే వుంచుకునేందుకు కొత్త ఎత్తుగడ వేసారు. బిసి ల్లో ప్రతి కులానికి ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి అధికారిక పదవులు ఇచ్చేసారు. బాబుగారు ఇచ్చినవి ఖర్చు తో కూడిన అనధికార పదవులు. అది కూడా తిప్పి తిప్పి లెక్క పెడితే మూడు డజన్లు వుండవు. కానీ జగన్ అధికారిక పదవులు నాలుగు డజన్లకు పైగా ఇచ్చేసారు. దాంతో ఏమైంది బాబు గారు నిచ్చెన ఎక్కినట్లే ఎక్కి మళ్లీ పామునోట్లో పడి కిందకు వచ్చేసారు.

దీని వెనుక వ్యూహం

బిసిలకు ఎవరికి వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వెనుక కేవలం వారిని తన దగ్గర వుంచుకునే ఆలోచన మాత్రమే వైకాపా అధినేత జగన్ లో వున్నట్లు కనిపించడం లేదు. కాపుల ఓట్లను హోల్ సేల్ గా తీసేసుకోవాలనుకుంటున్న జనసేన-భాజపా కూటమికి చెక్ చెప్పే వ్యూహం కూడా దీని వెనుక వున్నట్లు కనిపిస్తోంది. 

కాపుల్లోంచి తూర్పు కాపులను దిగ్విజయంగా ఇప్పుడు వేరు చేసినట్లు అయింది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో బలంగా,  తూర్పు కాపులను సెపరేట్ చేసినట్లు అయింది. ఈస్ట్ వెస్ట్, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో కాపుల ప్రభావం ఎక్కువ గా వుంటుంది. అలాంటి చోట్ల కూడా ఇప్పుడు ప్రతి ఒక్క బిసి కులానికి కార్పొరేషన్ ఏర్పాటుచేయడం అన్నది దాదాపుగా కాపులను ఒంటరి చేసినట్లు అవుతుంది.

అటు తేదేపా ఇటు వైకపా రెండూ బిసిలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో కాపుల్లోని తూర్పుకాపులను మెల్లగా వేరు చేసారు. గతంలో రిజర్వేషన్ మాత్రమే వున్న ఆ వర్గానికి ఇప్పుడు స్వంత కార్పొరేషన్ కూడా వచ్చింది. జనసేన-భాజపా కూటమిని కాపుల కూటమిగా ముద్రవేసే ప్రయత్నం స్మూత్ గా జరుగుతోంది. ఆ విధంగా రాష్ట్రంలోని ఓట్ల సమీకరణలు మొత్తం చెదిరిపోయే అవకాశం కనిపిస్తోంది. 

కాపుల ఓట్లు ఇటు వైకాపా లేదా అటు తెదేపాతో వుంటే నిర్ణయాత్మక శక్తి అవుతుంది కానీ కేవలం వారు మాత్రమే ఓ పక్క వుండడం ద్వారా అది సాధ్యం కాదు. ప్రజారాజ్యం, జనసేన ఫెయిల్యూర్లు రుజువు చేసింది ఇదే.

ఇదే..ఇలాగే..

ఇదే ఇలాగే కొనసాగేలా వైకాపా, తేదేపా పావులు కదుపుతున్నాయి. 2024 ఎన్నికల్లో జనసేనను విజయతీరానికి దూరంగా వుంచితే ఇక మరి అలాంటి ప్రయత్నం మరోసారి జరిగే అవకాశం తక్కువ వుంటుంది. ఇది సాధ్యం కాదనే భావన కింద వరకు వెళ్లిపోతుంది. అప్పుడు నాయకులను బట్టి ఎటు సెటిల్ కావాల్సిన ఓట్లు అటు సెటిల్ అయిపోతాయి. 

అంటే బిసిలకు ప్రాధాన్యత ఇస్తున్నాం అంటూ తేదేపా, బిసిల్లోని అతి తక్కువ ఓట్ బ్యాంక్ నుంచి ఎక్కువ ఓట్ బ్యాంకు వున్నఅన్ని వర్గాలకు కార్పొరేషన్లు ఇచ్చి వైకాపా ఎవరి గేమ్ వారు ఆడుతున్నారు. అదే టైమ్ లో కాపులను వదిలేసిన ఫీలింగ్ తీసుకువస్తున్నారు.

అలాంటి ఫీలింగ్ తో కాపులు జనసేనతోనూ, ఆదే విధంగా భాజపాతోనూ వెళ్లకతప్పదు. కానీ అదే సమయంలొ కాపుల్లో మళ్లీ వివిధ సమీకరణలు వాటి పని అవి చేస్తాయి. ఇలాంటి టైమ్ లో కాపుల్లోని వివిధ వర్గాలకు వేరు వేరుగా కార్పొరేషన్ పెట్టే ఆలోచనలు కూడా వున్నాయి అని వినిపిస్తోంది. ప్రస్తుతం అయితే కాపు కార్పొరేషన్ ఒక్కటే వుంది. బిసి కార్పొరేషన్ ను 50 విధాలుగా రూపొందించినట్లు, కాపు కార్పొరేషన్ ను కూడా పదో, ఇరవైనో రకాలుగా విభజిస్తే పరిస్థితి ఏమిటన్నది అప్పుడు చూడాల్సి వుంటుంది.

తప్పుకున్న ముద్రగడ

బహుశా ఇవన్నీ లెక్కలు వేసి, భవిష్యత్ దర్శనం చేసే, ముద్రగడ పద్మనాభం లాంటి మొండి మనిషి, గట్టి మనిషి కూడా ఇక తన వల్ల కాదు అని చెప్పకుండా, నాయకత్వం నుంచి పక్కకు తప్పుకున్నట్లు కనిపిస్తోంది. పైగా గతంలో వున్న మాస్క్ ను కాస్త పక్కకు తీసి, పవన్ కళ్యాణ్ కాపుల వైపు ఒరుకుతున్నారు. సోము వీర్రాజు సంగతి చెప్పనక్కరలేదు. ఇలాంటి ఉద్దండులు కాపులకు నాయకత్వం వహిస్తుంటే ఇక తానెందుకు అనుకున్నారేమో ముద్రగడ. మొత్తానికి తప్పుకున్నారు.

ఇలాంటి పరిణామాలు అన్నీ కాపుల్లో మరింత ఐక్యతకు దారి తీస్తాయో, మరింత అనైకత్వకు దారి తీస్తాయో అన్నది ఇప్పుడే జవాబు దొరికే ప్రశ్న కాదు. 2024 ఎన్నికలు కాపుల ఐకత్య-అనైక్యతలకు భవిష్యత్ దర్శనం చేయిస్తాయి.

చాణక్య