‘ద‌బాంగ్’ ను రెండు కోట్ల‌తో తీసేద్దామ‌నుకున్నార‌ట‌!

బాలీవుడ్ లో ద‌బాంగ్ సినిమా సీరిస్ రేపుతున్న సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. అభిన‌వ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వంలో దాదాపు ప‌దేళ్ల కింద‌ట ద‌బాంగ్ సినిమా వ‌చ్చింది. దాదాపు అప్ప‌ట్లో బాలీవుడ్ ను ఒక ఊపు…

బాలీవుడ్ లో ద‌బాంగ్ సినిమా సీరిస్ రేపుతున్న సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. అభిన‌వ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వంలో దాదాపు ప‌దేళ్ల కింద‌ట ద‌బాంగ్ సినిమా వ‌చ్చింది. దాదాపు అప్ప‌ట్లో బాలీవుడ్ ను ఒక ఊపు ఊపింది ఆ సినిమా. చుల్ బుల్ పాండేగా స‌ల్మాన్ న‌ట‌న‌, ఆ డ్యాన్సులు.. సంచ‌ల‌నం రేపాయి. అప్ప‌టి వ‌ర‌కూ బాలీవుడ్ వ‌సూళ్ల రికార్డుల‌ను షేక్ చేసింది ద‌బాంగ్ సినిమా.

ఈ సినిమా మ్యాజిక్ కేవ‌లం ఉత్త‌రాదికే ప‌రిమితం కాలేదు. ఆ త‌ర్వాత దాన్ని ద‌క్షిణాది భాష‌ల్లో కూడా రీమేక్ చేశారు. తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్, త‌మిళంలో శింబులు ఆ సినిమాను రీమేక్ చేయ‌గా… అవి కూడా సూప‌ర్ హిట్స్ అయ్యాయి. వాటితో పాటు.. హిందీ ద‌బాంగ్ కూడా సౌత్ లో ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శితం అయ్యింది.

ఆ త‌ర్వాత దానికి సీక్వెల్ వ‌చ్చింది. అది సౌత్ లో అంత పేరు తెచ్చుకోక‌పోయినా.. హిందీ వ‌ర‌కూ బాగానే ఆడింది. ఇప్పుడు ద‌బాంగ్ పార్ట్ త్రీ రూపొంది, విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఈ నేప‌థ్యంలో ద‌బాంగ్ గురించి  స‌ల్మాన్ ఖాన్ ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన విష‌యాన్ని చెప్పాడు.

అదేమిటంటే.. వాస్త‌వానికి దబాంగ్ ఫ‌స్ట్ పార్ట్ ను కేవ‌లం రెండు కోట్ల రూపాయ‌ల‌తో తీసేద్దామ‌ని ద‌ర్శ‌కుడు అభిన‌వ్ క‌శ్యాప్ ప్ర‌తిపాదించాడ‌ట‌. దాన్నొక  డార్క్ సినిమాగా తీయాల‌నేది ఆ ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌ట‌. ఫైట్లే త‌ప్ప‌, పాట‌లూ గ‌ట్రా ఉండ‌వు. హీరో క్యారెక్టర్ చుల్ బుల్ పాండే పూర్తిగా నెగిటివ్ గా ఉంటుంద‌ట మొద‌ట రాసుకున్న దాని ప్ర‌కారం. అయితే ఆ సినిమా నిర్మాత అయిన త‌న త‌మ్ముడు మార్పులు చేద్దామ‌న్నాడ‌ని దానికి అభిన‌వ్ కూడా ఓకే చెప్ప‌డంతో ఆ తర్వాత ద‌బాంగ్ క‌థ‌,క‌థ‌నాలు మారాయ‌ని స‌ల్మాన్ తాజాగా వివ‌రించాడు. రెండు కోట్ల రూపాయ‌ల బడ్జెట్ తో హీరో క్యారెక్ట‌ర్ నెగిటివ్ ఇదొక డార్క్ సినిమాగా రూపొంది ఉంటే ప‌రిస్థితి ఎలా ఉండేదో!