ప్రజల డిమాండ్‌ మరణశిక్షే…న్యాయ వ్యవస్థలో మార్పొస్తుందా?

హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌ తరువాత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సత్వర న్యాయం కోరుకోవడం సరైంది కాదన్నారు. దిశ ఎన్‌కౌంటర్‌ విషయాన్ని ఆయన ప్రస్తావించకుండా నిందితులను ఎన్‌కౌంటర్‌ పేరుతో…

హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌ తరువాత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సత్వర న్యాయం కోరుకోవడం సరైంది కాదన్నారు. దిశ ఎన్‌కౌంటర్‌ విషయాన్ని ఆయన ప్రస్తావించకుండా నిందితులను ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపడం నేరమని చెప్పారు.

మన న్యాయవ్యవస్థలో విచారణ ఏళ్ల తరబడి సాగుతుందని, ఆ తరువాత శిక్ష అమలు చేయడానికి కూడా చాలా సమయం తీసుకుంటారని తెలిసిందే. ఇందుకు అనేక కేసులు నిదర్శనంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ నిర్భయ కేసు ఇందుకు కళ్ల ఎదుట కనబడుతున్న నిదర్శనం. అందుకే దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినప్పుడు దేశంలో అత్యధికమంది ఆనందం వ్యక్తం చేశారు. 

చట్టాలు చేసే పార్లమెంటు సభ్యులు, వివిధ రంగాల ప్రముఖులే కాకుండా, కొందరు ముఖ్యమంత్రులు సైతం ఎన్‌కౌంటర్‌ను సమర్థించారు. ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయంతో ఏకీభవించడానికి ఎక్కువమంది ఇష్టపడటంలేదు.

ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకించేవారు కూడా కోర్టుల్లో బాధితులకు సత్వర న్యాయం జరగడంలేదని అన్నారు. అత్యాచారం, హత్య జరిగినప్పుడు స్పందించని జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఎన్‌కౌంటర్‌ తరువాత ఎందుకు స్పందించిందనే ప్రశ్నకు సరైన జవాబు లేదు.

ఈ నేపథ్యంలో ఏబీపీ న్యూస్‌-సీ ఓటర్‌ కలిసి అత్యాచారం కేసుల్లో దోషులకు మరణశిక్ష విధించాలా? వద్దా? అనేదానిపై సర్వే చేశాయి. ఈ ప్రశ్నకు 68 శాతం మంది మహిళలు 'ఉరిశిక్ష విధించాలి' అని చెప్పారు. మహిళల అభిప్రాయంతో 70 శాతం పురుషులు ఏకీభవించారు. 

దీన్నిబట్టి మనకు తెలిసేది ఏమిటి? దేశంలో అత్యధికమంది అత్యాచారం కేసుల్లో మరణశిక్షను కోరుకుంటున్నారు. దిశ ఎన్‌కౌంటర్‌ కేసులోనూ అలాగే కోరుకున్నారు. కాకపోతే నలుగురు నిందితుల కుటుంబాలు పేదరికంలో ఉండటంతో అవి దిక్కులేనివయ్యాయి.

నిందితులు చేసిన నేరం ఆ కుటుంబాలకు శాపంగా మారింది. ప్రభుత్వానికి మానవత్వం ఉంటే ఆ కుటుంబాలను ఏదోవిధంగా ఆదుకోవచ్చు. ఇక అత్యధికమంది దోషులకు మరణశిక్ష పడాలని కోరుకుంటున్నారు కాబట్టి వారి కోరికను న్యాయ వ్యవస్థ మన్నిస్తుందా? అంటే అది జరుగుతుందని అనుకోలేం.

కోర్టులకు సాక్ష్యధారాలే ముఖ్యం. 'నేనే నేరం చేశాను' అని నేరం చేసినవాడు చెప్పినా చెల్లదు. అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉండాల్సిందే. కొన్ని కేసుల్లో నేరం జరిగినట్లు తెలుస్తూనే ఉన్నా తగిన సాక్ష్యాధారాలు లేవనే కారణంతో దోషులు నిర్దోషులుగా బయటపడిన సందర్భాలున్నాయి. 

మన న్యాయవ్యవస్థలో సెషన్స్‌ కోర్టులు. జిల్లా కోర్టులు, హైకోర్టు, సుప్రీం కోర్టు…ఇలా అనేక కోర్టులు ఉండటం, కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అప్పీలు చేసుకునే అవకాశం ఉండటంతో కేసులు పరిష్కారం కాకుండా తీవ్ర జాప్యం జరుగుతోంది.

ఇక మన న్యాయవ్యవస్థలో దోషులు క్షమాభిక్ష కోరుకునే హక్కు, సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చాక కూడా రివ్యూ పిటిషన్‌ వేసే హక్కు ఉన్నాయి. దీంతో ఇవి తేలేంతవరకు శిక్షలు పడవు. చట్టాలు కఠినంగా ఉండొచ్చు. కాని న్యాయప్రక్రియలో ఉన్న కొన్ని లోపాలు లేదా అడ్డంకుల కారణంగా సత్వర న్యాయం జరగడంలేదు. 

కేసుల సా…గదీతలో న్యాయవాదుల పాత్ర కూడా ఉంటుందనుకోండి. అరబ్‌ దేశాల వంటి కొన్ని దేశాల్లో ఫలాన నేరం చేస్తే ఫలాన శిక్ష అని ఫిక్స్‌డ్‌గా శిక్షలున్నాయి. అంటే ఒకడు నేరం చేసి రుజువైతే అతడికి ఏం శిక్ష పడుతుందో జనాలకు తెలిసిపోతుంది. 

మన దేశంలో ఈ అవకాశం లేదు. ఒకే రకమైన నేరాలకు పలు విధాలైన శిక్షలు పడతాయి. ఒక్కోసారి పడకపోవచ్చు కూడా. ఇక కింది కోర్టు మరణశిక్ష విధిస్తే పై కోర్టు యావజ్జీవ శిక్షగానో, మరోరకంగానో మార్చవచ్చు. ఉదాహరణకు వరంగల్‌లో 9 నెలల పాపపై అత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తికి జిల్లా కోర్టు మరణశిక్ష విధిస్తే, హైకోర్టు దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది.

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఈ విషయాన్ని చాలామంది ప్రస్తావించారు. హైదరాబాద్‌ సమీపంలోని హాజీపూర్‌లో శ్రీనివాసరెడ్డి అనే దుర్మార్గుడు ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి చంపేశాడు. 

అతన్ని ఉరితీయాలని ఇప్పుడు తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. ఇలాంటివి ఇంకా చాలా కేసులున్నాయి. ఈ ముష్కరులకు శిక్షలు ఎప్పుడు పడతాయి? ఎవరూ చెప్పలేరు. నేరం చేసినవారికి కోర్టు ద్వారా తగిన శిక్షలు పడటంలేదు కాబట్టే వారిని కోర్టులతో, విచారణతో నిమిత్తం లేకుండా చంపేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. సత్వర న్యాయం కోరుకోవడం మంచిది కాదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పడం కాలం చెల్లిన మాటగా జనం భావిస్తున్నారు.