ఉత్తరాంధ్ర అరటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎన్టీఆర్ పార్టీ పెట్టినది లగాయితూ పసుపు జెండాను తమ గుండెల్లో పెట్టేసుకున్న ప్రాంతం. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా కూడా ఈ మూడు జిల్లాలకూ టీడీపీ వైపేనన్నది జగమెరిగిన సత్యం.
2004లో వైఎస్సార్ ప్రభంజనం వీచినపుడు కూడా సగం దాకా సీట్లు ఈ ప్రాంతంలో టీడీపీ గెలుచుకుంది. అటువంటి కంచుకోటను బద్దలు కొట్టి టీడీపీని మూలన విసిరేసిన మొనగాడుగా జగన్‌ను చెప్పుకోవాలి.
34 ఎమ్మెల్యే సీట్లు ఉంటే అందులో ఆరంటే అరు సీట్లు మాత్రమే టీడీపీ సొంతం అయ్యాయి., విజయనగరం జిల్లా అయితే పూర్తిగా వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. టీడీపీకి ఒక్క సీటూ రాకుండా చేసేసింది. ఈ నేపధ్యంలో ఫలితాల తరువాత పదిహేను నెలలు గడిచాయి. స్వతహాగా బలమున్న చోట టీడీపీ తిరిగి పుంజుకోవాలి. కానీ విజయనగరం జిల్లాలో ఇంకా దారుణంగా దిగనారిపోతోంది.
రాజులంతా అంతపురాల్లో ఉంటూ పార్టీని గాలికివదిలేశారు. బీసీ వర్గాలన్నీ వైసీపీకి జై కొడుతున్నాయి. శ్రీకాకుళంలో టీడీపీకి జెయింట్ లీడర్ అని చెప్పుకుంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఈ మధ్యకాలమంతా చుక్కలు కనిపించాయి. రెండవ ఎమ్మెల్యే ఇచ్చాపురంకు చెందిన బెందాళం అశోక్ అయితే విశాఖేక మకాం మార్చేశారు. అంతెందుకు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష కూడా విశాఖ నుంచే శ్రీకాకుళం జిల్లా పార్టీని పర్యవేక్షిస్తున్నారు. పెద్ద నోర్లు అన్నీ మూతపడిపోగా వైసీపీకి ఏకపక్షంగా జిల్లా రాజకీయం మారుతోంది.
ఇక, విశాఖ విషయానికి వస్తే ఇప్పటికే పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి జారిపోయి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు కూడా అధికార పార్టీ వైపుగానే చూస్తున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీ అందుకున్న అమరావతి రాగం కూడా ఉత్తరాంధ్ర జిలాలలో అపశృతులు పలికిస్తోంది. ఈ మాటను ఏకంగా టీడీపీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు గట్టిగానే చెప్పేశారు. తాము విశాఖకు రాజధాని వస్తూంటే అడ్డుకుని టీడీపీని కాపాడలేమని ఆయన కుండబద్దలు కొట్టారు. మిగిలిన నేతలు కూడా అదే అంటున్నారు.
విశాఖను ఆర్ధిక రాజధాని, సినీ రాజధాని అంటూ కబుర్లు చెప్పడమే కానీ బాబు ఏలుబడిలో విశాఖకు ఒరిగింది ఏదీ లేదన్నది తమ్ముళ్ల గట్టి భావన. దాంతో, వారంతా వైసీపీ వైపుగానే చూస్తున్నారు. నిజానికి జగన్ తలుపులు తీయడమే ఆలస్యం ఎంతమంది నేతలు టీడీపీలో మిగులుతారో కూడా అర్ధం కాని పరిస్థితి. ఈ నేపధ్యంలో అధికార పార్టీ గట్టిగానే టీడీపీని టార్గెట్ చేస్తోంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను తీసుకోవడానికి తొలి ప్రాధాన్యత ఇస్తోంది.
ఇక, మూడు జిల్లాలలో టీడీపీకి ఇపుడు అచ్చంగా ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో చివరికి మిగిలేది ఎందరో అన్న నిర్వేదం కూడా టీడీపీ అధినాయకత్వానికి పట్టుకుందిట. అమరావతి రాజధాని అంటూ విశాఖలో ఆందోళన చేయమనడం అంటే ఉన్న చోట రాజకీయాన్ని నిలువునా పాతేసి పరాజయాన్ని అంగీకరించడమేనని అంటున్నారు.
ఇక ఉత్తరాంధ్రలో పార్టీకి గత వైభవం తీసుకువచ్చేందుకు కూడా ఏ నాయకుడూ గట్టిగా ప్రయత్నించేందుకు సాహసించడంలేదు. దానికి కారణం బాబు అనుసరిస్తున్న విధానాలు, ప్రాంతీయంగా కూడా చిచ్చు పెడుతున్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే ఒక్కో నాయకుడి మీద ఒక్కోరకమైన కేసులు కూడా ఉన్నాయి.
అచ్చెన్నాయుడు తన జీవితకాలంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా మూడు నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉండడంతో ఎవరూ అధికార పార్టీకి వ్యతిరేకంగా నోరు చేసుకోవడానికి కూడా ముందుకు రాని స్థితి ఉంది. నాయకులు గట్టిగా పోరాడినా అధినాయకత్వం నుంచి సహకారం పెద్దగా ఏమీ ఉండదని అచ్చెన్నాయుడు వంటి బలమైన బీసీ నేత విషయంలో రుజువు కావడంతో మిగిలిన నేతలు గమ్మున ఉన్నారని అంటున్నారు.
ఇక ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం కళ్ల ముందు కనిపిస్తున్నా మొండి వాదనతో, స్వార్ధ ప్రయోజనాలతో అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ చంద్రబాబు పట్టుపడుతున్న తీరు ఈ ప్రాంతంలో టీడీపీ ఊసురు తీసేస్తోందని అంటున్నారు. యాంటీ విశాఖ విధానాన్ని టీడీపీ అనుసరిస్తోందని ఆ పార్టీ నేతలే మధనపడుతున్నారు. పైగా విశాఖ నగరం మీద లేనిపోని విషపు రాతలతో చేస్తున్న కుత్సిత రాజకీయంకూడా ఇటు సాదర జనాలేక కాదు, పార్టీ జనాలకూ వెగటు పుట్టిస్తోంది.
దీనిని పూర్తిగా అర్ధం చేసుకున్న తమ్ముళ్లు అధినాయకత్వానికి ఉత్తరాంధ్ర మీద ఉన్న్దది సవతి ప్రేమ మాత్రమేనని గట్టిగా నమ్ముతున్నారు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే గత ఏడాది ఓటమి తరువాత ఏ మాత్రమైనా పుంజుకుందామని టీడీపీ అనుకున్నా కూడా విశాఖ పాలనా రాజధానిని వైసీపీ సర్కార్ ముందుకు తేవడంతో టీడీపీ నడ్డి విరిగినట్లయిందని చెబుతున్నారు.
ఇపుడు చంద్రబాబు కూడా తమ్ముళ్లను నమ్మడంలేదు, వారి పోకడలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని హైకమాండ్ సందేహిస్తోందని అంటున్నారు. అంటే జై అమరావతి అనకపోతే వైసీపీ వైపు ఉన్నట్లుగానే భావిస్తారా అంటూ తమ్ముళ్లు కస్సుమంటున్నారు. మరో వైపు తనతో కలసిరావడంలేదని, అమరావతికి మద్దతుగా విశాఖ వీధులలో నినదించడంలేదన్న ఆవేశం చంద్రబాబుది. ఇలా పరస్పర సందేహాలతో టీడీపీ ఉత్తరాంధ్రలో పూర్తి అయోమయ పరిస్థితులలో పడిపోయింది.
చంద్రబాబు ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటుందని, తనదైన కొత్త రాజకీయంతో అటు జనాలను, ఇటు పార్టీ తమ్ముళ్లను దారికి తేవచ్చునని అనుకుంటున్నారు కానీ, పరిస్థితి చేయి దాటుతోందన్న సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమరావతి రాజధాని పోరాటం ఎంతగా జరిగినా పెరిగినా అది ఉత్తరాంధ్ర కంచుకోటను టీడీపీకి మరింతగా దూరం చేస్తుందన్నది నిజం అంటున్నారు.