జై భీమ్ పై ఆ కుల‌సంఘం ఐదు కోట్ల‌కు దావా!

త‌మిళ సినిమాలు కులం గురించి ఎంత ధైర్యంగా చ‌ర్చించ‌గ‌లుగుతున్నాయో, మ‌రోవైపు అదే త‌మిళ‌నాట వివిధ సినిమాల‌పై కుల సంఘాల ర‌చ్చ కూడా గ‌ట్టిగా ఉంటుంది. అవ‌త‌లి రాష్ట్రాల్లో కూడా ఆక‌ట్టుకునే త‌మిళ సినిమాలు త‌మిళ‌నాట…

త‌మిళ సినిమాలు కులం గురించి ఎంత ధైర్యంగా చ‌ర్చించ‌గ‌లుగుతున్నాయో, మ‌రోవైపు అదే త‌మిళ‌నాట వివిధ సినిమాల‌పై కుల సంఘాల ర‌చ్చ కూడా గ‌ట్టిగా ఉంటుంది. అవ‌త‌లి రాష్ట్రాల్లో కూడా ఆక‌ట్టుకునే త‌మిళ సినిమాలు త‌మిళ‌నాట కొన్ని కుల సంఘాల‌కు అభ్యంత‌క‌రం అవుతుంటాయి. ఆ మ‌ధ్య మండేలా సినిమాపై ఒక కుల సంఘం అభ్యంత‌రాల‌ను చెప్పింది.

త‌మ కులాన్ని అవ‌మానించేలా ఆ సినిమా ఉంద‌ని  కొంత‌మంది కోర్టుకు వెళ్లారు. అయితే కుల వివ‌క్ష గురించి తెర‌పై చ‌ర్చించే ధైర్యం చేసిన ఆ సినిమా కు కోర్టు ఎలాంటి బ్రేకులూ వేయ‌లేదు.

ఆ సంగ‌త‌లా ఉంటే.. జైభీమ్ సినిమాపై మ‌రో కులం కోర్టును ఆశ్ర‌యించింది. ఈ సినిమాలో త‌మ కులాన్ని అవ‌మానించార‌ని, అందుకు ఐదు కోట్లు చెల్లించాల‌ని ఈ సినిమా నిర్మాణ సంస్థ‌పై దావా వేశారు. ఈ సారి అభ్యంత‌రం చెప్పింది వ‌న్నియార్లు. ఈ కులాన్ని ఓన్ చేసుకునే, ఈ కులం ఓట్లు ఉన్న ప్రాంతంలో గ‌ట్టిగా ప‌ని చేసే పీఎంకే పార్టీ ఇప్పుడు జై భీమ్ పై మండి ప‌డుతోంది.

ఈ సినిమాలో చెంచుల‌ను జైల్లో వేసి చిత్ర‌హింస‌లు పెట్టే పోలీసాఫీస‌ర్ పాత్ర‌ను త‌మ కులం వాడ‌న్న‌ట్టుగా చూపార‌నేది వ‌న్నియార్ల అభ్యంత‌రం. అయితే ఎక్క‌డా అలాంటి సంబోధ‌న ఉండ‌దు. అయితే.. అత‌డి వెనుక ఒక క్యాలెండ‌ర్ ఉంటుంద‌ట‌, ఆ క్యాలెండ‌ర్ మీద వ‌న్నియార్ల‌కు సంకేతం అయిన ఒక చిహ్న‌మేదో ఉంటుంద‌ట‌! 

ఆ పాత్ర‌కు వ‌న్నియార్ల పేరు ఏమీ పెట్ట‌లేదు. సినిమాలో ర‌కర‌కాల సంద‌ర్భాల్లో కుల ప్ర‌స్తావ‌న వ‌చ్చినా.. పోలీసాఫీస‌ర్ల కులం గురించి మాత్రం ప్ర‌స్తావించ‌లేదు. వారి అస‌లు పేర్ల‌ను కూడా ప్ర‌స్తావించ‌లేదు. బాధితుల కులం గురించి మాత్ర‌మే చ‌ర్చించారు. అయితే.. ఆ పోలీసాఫీస‌ర్ పాత్ర క‌నిపించే సీన్లో వెనుక‌వైపు ఉండే క్యాలెండ‌ర్ మీద త‌మ కులాన్ని సూచించే చిహ్నం ఉందంటూ.. అది త‌మ కుల ప్ర‌తిష్ట‌కు భంగ‌మంటూ, ఐదు కోట్లు చెల్లిస్తే పోయిన ప‌రువుకు చెల్లు అవుతుంద‌నే పిటిష‌న్ ప‌ట్ల కోర్టు ఎలా స్పందిస్తుందో!