ఉత్తరాంధ్ర జిల్లాలు ఇపుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయంగా రేపటి రోజున ఇక్కడ నుంచే మొత్తం కధ సాగనుంది. పరిపాలనా రాజధానిగా విశాఖను వైసీపీ సర్కార్ ఎంపిక చేసిన క్రమంలో రానున్న రోజులలో ఎటూ అది వైసీపీకి అనుకూలంగా ఉంటుంది. దాంతో పాటు తాము కూడా బలపడేందుకు వీలైన మార్గాలను బీజేపీ అన్వేషిస్తోంది.
ఈ మద్యన ఉత్తరాంధ్ర జిల్లాలలో బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటించారు. ఆయన పార్టీ బలోపేతంపైనే స్ధానిక నేతలతో చర్చలు జరిపారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వరకూ పర్యటించిన ఆయన మీడియా సమావేశం నిర్వహించి మరీ చంద్రబాబునే లక్ష్యంగా చేసుకున్నారు.
విశాఖకు కేంద్రం ఎన్నో పధకాలు కేటాయిస్తే వాటిని అమరావతికి చంద్రబాబు తరలించుకుపోయారని కూడా నిందించారు. రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా వీర్రాజు చూపు అంతా మిగిలిన పార్టీలో ఉన్న నేతల మీదనే ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును బీజేపీలోకి తీసుకురావాలని సోము వీర్రాజు గట్టిగానే కృషి చేస్తున్నారని అంటున్నారు.
గతంలో వీర్రాజు కేవలం బీజేపీ నాయకునిగా విశాఖ పర్యటన చేసినపుడు ఏకంగా గంటా ఇంటికి వెళ్లి ఆయనతో ఏకాంత చర్చలు జరిపారు. ఆనాడే గంటాను బీజేపీలోకి వీర్రాజు ఆహ్వానించారని కూడా ప్రచారం జరిగింది. ఇక, తాజా పర్యటనలో ఆయన నేరుగా గంటాను కలుసుకోకపోయినా బీజేపీలోకి ఆయన వచ్చేలా తనదైన శైలిలో పావులు కదిపారని అంటున్నారు.
విశాఖ నగరంలో బీజేపీకి రాజకీయంగా పట్టు ఉంది. 190 నుంచి బీజేపీ ఇక్కడ పునాదిని ఏర్పాటుచేసుకుంది. విశాఖ తొలి కార్పోరేషన్ పీఠాన్ని బీజేపీ నాడు గెలుచుకుంది. అంతే కాదు, జనసంఘ్ మీద విశాఖ నుంచి ఎమ్మెల్యే కూడా నాడు గెలిచారు. ఎమ్మెల్సీగా సీనియర్ నేత పీవీ చలపతిరావు రెండు మార్లు గెలిచారు. హరిబాబు ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచారు.
మరో వైపు ఉత్తర నియోజకవర్గంలో కూడా బీజేపీ కొంత ఉనికిని చాటుకుంటోంది. నగర కార్పొరేషన్లో కనీసంగా మూడు నుంచి నాలుగు సీట్లు బీజేపీకి సొంతంగా వచ్చేంత బలం కూడా ఉంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా పీవీఎన్ మాధవ్ ఉన్నారు. దీనికి తోడు జనసేనతో పొత్తు కూడా ఉంది. పైగా విశాఖలోని సగం నియోజకవర్గాలలో కాపుల సంఖ్య గణనీయంగా ఉంది. దాంతో, బలమైన నేతలను పార్టీలోకి తీసుకువస్తే రాజకీయంగా సామాజికవర్గపరంగా బాగా ఉపయోగం ఉంటుందని సోము వీర్రాజు ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన గంటా శ్రీనివాసరావు మీద కన్ను వేశారని అంటున్నారు.
గంటా కనుక బీజేపీలోకి వస్తే క్షేత్ర స్ధాయిలో గట్టిగా బీజేపీ పట్టు సాధిస్తుందని కూడా ఆలోచిస్తున్నారు. విశాఖ జిల్లాలో గంటా నాలుగు చోట్ల పోటీ చేసి గెలిచారు. చోడవరం, అనకాపల్లి, భీమిలీ, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గంటాకు సొంత క్యాడర్ ఉంది. అదే విధంగా అనేక నియోజకవర్గాలలో ఆయన అనుచరులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరందరినీ పార్టీలోకి తీసుకువస్తే ఒక్కసారిగా పార్టీకి జవసత్వాలు వస్తాయని ఊహిస్తున్నారు.
మరో వైపు గంటా వైసీపీలోకి వెళ్లకుండా బీజేపీ నేతలతో పాటు, మరికొందరు కూడా ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇక, గంటా వైసీపీలోకి రావాలనుకున్నా అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. భూకబ్జాల విషయంలో గంటా అనుచరుల మీద ఉన్న ఆరోపణలు మైనస్‌గా మారుతున్నాయి. వైసీపీలో మంత్రి అవంతి శ్రీనివాసరావు గంటా రాకను వ్యతిరేకిస్తున్నారు.
ఏకంగా వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి విజయసాయిరెడ్డి సైతం విముఖంగా ఉన్నారు. ఈ పరిణామాలతో గంటా సొంత మేనల్లుడు భూకబ్జాల వివాదంలో చిక్కుకోవడంతో గంటాకు రెడ్ సిగ్నల్ పడిందని అంటారు. ఈ నేపధ్యంలో గంటాను బీజేపీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కనుక ఫలిస్తే అది కమలం పార్టీ సాధించిన అతి పెద్ద విజయం అవుతుందని అంటున్నారు.
మరో వైపు చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఉన్న మాజీ మంత్రి సుజయకృష్ణరంగారావు సైతం గంటాకు సన్నిహితుడైన నేత. ఆయన కూడా బీజేపీలోకి వచ్చేలా పావులు కదుపుతున్నారు. ఆయన వైసీపీలోకి రావాలనుకున్నా అక్కడ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఉండడంతో కుదిరే పని కాదని అంటున్నారు. ఇక, మాజీ మంత్రికి బంధువు అయిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బీజేపీలో చాన్నాళ్ల క్రితమే చేరిపోయారు. ఈ పరిణామాలతో బొబ్బిలి రాజులు బీజేపీ వైపు వస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.
అదే విధంగా ఇదే జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత వంటి వారు కూడా గంటా ఎటువైపు వెళ్తే అటేనని అంటున్నారు.
అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా మాజీ ఎమ్మెల్యేలను బీజేపీ వైపుగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ముందు బిగ్ షాట్‌గా ఉన్న గంటా శ్రీనివాసరావును కనుక పార్టీలోకి తెస్తే ఆయనే దగ్గరుండి మిగిలిన మాజీలను తెస్తారన్న ఎత్తుగడతో బీజేపీ అధినాయకత్వం ఉంది.
ఇక విశాఖను పాలనారాజధానిగా చేస్తే వైసీపీలోకి రావాలని చాలామంది టీడీపీ నాయకులు అనుకుంటున్నారు. అటువంటి వారి మీద కూడా ఇపుడు బీజేపీ కన్ను పడింది అని చెబుతున్నారు. వైసీపీకి వెళ్లకుండా కళ్లెం వేయడంతో పాటు, తమ పార్టీలోకి చేర్చుకుంటూ రాజకీయంగా పాలనా రాజధానిలో పట్టు చిక్కుతుందన్నది సోము వీర్రాజు ఆలోచనగా కనిపిస్తోంది.
అదే విధంగా టీడీపీలో ఉంటూ ఏళ్లకు ఏళ్లు పనిచేసినా ఏ పదవులూ దక్కని వారిని కూడా బీజేపీ వైపుగా ఆకట్టుకునే కార్యక్రమాలు కూడా మొదలైపోయాయని అంటున్నారు.
పాలనా రాజధాని వస్తే వైసీపీకి ఎదురు ఉండదన్న అభిప్రాయం ఉంది. అపుడు సరైన విపక్షంగా ఉండాలన్నా మందీ మార్బలం ఎంతో కొంత ఉండాలన్నది బీజేపీ ముందు చూపుగా కనిపిస్తోంది. దాంతోనే ఈ ఆపరేషన్‌ను మొదలుపెట్టిందని చెబుతున్నారు.