ఐపీఎల్.. క్రికెటర్ల పాలిట కల్పతరువు. పదేళ్ల పాటు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడినా వచ్చే మ్యాచ్ ఫీజులతో పోలిస్తే.. ఒక్క ఏడాది పాటు ఐపీఎల్ ఆడితే అందుకు సమానమైన డబ్బును సంపాదించుకుంటున్నారు కొంతమంది స్టార్ క్రికెటర్లు. వారిలో భారత క్రికెటర్లే ముందు వరసలో ఉన్నారు. అంతంతమాత్రంగా రాణించినా.. వచ్చి పడే కోట్ల రూపాయలకు కొదవలేదు! జాతీయ జట్టులో స్థానం దక్కకపోయినా.. ఐపీఎల్ ఆదాయానికి ఢోకా లేదు. ఇలా భారత క్రికెటర్లు భారీ స్థాయి సంపన్నులు అయ్యారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో. అలా ఇప్పటి వరకూ భారీగా సంపాదించుకున్న క్రికెటర్లలో ఒకరు సురేష్ రైనా.
జాతీయ జట్టు నుంచి రైనాకు ఉద్వాసన పలికి కొన్నేళ్లు అయ్యాయి. ఈ మధ్యనే రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో రైనా సంపాదన ఎంతో తెలుసా? 11 కోట్ల రూపాయలు! నెలన్నర పాటు రొటీన్ గా క్రికెట్ ఆడినా ఆ డబ్బు అతడి ఖాతాలోకి జమ అవుతుంది.
అయితే అనూహ్యంగా రైనా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడటానికి యూఏఈ వెళ్లి కూడా రిటర్న్ అయ్యాడు. దీనికంతా కారణం..రూమ్ కోసం గొడవ! అనే వార్తలు వస్తూ ఉండటం గమనార్హం.
కరోనా భయంతోనో, మరో కారణాలతోనో రైనా ఐపీఎల్ నుంచి తప్పుకోలేదని.. ధోనీ తరహాలో తనకూ ట్రీట్ మెంట్ దక్కాలనే డిమాండ్ చేసి, ఆ విషయంలో తన అహం దెబ్బతినడంతోనే ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. దీనికి సీఎస్కే యజమాని శ్రీనివాసన్ వ్యాఖ్యలే ఆధారంగా కనిపిస్తున్నాయి. కరోనా భయంతో రైనా తప్పుకుని ఉంటే.. శ్రీనివాసన్ అలా స్పందించేవారు కాదేమో! సీఎస్కే జట్టుకు సంబంధించి ప్రతి క్రికెటర్ తమకు ఒకటే అని, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదని శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు.
రైనా వెళ్లిపోయినంత మాత్రాన నష్టం లేదని, మరొకరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారని వ్యాఖ్యానించారు. అంతకన్నా తీవ్రంగా శ్రీనివాసన్ మరో మాట అన్నారు. ఇప్పుడు ఐపీఎల్ ను వదిలి వెళ్లిపోవడం ద్వారా రైనా కోల్పోయింది 11 కోట్ల రూపాయల డబ్బునే కాదని, అంతకు మించి అతడు కోల్పోయాడని అంటూ కటువుగా వ్యాఖ్యానించాడు శ్రీనివాసన్.
దీన్ని బట్టి అక్కడేదో గొడవ జరిగిందని స్పష్టం అవుతోంది. కరోనా భయం కేవలం రైనాకే కాకపోవచ్చు. మహామహులకు కూడా ఆ భయం ఉంది. మిగతా క్రికెటర్లూ దానికి మినహాయింపు కాదు. వారికి డబ్బు లేక కూడా కాదు! ఈ ఏడాది ఐపీఎల్ ఆడటం లేదని ధోనీ, కొహ్లీలు కావొచ్చు.. విదేశీ క్రికెటర్లు కావొచ్చు తప్పుకున్నా.. వాళ్లకు వచ్చే నష్టమూ లేదు! అయితే రైనా కరోనా కారణం చెప్పడం కూడా మిగతా వాళ్లతో పోలిక తెస్తోంది!
కరోనా భయం ఉంటే.. అక్కడి వరకూ వెళ్లే వాడే కాదని.. కేవలం తనకు మంచి రూమ్ కేటాయించలేదని అభ్యంతరం వ్యక్తం చేసి, ఆ విషయంలో ధోనీతో పోలిక పెట్టి, ఆ వివాదాన్ని ధోనీ వరకూ తీసుకెళ్లి, దాన్ని ధోనీ కూడా పట్టించుకోకపోవడంతో.. రైనా ఉన్నఫలంగా తప్పుకున్నట్టుగా ప్రకటించాడని వార్తలు వస్తున్నాయి.
అయితే అదే రీజన్ వల్ల రైనా తప్పుకుని ఉంటే, శ్రీనివాసన్ రెచ్చిపోయిన తీరును గమనిస్తే.. ఈ ఏడాదికే కాదు, ఇక రైనాతో సీఎస్కే ఒప్పందాన్ని రద్దుచేసుకోవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే రిటైర్మెంట్ కూడా ప్రకటించిన రైనా మళ్లీ వేలానికి వచ్చినా ఆ రేంజ్ డబ్బులిచ్చి మాత్రం వేరే జట్లు తీసుకునే అవకాశాలు కూడా తక్కువేనేమో!