అమరావతి – అటు ఇటు

అమరావతి వ్యవహారం ఇప్పుడు కోర్టులో వుంది. అందువల్ల ఆ కేసు మంచి చెడ్డలు ఇప్పుడు చర్చించడం సబబు కాదు, వీలు కాదు. సరి కాదు. కానీ అసలు అమరావతి వ్యవహారం ఏ దిశగా పయనిస్తుంది..పయనిస్తోంది…

అమరావతి వ్యవహారం ఇప్పుడు కోర్టులో వుంది. అందువల్ల ఆ కేసు మంచి చెడ్డలు ఇప్పుడు చర్చించడం సబబు కాదు, వీలు కాదు. సరి కాదు. కానీ అసలు అమరావతి వ్యవహారం ఏ దిశగా పయనిస్తుంది..పయనిస్తోంది అన్నది మాత్రం కాస్త ఆసక్తి కరమే. ఈ మేరకు సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు చలామణీ అవుతున్నాయి.

ఈ మధ్యనే ఓ విడియో చలామణీ లోకి వచ్చింది. 'పిల్లను కంటాం..పెళ్లి చేస్తాం…పెళ్లి చేసిన వాడు మగాడు కాదని తేలింది, ఏం చేస్తాం..కర్మ అనుకుని, మరో పెళ్లి చేస్తాం..మంచి మగాడిని చూస్తాం…వస్తాడు..మగాడు వస్తాడు..' అంటూ అమరావతి రైతు ఆవేశంగా మాట్లాడిన వీడియో ఇది.

అంటే ఆ రైతు ఉద్దేశంలో చంద్రబాబు అనే మగాడు మళ్లీ అధికారంలోకి వస్తాడు. అమరావతిని చేపడతాడు అనే అనుకోవాలి. నిజానికి అమరావతిని ముందుగా చేపట్టినది చంద్రబాబే. కానీ ఆయన అమరావతిని ఆలింగనం చేసుకున్నది అభిమానం తో కాదు. వ్యాపార దృక్పథంతో. అది ఆయనే పదే పదే చెబుతున్నారు. అమరావతిని అభివృద్ది చేస్తే లక్షల కోట్లు రాష్ట్రానికి వచ్చి పడేవి. అసలు నిధుల సమస్య వుండేది కాదు అని.

కానీ అలా అని ఆయన అభివృద్ది చేసారా? లేదు. అయిదేళ్లలో అరకొరగా చేసి ఊరుకున్నారు. ఆయనే కనుక వుంటే…అన్న సామెతలా, ఆయనే కనుక అమరావతిని కాస్తయినా ముందుకు తీసుకెళ్లిపోయి వుంటే వేరేగా వుండేది వ్యవహారం. అమరావతి భూములను అలా నోరు ఊరించేలా వుంచి, విజయవాడ, గుంటూరులను ప్రభుత్వ కార్యకలాపాలతో నింపడం మొదలుపెట్టారు. మాంచి బేరాల కోసం అమరావతిని అలా వుంచారు.

కానీ ఇప్పుడేమయింది. జగన్ వచ్చారు. ఆయనకు అమరావతి ఎంపిక ఎందుకో సరికాదు అనిపించింది. లేదా వికేంద్రీకరణ సబబు అనిపించింది. దాంతో అమరావతి వ్యవహారం కోర్టులోకి వెళ్లింది.  ఇరు పక్షాల వాదనులు విన్న తరువాత, సాక్ష్యాధారాలు, సహేతుక వాదనలు బట్టి న్యాయమూర్తులు తీర్పు వెల్లడిస్తారు.  అందంతా మనం చర్చించేది కాదు. దానికి నిబంధనలు అనుమతించవు. అందువల్ల మనం ఆ వ్యవహారాల జోలికి పోవడం లేదు.

కానీ కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే ఎలా వుంటుంది? ప్రతి కూలంగా వస్తే ఎలా వుంటుంది అన్నది మాత్రం సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ గా వుంది. ఇలాంటి నేపథ్యంలో ఓ పోస్ట్ కాస్త ఆలోచించేలా వుంది.

చంద్రబాబు 3 ఏళ్లలో ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసి, అభివృద్ధి చేసి ఇస్తాను  అంటే 2015 జనవరి లో ఇచ్చాం. కాయితాలలో తప్పితే నిజంగా కేటాయింపు జరగలేదు . రైతులలో ఒకరి అవసరాలు ఇంకొకరి అవసరాలతో సమం కాదు. అందరికీ ఒకే ఆర్ధిక స్థితి లేదు . కొందరు ఇప్పటికే అమ్మేసుకున్నారు. కొందరు కొనుక్కున్నారు. కొందరు అలా వుంచుకున్నారు.

ఇప్పటికే సుజనచౌదరి లాంటి వాళ్లు పార్టీ విధానాల నేపథ్యంలో మాట్లాడడం మానేసారు. తమ తమ అవసరాల నేపథ్యంలో నారాయణ లాంటి వారు అస్సలు పెదవి విప్పడం లేదు. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే వీళ్లంతా మళ్లీ పెదవి విప్పొచ్చు. లేదూ అంటే అస్సలు మాట్లాడరు.

ఇదిలావుంటే  మండలిలో 2021  march 31  అధికార పార్టీకి మెజారిటీ వస్తుంది.. జూన్ 2021 చివరి నాటికి 2/3 వంతుల మెజారిటీ ఉంటుంది. అప్పుడు చట్ట సభలలో పోరాడటం పక్కన పెట్టి ప్రభుత్వానికి ఏమి కావాలో అది చేసుకుని వెళ్తుంది.

ఒక వేళ కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుంది అనుకుందాం. వికేంద్రీకరణ తగదు అని కోర్టు చెప్పగలదేమో కానీ, అభివృద్ది చేయమని అయితే శాసించరు కదా?  ప్రభుత్వం ఆ తరహాగా ఆలోచిస్తే  దారి ఏమిటి ?  2024 నాటికి ఎన్నికలలో టి‌డి‌పి తన మానిఫెస్టో లో ఏమని చెబుతుంది. ఒకే రాజదాని అనే కదా. విశాఖ, కర్నూలు విషయంలో ఏవో కల్ల బొల్లి కబుర్లు చెబుతారు. కానీ జనం నమ్ముతారా? గతంలో అసెంబ్లీ సాక్షిగా 13 జిల్లాలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అలాగే కర్నూలు హైకోర్టు హామీ లేకుండా భాజపా ఎన్నికల మ్యానిఫెస్టో తయారుచేయగలదా?

కానీ జగన్ కచ్చితంగా వికేంద్రీకరణే తమ లక్ష్యం అని చెబుతారు. అప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులు ఏ విధంగా ఆలోచిస్తారు? ఎవరివైపు మొగ్గుతారు? ఇదిలా వుంటే 2024 దాకా రైతుల ఓపిక పట్టాలి. తీర్పు అనుకూలంగా వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా?  ఈలోగా విశాఖలో, కర్నూలులో రాజధానితో సంబంధం లేకుండా కోర్టు నిబంధనలకు లోబడి జరిగే పనులు జరుగుతూనే వుంటాయి కదా

ఖర్మగాలి మళ్లీ  చంద్రబాబు 2024 ఎన్నికలలో ఆధికారంలోకి రాకపోతే మళ్ళీ రాజధాని రైతులు ఇంకో 5 ఏళ్ళు అంటే 2029 వరకు ఆగగలరా ? ఆగే ఓపిక , పోరాటం చేసే శక్తి రైతులకి ఉందా ?  ఆల రకరకాల పాయింట్లు సోషల్ మీడియాలో చలామణీ అవతున్నాయి. వాటిలో ఆర్థిక పరమైనవి కూడా వున్నాయి. కోర్టులో కేసులు వాదించడం కోసం బలమైన లాయర్లును ఏర్పాటు చేసారు. వాటికోసం ఎవరు ఖర్చు చేస్తున్నారు. ఎంత ఖర్చు చేస్తున్నారు అన్నది పక్కన పెడితే, రైతుల నుంచి కొంత కంట్రిబ్యూషన్ తీసుకుంటున్నారు అన్న వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఎకరానికి ఇంత అని వసూలు చేసారు అన్నది ఆ వార్తల సారాశం,

ఇలాంటి నేపథ్యంలో పదే పదే నిధుల వసూలు, సమకూర్చడం అన్నది వీలు కాదు. అంతకన్నా జగన్ తో రాజీకి వచ్చి, మధ్యేమార్గంగా అభివృద్ది సాధించుకోవడం బెటర్ అనే కొత్త వాదనలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.  ఇందులో ప్రధానంగా 2 నుండి 3 వేల కోట్లు కర్చు చేసి మూడు ప్రధాన రోడ్లు ఏర్పాటు చెయ్యాలి. వెంకటపాలెం వద్ద నిర్మించ తలపెట్టిన వంతనె నిర్మాణం పూర్తి చేసి రోడ్ కనెక్టివిటీ ఇవ్వాలి.

ఇలా కొన్ని డిమాండ్లు పెట్టి, కొన్ని సంస్థలను సాధించుకుంటే బెటర్ అని, ఆ విధంగా మళ్లీ అమరావతి భూములకు రేట్లు వస్తాయని సోషల్ మీడియాలో అభిప్రాయాలు చలామణీ అవుతున్నాయి.  కానీ వ్యవహారం కోర్టు పరిథిలో వుండే సమయంలో ఇవన్నీ చర్చకు, రాజీకి సాద్యమయ్యేవి కావు. ముందు కోర్టులో పోరాడదాం. ఫలితం దక్కితే ఓకె. దక్కకపోతే అప్పుడు చూద్దాం ఈ కొత్త ప్రతిపాదనలను ఆనే ఆలోచన కూడా అమరావతి రైతులలో వుండి వుండొచ్చు.

నిజానికి కోర్టుకు వెళ్లకుండా ఇలాంటి మధ్యేమార్గం ఏదయినా టచ్ చేసి వుంటే వేరుగా వుండేదేమో? కానీ బాబు అండ్ కో సారథ్యం మరోలా వుంది. తద్వారా వ్యవహారం కోర్టులోకి వెళ్లింది. కోర్టు తీర్పుకు ముందు వెనుక కూడా అమరావతి ఒకలాగే వుంటుందా? అమరావతి రైతులు ఆశిస్తున్నట్లు మంచి మగాడు వచ్చి దాన్ని అభివృద్ధి చేస్తాడా? లేక ఉన్న మగాడితోనే రాజీకి వస్తారా? అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.

ఆర్వీ