మర్చిపోలేని ‘చండశాసనుడు’…!

'చండశాసనుడు' నిజంగానే మరణించారు. అదేంటి…నిజంగా మరణించడం, అబద్ధంగా మరణించడం ఉంటుందా? ఒక్కోసారి అలా జరుగుతుంటుంది. కొంతకాలం క్రితం అబద్ధంగా మరణించి, ఇప్పుడు నిజంగానే లోకం నుంచి దూరమయ్యారు ఒకప్పటి కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి టీఎన్‌…

'చండశాసనుడు' నిజంగానే మరణించారు. అదేంటి…నిజంగా మరణించడం, అబద్ధంగా మరణించడం ఉంటుందా? ఒక్కోసారి అలా జరుగుతుంటుంది. కొంతకాలం క్రితం అబద్ధంగా మరణించి, ఇప్పుడు నిజంగానే లోకం నుంచి దూరమయ్యారు ఒకప్పటి కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి టీఎన్‌ శేషన్‌ అలియాస్‌ చండశాసనుడు అలియాస్‌ డేర్‌ డెవిల్‌.

1990 నుంచి 96 వరకు నిజమైన చండశాసనుడిని రాజకీయ నాయకులు, పాలకులు చూశారు. ఆయన ధాటికి భయపడిపోయారు. వారిని భయపెట్టి ప్రజలను సంతోషపెట్టి 'శభాష్‌' నిపించుకున్న వ్యక్తి తిరునెల్లయ్‌ నారాయణ అయ్యర్‌ శేషన్‌ (టీఎన్‌ శేషన్‌). ఈయనది కఠినమైన విధినిర్వహణ. అవినీతిని సహించని తత్వం. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ఆయన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. 

కొంతకాలం క్రితం ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో జనం ఆయన్ని గుర్తుకు తెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. ఎప్పుడో 90వ దశకంలో కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన శేషన్‌ను ఎందుకు తలచుకున్నారు?  మొదటిది…టీఎన్‌ మరణించినట్లు అప్పట్లో వాట్సాప్‌లో ఓ సమాచారం హల్‌చల్‌ చేసింది. 'అయ్యో..శేషన్‌ పోయారా?..నిజమా?' అంటూ పాత్రికేయులు కూడా ఒకరినొకరు కనుక్కున్నారు. చివరకు అది అబద్దపు సమాచారమని తేలింది. ఆయన నిక్షేపంగా ఉన్నారని వివిధ వెబ్‌సైట్లు అసలు విషయం చెప్పాయి. ప్రముఖుల విషయాల్లో ఒక్కోసారి ఇలాంటి ప్రచారాలు జరుగుతుంటాయి. 

రెరడోది…ఏపీలో పోలింగ్‌ రోజు భారీగా ఈవీఎంలు మొరాయించడం, తెల్లవారుజాము వరకు ప్రజలు ఓట్లు వేయడం, అప్పటి సీఎం చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తూ తీవ్రంగా  ప్రచారం చేయడం, 'ఈసీ నిద్రపోతున్నదా?…మీ అధికారాలేమిటో మీకు తెలుసా?' అంటూ సుప్రీం కోర్టు  తలంటడం, ఈసీ నిస్సహాయంగా తనకు అధికారాలు చాలా తక్కువని చెప్పడం…. ఇదో కారణం.

సుప్రీం ఆగ్రహానికి ప్రధాన కారణం ఉత్తర భారతదేశంలోని కొందరు బడా నేతలు  ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేసినా, అసభ్యంగా మాట్లాడినా ఈసీ మౌనంగా ఉండటంతో అత్యున్నత న్యాయస్థానం కొరడా ఝుళిపించింది. ఆ తరువాతే ఈసీ యూపీ ఎస్పీ నాయకుడు ఆజంఖాన్‌ మీద 72 గంటలపాటు, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, కేంద్ర మంత్రి మేనకా గాంధీ మీద 48 గంటలపాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఈ సమయంలోనే తనకు తగిన అధికారాలు లేవని ఈసీ వెల్లడించి నిస్సహాయత వ్యక్తం చేసింది. ఇదంతా చూశాక  'శేషన్‌ సీఈసీగా ఉంటే ఇలా ఉండేదా' అనుకున్నారు చాలామంది. ఎన్నికల ప్రక్రియపై శేషన్‌ ఎంతటి బలమైన ముద్ర వేశారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. 

ఎన్నికల సమయంలోనే శివసేనలోని ప్రముఖ నాయకుడు 'ఎన్నికల కోడ్‌ ఉంటేనేం..మా ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాం' అన్నాడు.  శేషన్‌ ఉన్నట్లయితే ఆ నాయకుడిని  జైలుకు పంపివుండేవారు. తాము శేషన్‌కు భయపడతామని లేదంటే దేవుడికి భయపడతామని ఆయన హయాంలో కొందరు నాయకులు చెప్పారు.

ఎన్నికల కమిషన్‌ అంటే శేషన్‌ కాలంలో మాదిరిగా ఉండాలని కొంతకాలం కిందట సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. శేషన్‌ది ఏకసభ్య కమిషన్‌ మాత్రమే. అయినప్పటికీ గడగడలాడించారు. చివరకు ఆయన ధాటికి తట్టుకోలేకనే పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఈసీని త్రిసభ్య కమిషన్‌గా మార్చారు. దేశంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎన్నికల నిబంధనావళి) ను తొలిసారిగా కఠినంగా అమలు చేసిన ఘనత శేషన్‌కే దక్కింది. 

విచ్చలవిడి ధనప్రవాహాన్ని, కండబలాన్ని అణిచేసిన  ఎన్నికల కమిషనర్‌గా  పేరు తెచ్చుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారు ఎంత పెద్ద నాయకులైనా ఆయన వదిలిపెట్టలేదు. ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన హెచ్‌ఎస్‌ బ్రహ్మ ఒకసారి మాట్లాడుతూ శేషన్‌కంటే ముందున్న ఎన్నికల కమిషనర్లు ఎన్నికల ఫలితాలు ప్రకటించి చేతులు దులుపుకునేవారని చెప్పారు. శేషన్‌ పార్టీలను, నాయకులను చూసి వారికి అనుగుణంగా పనిచేసేవారు కాదు. కాని ఇప్పుడు ఇప్పుడు స్వతంత్ర వ్యవస్థ అయిన ఎన్నికల సంఘాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ మేనేజ్‌ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు సీతారాం కేసరి సంక్షేమ శాఖ మంత్రిగా, కల్పనాథ్‌ రాయ్‌ ఆహార శాఖ మంత్రిగా ఉండేవారు.  వీరిద్దరూ ఓటర్లను ప్రభావితం చేశారని,  మంత్రివర్గం నుంచి తొలగించాలని శేషన్‌ ఆనాడు పీవీకి సలహా ఇచ్చారు. ఇప్పటి ఈసీకి ఇంతటి దమ్ముందా? అభ్యర్థుల ఎన్నికల ఖర్చు విషయంలో, ప్రచారం విషయంలో శేషన్‌ కఠినంగా వ్యవహరించేవారు. ఆయన చండశాసనత్వం గురించి ఎంతైనా చెప్పుకోచ్చు. ఎన్నో ఉదాహరణలున్నాయి. 

శేషన్‌ ఎన్నికల కమిషనర్‌గా పదవీ కాలం ముగిసిన తరువాత ఇంకా సర్వీసులో కొనసాగి, సివిల్‌ సర్వీసులో అత్యున్నత పదవిగా వ్యవహరించే కేబినెట్‌ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. 1989లో ఆయన ఈ పదవిలో కేవలం ఎనిమిది నెలలే పనిచేశారు. ఎప్పటికీ గుర్తుండిపోయే డేర్‌ డెవిల్‌ టీఎన్‌ శేషన్‌.