ఏటా కార్తీకమాసంలో జంటనగరాల ప్రజలకు భక్తి విందు అందిస్తుంది భక్తీ టీవీ చానెల్. ఈ ఏడాది కూడా అదే కార్యక్రమాన్ని భారీగా చేపడుతుతోంది. భక్తిటీవీ అందిస్తున్న వార్షిక సంప్రదాయం కోటిదీపోత్సవం ఈ ఏడాది హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబరు 3 నుంచి 18వ తేదీవరకు జరగనుంది.
2012లో లక్ష దీపాల అంకురార్పణతో ఈ మహాదీపయజ్ఞం ప్రారంభమైంది. 2013 నుంచి ఆధ్యాత్మిక జగత్తులో మహోద్యమంగా కొనసాగుతోంది. భక్తిటీవీ అధినేత నరేంద్ర చౌదరి సంకల్పంతో ఏడు సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా ఈ సంప్రదాయం కార్తికంలో అందరినీ పలకరిస్తూనే ఉంది. ఆశేష భక్తజనుల మనసుల్లో చెరగని ముద్రవేసిన భక్తిటీవీ కోటిదీపోత్సవం.. ఎనిమిదోసారి అంగరంగవైభవంగా జరగనుంది.
భువిపై కైలాసాన్ని చూసినంత ఆనందం కలుగుతుంది కోటిదీపోత్సవ వేదిక చూస్తే. ఎత్తైన హిమగిరులు.. జలపాతాలు.. యోగముద్రలో సదాశివుడు.. శిఖరాలపై మహాదేవుని విభిన్నమూర్తులు.. శివలింగాలు వెరసి… కైలాసమే అనిపించకమానదు. అటువంటి మహావేదిక 2019 కోటిదీపోత్సవ వేడుక కోసం సిద్ధమవుతోంది. శంఖారావం మొదలు కార్యక్రమం సమాప్తమయ్యేంతవరకు మహాకైలాస వేదికే కోటిదీపోత్సవ రంగస్థలి.
ఈ వేదికపైనే వేదమంత్రఘోష ప్రతిధ్వనిస్తుంది. ఈ వేదికపైనే నియమ నిష్ఠాగరిష్ఠులైన జగద్గురువులు వేంచేస్తారు. ఈ వేదికపైనే సకలదేవతలూ కల్యాణోత్సవాలను జరిపించుకుంటారు. ఈ వేదికపైనే కోటిదీపాల యజ్ఞానికి నాందిగా తొలిదీపం వెలుగుతుంది. ఈ వేదికపైనే దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరిస్తారు.
కోటిదీపోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులు తరలివస్తారు. పూరీ శంకరాచార్య జగద్గురు శ్రీనిశ్చలానందసరస్వతి, ఉడుపి పెజావర్ పీఠాధిపతి శ్రీవిశ్వేశ తీర్థస్వామీజీ, బాబా రామ్ దేవ్, శ్రీగణపతి సచ్చిదానందస్వామీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీరవిశంకర్ గురూజీ వంటి ప్రసిద్ధ గురువులతో పాటు.. చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖశర్మ, గరికిపాటి నరసింహారావు వంటి ప్రసిద్ధ ప్రవచనకర్తలు విచ్చేయనున్నారు.
కోటిదీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమేకాదు… పాల్గొనే ప్రతీ భక్తుడు శివలింగానికి స్వయంగా బిల్వార్చనలు చేయవచ్చు. భస్మంతో అభిషేకించవచ్చు. రుద్రాక్షలతో పూజించవచ్చు. పసుపుకొమ్ములతో అమ్మవారిని ఆరాధించవచ్చు. సౌభాగ్యం కోసం అమ్మవార్లకు కోటి కుంకుమార్చన చేయవచ్చు. గ్రహదోషాలు తొలగేందుకు రాహుకేతు పూజలు చేయవచ్చు.
శ్రీవేంకటేశ్వరునికి ముడుపులు కట్టవచ్చు. ఐశ్వర్యాలు అనుగ్రహించమని దుర్గమ్మకు గాజులు అలంకరించవచ్చు. ఇలా ఒకటేమిటి ఇలాంటి ఎన్నో పూజలు ఈ ఏడాది కోటిదీపోత్సవ ప్రత్యేకం. పూజలో పాల్గొనే భక్తులందరికీ పూజాద్రవ్యాలు, దేవతామూర్తుల విగ్రహాలు, దీపారాధన నిమిత్తం వత్తులు, నూనె, ప్రమిదలు ఉచితంగా అందిస్తారు. ఎలాంటి రుసుములు, ప్రవేశానికి నియమ నిబంధనలు లేని ఈ ఉత్సవానికి భక్తులు కేవలం వచ్చి కూర్చుంటే చాలు జన్మజన్మల పుణ్యఫలాన్ని మూటగట్టుకుని వెళ్లవచ్చు.
అంతేకాదు, అన్నవరం, సింహాచలం, ద్వారకాతిరుమల, ఒంటిమిట్ట, మధురై తదితర క్షేత్రాల నుంచి వేంచేసిన ఉత్సవమూర్తులకు కనులపండువగా కల్యాణోత్సవం జరగనుంది. కల్యాణ ప్రసాదం కూడా అందించడం కోటిదీపోత్సవ ప్రత్యేకత.