రాశి ఫలాలు…2023

మేషం (21st మార్చ్ – 19 ఏప్రిల్) Advertisement ఈతి బాధలు, సమస్యల నుంచి కొంతవరకూ బయటే ఛాన్స్‌, మనశ్శాంతి కోసం పర్యాటక ప్రాంతాలు, ధార్మిక కేంద్రాలు సందర్శిస్తారు. ఆర్థిక విషయాలలో ఇబ్బందులు క్రమేపీ…

మేషం (21st మార్చ్ – 19 ఏప్రిల్)

ఈతి బాధలు, సమస్యల నుంచి కొంతవరకూ బయటే ఛాన్స్‌, మనశ్శాంతి కోసం పర్యాటక ప్రాంతాలు, ధార్మిక కేంద్రాలు సందర్శిస్తారు. ఆర్థిక విషయాలలో ఇబ్బందులు క్రమేపీ అధిగమిస్తారు. ఒక సందర్భంలో అనూహ్యంగా సొమ్ము అందే సూచనలు. కొన్ని శుభకార్యాలకు సైతం డబ్బు వెచ్చిస్తారు. సోదరులు, బంధువుల నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మనోనిబ్బరం తీసుకునే కొన్ని ముఖ్య నిర్ణయాలు మీకు ఉపకరిస్తాయి. సమాజసేవలో ఎక్కువగా నిమగ్నమవుతారు. మీ ఆరోగ్య పరిరక్షణ మీచేతిలోనే ఉంది. సరైన ఆహార నియమాలు పాటించండి.

ఎదురు చూస్తున్న అవకాశాలు విద్యార్థులను ఉబ్బితబ్బిబ్బు చేస్తాయి.ఇంటి నిర్మాణ యత్నాలు చివరి దశకు చేరుకుంటాయి. మొత్తం మీద ఇంటి కల నెరవేరుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఎవరి చేయూతలేకున్నా కొత్త సంస్థల ఏర్పాటు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు మునుపటి కంటే హుషారుగా, సంతోషంగా గడుపుతారు. శాస్త్ర,సాంకేతిక రంగాల వారికి మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కళాకారులకు ఏడాది ప్రారంభం, చివరిలో  అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయదారులకు రుణాలు, పెట్టుబడులు సమకూరతాయి. 

జనవరి, జూన్,ఆగస్టు, డిసెంబర్‌ నెలలు అనుకూలం, మిగతావి సామాన్యం. 

వృషభం ( 20 ఏప్రిల్- 20 మే)

వీరు శక్తికి మించి కృషి చేసినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో లేనిపోని చికాకులు. మానసిక అశాంతి. ఆరోగ్యం పై ప్రధానంగా దృష్టి పెట్టాలి. కొన్ని పరీక్షలు, వైద్య సేవలు అవసరం కావచ్చు. ఆత్మ విశ్వాసం, దృఢనమ్మకమే మీ ఆయుధాలు. ఎవరికీ తలవంచని పరిస్థితి ఉంటుంది. ఆదాయానికి సంబంధించి మొదట్లో ఇబ్బంది కలిగినా క్రమేపీ అనుకూలిస్తుంది. కుటుంబ సభ్యులు మీ పట్ల వ్యతిరేకత చూపడంతో కొంత ఆందోళన చెందుతారు. ఆదరించే బంధువులే మీపై అపవాదులు మోపే అవకాశం ఉంది.  వాహనచోదకులు మరింత అప్రమత్తత పాటించాలి. చేపట్టిన కార్యక్రమాలను ప్రతిబంధకాలు సైతం అధిగమించి పూర్తి చేస్తారు. 

ఏడాది మధ్యకాలంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. గతంలో నిలిచిపోయిన వివాహ యత్నాలు మళ్లీ ప్రారంభిస్తారు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి విశేష గుర్తింపు. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఏడాది మధ్యకాలంలో ఫలిస్తుంది. ఇంటి నిర్మాణాలకు చేసే యత్నాలను నెమ్మదిగా సాగిస్తారు.  
వ్యాపార, వాణిజ్యవేత్తలు పెట్టుబడుల కోసం కొంత శ్రమించాలి. ఉద్యోగవర్గాలకు ఆకస్మిక మార్పులు, విధుల్లో అవాంతరాలు ఉండవచ్చు. విధుల్లో అవాంతరాలు ఎదురుకావచ్చు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఒత్తిడులు ఉన్నా వీరికి ప్రాధాన్యత పెరుగుతుంది. కళాకారులకు శ్రమ పడ్డాక కొంత ఫలితం దక్కించుకుంటారు. వ్యవసాయదారులకు సామాన్యంగా ఉంటుంది. 

జనవరి, మార్చి, జూలై, సెప్టెంబర్, నెలలు అనుకూలం.మిగతావి సామాన్యం. 

మిథునం (21 మే – 20 జూన్)

ఈ రాశి వారికి ఏడాది చివరిలో  విశేషమైన కాలమనే చెప్పాలి. గతంతో పోలిస్తే అన్ని విధాలా కలసి వస్తుంది. ఇక రాబడి తగినంతగా ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. బంధువర్గం నుంచి విమర్శలు, కొన్ని ఆరోపణలు రావచ్చు. వాటిని సహనంతో భరించడం ఉత్తమం. స్నేహితులు కూడా సమయానికి రిక్తహస్తాలు చూపవచ్చు. అనుకున్న వ్యవహారాలు మరింత నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థికపరమైన హామీలు, సంతకాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో చికాకులు పెరిగి సహనాన్ని పరీక్షిస్తాయి. ఆరోగ్యం పై తగిన శ్రద్ధ అవసరం. భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు, మనస్పర్థలు రావచ్చు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎట్టకేలకు ప్రారంభిస్తారు. 

అక్టోబర్, నవంబర్‌ నెలల్లో  వివాహాది శుభకార్యాల నిర్వహణతో బిజీగా గడుపుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభనష్టాలు సమానస్థాయిలో ఉంటాయి. ఉద్యోగస్తులకు తమ విధులతో పాటు ఇతరుల బాధ్యతలు కూడా చేపట్టాల్సిన పరిస్థితి. పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలు ఉంటాయి. రాజకీయవేత్తలు క్రీడాకారులకు కొంత నిరాశాజనకమైనా తమ ఆశయాలను సాధిస్తారు. 

కళాకారులకు అవకాశాలు క్రమేపీ పుంజుకోవచ్చు. విద్యార్థులకు సామాన్య ఫలితాలు. వ్యవసాయదారులకు పెట్టుబడులు ఆలస్యమైనా అందుతాయి. 

ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు, అక్టోబర్‌ నెలలు అనుకూలం, మిగతావి సామాన్యం. 

కర్కాటకం (21 జూన్ – 22 జులై)

రాబడి ఉన్నా ఖర్చులు కూడా తట్టుకోవలసిన పరిస్థితి. చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేయడంలో కొంత వెనుకబడతారు. ఇతరుల సాయం లేకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు. ఎంతగా కష్టించినా ఫలితం నామమాత్రమే. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి సైతం ఊహించని విధంగా విమర్శలు. కుటుంబపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇదే సమయంలో కొంత మౌనం అవసరం. సంతానపరంగా ఇబ్బందులు రావచ్చు. సరైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. 

ఇంటి నిర్మాణయత్నాలు ఆగస్టు నుండి అనుకూలించే సూచనలు. వాహనాల విషయంలో మరింత అప్రమత్తత అవసరం. నిరుద్యోగులకు ఎట్టకేలకు ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు సాదాసీదాగా కొనసాగుతాయి. ఉద్యోగులకు కోరుకున్న బదిలీలతో పాటు, బాధ్యతలు కూడా తగ్గవచ్చు. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందవచ్చు. రాజకీయవర్గాల వారికి ఆగస్టు తరువాత అనుకూల పరిస్థితి. కళాకారులు అనుకున్నది సాధించడంలో శ్రమపడాలి. విద్యార్థుల కృషి కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులలో కొత్త ఆశలు చిగురిస్తాయి. 

మార్చి, మే, సెప్టెంబర్, నవంబర్‌ నెలలు అనుకూలం. మిగతావి సామాన్యం. 

సింహం (23 జులై – 22ను ఆగష్టు)

వీరు ఆర్భాటాలకు వెళ్లకుండా సాదాసీదా జీవనం సాగిస్తారు. ఎటువంటి వ్యవహారమైనా సొంత ఆలోచనలతో పూర్తి చేస్తారు. ఇతరుల పై ఆధారపడని రీతిలో ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకునే యత్నాలు సాగిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు ఎంతో ఇనుమడిస్తాయి. మీ ఆశయాలు నెరవేరేందుకు కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. వివాహయత్నాలు సఫలమై హడావిడిగా గడుపుతారు. కొంత కాలంగా చికాకు పరుస్తున్న ఆరోగ్య సమస్యలు తీరే సమయం. బంధువులతో వివాదాలు కొంతమేరకు పరిష్కారమవుతాయి. వాహనాలు, కొన్ని నగలు  కొనుగోలు చేస్తారు. 

గృహ నిర్మాణం, కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి. దీర్ఘకాలిక కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మార్చి నుండి లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో తగిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. శాస్త్ర,సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు రాజకీయవర్గాలకు జూలై, ఆగస్టులో పదవీయోగం కలుగవచ్చు. కళాకారులకు కొత్త అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. విద్యార్థుల విదేశీ యత్నాలు కలసి వస్తాయి. వ్యవసాయదారులకు లాభసాటిగా ఉంటుంది. 

ఏప్రిల్, జూన్, అక్టోబర్, డిసెంబర్‌ నెలలు అనుకూలం.  మిగతావి సామాన్యం. 

కన్య (23 ఆగష్టు – 22 సెప్టెంబర్)

అనుకున్న ఏ కార్యక్రమమైనా కొంత ఆలస్యంగా పూర్తి చేస్తుంటారు. కొందరు మిత్రుల వైఖరి కొంత ఇబ్బందిగా మారవచ్చు. ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్నా అవసరాలకు సొమ్ములు అందుతునే ఉంటాయి. బంధువులతో కొన్ని వ్యవహారాలలో విభేదిస్తారు. గత కొంతకాలంగా వెంటాడుతున్న ఒక సమస్య పరిష్కారానికి యత్నిస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగండి. కోర్టు కేసులు, ఆస్తి వివాదాల నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో కొన్ని మోసాలకు గురయ్యే వీలుంది. అప్రమత్తత అవసరం. శుభకార్యాల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మధ్యకాలంలో అధికంగా లాభాలు అందుతాయి. 

ఉద్యోగులకు పైస్థాయి వారి నుంచి ఒత్తిడులతో పాటు కొన్ని ప్రశంసలు కూడా రావచ్చు. సమర్థత చాటుకుంటూ పట్టుదలతో ముందుకు సాగండి. రాజకీయవేత్తలకు మరిన్ని ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు కొన్ని నిర్ణయాలు మార్చుకోవలసిన పరిస్థితి. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి అక్టోబర్‌ నుండి విశేష కాలం. కళాకారులకు సంతోషకరమైన సమాచారాలు అందుతూ ఉంటాయి. విద్యార్థులు మేథస్సుకు పదునుపెట్టి అవకాశాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.

జనవరి, మే, జూలై నవంబర్‌ నెలకు అనుకూలం. మిగతావి సామాన్యం. 

తుల (23 సెప్టెంబర్ – 22 అక్టోబర్)

ఆర్థిక పరిస్థితి అనుకూలమైనా రుణాలకు సైతం యత్నిస్తారు. ఇతరుల పై ఆధారపడకుండా స్వయంశక్తితో ముందుకు సాగుతారు. అయితే కొన్ని సందర్భాల్లో వివాదాలు రావచ్చు, నిదానం అవసరం. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి గట్టెక్కుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సమాజంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహన, గృహయోగాలు కలుగుతాయి. కొన్ని ఒప్పందాలతో ఆస్తులు సొంతం చేసుకుంటారు. కొత్త వాహనాల కొనుగోలు యత్నాలు సఫలం. వివాహాది శుభకార్యాలతో ఇల్లంతా సందడి నెలకొంటుంది. కాంట్రాక్టర్లకు ద్వితీయ భాగంలో  అనుకూల సమయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వ్యాపార, వాణిజ్యవేత్తలకు మరింత కలసిరాగల సమయం. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో పొరపాట్లు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలు ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. కళారంగం వారి ఆశలు కొంత ఫలిస్తాయి. విద్యార్థులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. వ్యవసాయదారులకు నూతనోత్సాహం. శాస్త్రసాంకేతిక రంగాల వారు కొత్త పరిశోధనల పై దృష్టి సారిస్తారు.

ఫిబ్రవరి, మే, ఆగస్టు, డిసెంబర్‌ నెలలు అనుకూలం. మిగతావి మిశ్రమంగా ఉంటాయి.

వృశ్చికం (23 అక్టోబర్ – 22 నవంబర్)

అదనపు ఆదాయం సమకూర్చుకోవడంలో సఫలమవుతారు. కష్టాల్లో ఉన్న వారికి చేయూత అందిస్తారు. ఇంటిలో కొన్ని వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ గౌరవానికి, ప్రతిష్ఠకు ఎటువంటి భంగం లేకుండా గడిచిపోతుంది. ఈ ఏడాది కొత్త ఉద్యోగాలు పొందుతారు. సన్నిహితులతో కొన్ని వివాదాలు వచ్చినా నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, అత్యంత ఖరీదైన భూములు కొనుగోలు చేసే వీలుంది. విదేశాలలోని బంధువుల రాక మీలో సంతోషం కలిగిస్తుంది. సోదరుల ద్వారా ఆర్థిక , మాట సహాయం అందుతుంది. విచిత్రమైన సంఘటనలు ఆకట్టుకుంటాయి. 

శాస్త్రసాంకేతిక రంగాల వారు తమ నైపుణ్యంతో అందరినీ ఆకర్షిస్తారు. వ్యాపార,వాణిజ్యవేత్తలు లావాదేవీలను విస్తృపరుస్తారు. భాగస్వాములతో సర్దుబాట్లు చేసుకుంటారు. ఉద్యోగస్తులు విధుల్లో సమస్యలను అ«ధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు విస్తృతంగా విదేశీ పర్యటనలు చేస్తారు. రాజకీయనేతలు తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. కళాకారులకు అనుకోని అవకాశాలు. విద్యార్థుల యత్నాలు ప్రారంభంలో ఫలిస్తాయి. వ్యవసాయదారులకు మిశ్రమంగా ఉంటుంది. మధ్య కాలంలో ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వైద్యుల సలహాలు స్వీకరిస్తారు.

జనవరి, మార్చి, జూలై, సెప్టెంబర్‌ నెలల్లో విశేషంగా కలిసివస్తుంది. మిగతావి సామాన్యం.

ధనుస్సు (23 నవంబర్ – 22 డిసెంబర్)

ఏ ముఖ్యమైన పని చేపట్టినా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. అలాగే, నిర్ణయాలలోనూ తొందరపాటు వద్దు. బంధువులతో  తరచూ విభేదాలు రావచ్చు. అయితే ఒక మెట్టుదిగి పరిష్కరించుకుంటారు. కొన్ని వ్యవహారాలలో కొంత త్యాగానికి  రాజీ పడక తప్పని పరిస్థితి ఉంటుంది. తీర్థ యాత్రలు సాగిస్తారు. ఆదాయవ్యయాలు సమానంగా ఉండి ఊరట చెందుతారు. కుటుంబంలో మీమాటే చెల్లుబాటుకు యత్నిస్తారు. గృహం, వాహనాలు సమకూర్చుకుంటారు. 

ఆగస్టు ప్రాంతంలో ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు విస్తరణలోనూ, కొత్త పెట్టుబడుల్లోనూ కొద్దిపాటి అవరోధాలు ఎదురై సవాలుగా మారవచ్చు. సహనం అవసరం. ఉద్యోగులకు మొదటి భాగంలో ప్రమోషన్లు వచ్చే వీలుంది. అయితే కొందరికి అధికారుల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. రాజకీయవర్గాలకు సామాన్య పరిస్థితి. కళాకారులు అవకాశాలు దక్కించుకోవడంలో శ్రమపడతారు. విద్యార్థులు, నిరుద్యోగులు చేసే కృషికి తగిన ఫలితం లభిస్తుంది.

ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై, సెప్టెంబర్‌ నెలలు అనుకూలం.  మిగతా నెలలు సాధారణంగా ఉంటాయి.

మకరం (23 డిసెంబర్ – 22 జనవరి)

కొన్ని కార్యక్రమాలు పూర్తికావడంలో కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. గతం కంటే ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉండవచ్చు. స్థిరాస్తులు కొనుగోలుకు సోదరులు సహకారం అందుతుంది. భార్యాభర్తల మధ్య కొన్ని మనస్పర్థలకు తావుంది. ఇరువురూ నిదానం పాటించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణయత్నాలు ప్రారంభంలో మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యపరమైన చికాకులు ఎదురవుతాయి. ఎటువంటి చిక్కులు ఎదురైనా పట్టుదల, చాకచక్యంగా వ్యవహరించి సర్దుబాటు చేసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ద్వితీయ భాగం నుండి లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఊహిచని మార్పులు ఉండవచ్చు. 

ద్వితీయ భాగంలో బదిలీ అవకాశాలు. పారిశ్రామికవేత్తలు, సాంకేతికవర్గాలకు సామాన్యంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఒత్తిళ్లు తప్పవు. కళాకారులు ఎవరి ప్రమేయంలేకుండా అవకాశాలు సాధిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు మరింత శ్రమిస్తే∙ఫలితం కనిపిస్తుంది. 

మార్చి, మే, ఆగస్టు, అక్టోబర్‌ నెలలు అనుకూలం. మిగిలిన నెలలు సామాన్యం. 

కుంభం (23 జనవరి – 22 ఫిబ్రవరి)

వీరికి గతం కంటే అన్ని విషయాలలోనూ మెరుగ్గానే ఉంటుంది. ముఖ్యంగా అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. ఆదాయం పెరిగి  ఉల్లాసంగా గడుపుతారు. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఈతిబాధలు, మానసిక అశాంతి వంటివి  క్రమేపీ  తొలగుతాయి. స్వతంత్ర నాయకత్వ లక్షణాలతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఏ పని చేపట్టినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా మధ్యకాలం మరింత శుభదాయకం. బంధువుల సహాయ సహకారాలు అందుతాయి. తరచూ తీర్థయాత్రలు, ధార్మిక కేంద్రాలు సందర్శిస్తారు. ప్రముఖులు మీ నైపుణ్యతను ప్రశంసిస్తారు.

ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు ఆగస్టు నుంచి అనుకూలిస్తాయి. మీతో పాటు, కుటుంబంలో కొందరి ఆరోగ్య విషయాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు అందిన పెట్టుబడులను సజావుగానే వినియోగిస్తారు. ఉద్యోగుల కలలు ఫలిస్తాయి. పదోన్నతుల కోసం నిరీక్షణ ఫలించే సమయం. పారిశ్రామికవేత్తలు ఇంత కాలం ఎదుర్కొన్న సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయనేతలు తమ సత్తా, అనుభవాన్ని చాటుకుంటారు. కళాకారులు మరిన్ని విజయాలకు చేరువగా నిలుస్తారు. విద్యార్థులు విదేశీ విద్యాభ్యాసం కోసం కృషి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యవసాయదారులు ఊహించని పెట్టుబడులు అందుకుంటారు.

ఏప్రిల్, జూన్,అక్టోబర్, నవంబర్‌ నెలలు విశేషంగా ఉంటాయి. మిగతావి మిశ్రమ ఫలితాలో కూడి ఉంటాయి. 

మీనం (23 ఫిబ్రవరి – 20 మార్చ్)

మీ చేతుల మీదుగా చేపట్టిన ఏ వ్యవహారమైనా విజయవంతమే. ఆదాయం విషయంలో లోటు  ఉండదు. దీర్ఘకాలిక సమస్యల నుండి గట్టెక్కుతారు. కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. బంధుగణంతో వివాదాలు సర్దుబాటు కాగలవు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ప్రముఖులు, ధార్మిక వేత్తలను తరచూ కలుసుకుంటారు.  తండ్రి తరఫు వారి ద్వారా కొంత  ఆస్తిలాభం ఉండవచ్చు. ఇంటి నిర్మాణంలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ద్వితీయభాగంలో వేగం పుంజుకుంటుంది. వివాహాది శుభకార్యాల రీత్యా ఖర్చులు అధికం.

డిసెంబర్‌ నెలలో ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపాలి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అధిక లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు విధులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. రాజకీయవర్గాలకు పదవులు ఊరిస్తాయి. కళాకారులకు ప్రారంభంలో సన్మాన, సత్కారాలు. అందుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులలో ఉత్సాహం పెరుగుతుంది.

మార్చి, మే, జూలై, సెప్టెంబర్, అనుకూలం.  మిగిలిన నెలలు మధ్యస్థంగా ఉంటాయి.

Vakkantham Chandra Mouli (www.janmakundali.com)