పెన్నులో ఇంకైపోయిన ద‌ర్శ‌కులు.. న‌టులుగా!

ఒక‌ప్పుడు వాళ్లు ద‌ర్శ‌క మేధావులు, తొలి తొలి సినిమాల‌తో మెరుపులు మెరిపించిన వాళ్లు, వాళ్ల‌ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు సినీ ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు కూడా, సంచ‌ల‌న విజ‌యాలు వారి ఖాతాలో ఉన్నాయి. అయితే లాంగ్…

ఒక‌ప్పుడు వాళ్లు ద‌ర్శ‌క మేధావులు, తొలి తొలి సినిమాల‌తో మెరుపులు మెరిపించిన వాళ్లు, వాళ్ల‌ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు సినీ ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు కూడా, సంచ‌ల‌న విజ‌యాలు వారి ఖాతాలో ఉన్నాయి. అయితే లాంగ్ ర‌న్ లో వారు త‌మ మార్కును నిలుపుకోలేక‌పోయారు. సంచ‌ల‌న విజ‌యాల‌ను న‌మోదు చేసిన ద‌ర్శ‌కులు ఆ త‌ర్వాత ఆ స్థాయి ఔట్ పుట్ ను ఇవ్వ‌లేక‌పోయారు. అయితే ఇండ‌స్ట్రీలో ఉన్న ప‌రిచ‌యాలే వారిని కాపాడాయేమో కానీ, అనూహ్యంగా వాళ్లు న‌టులుగా సెటిల‌యిపోతున్నారు.

ద‌ర్శ‌క‌త్వాన్ని, ర‌చ‌న‌ను పూర్తిగా అట‌కెక్కించి వాళ్లు న‌టులుగా చ‌లామ‌ణి అయిపోతున్నారు. త‌మ కోసం మంచి మంచి పాత్ర‌ల‌ను రాయ‌మ‌ని కొత్త త‌రం ద‌ర్శ‌కుల‌ను వారు కోరుతున్నారు! తెలుగులో కూడా న‌టులుగా మారిన ద‌ర్శ‌కులు కొంద‌రు ఉన్నా, ప్ర‌త్యేకించి త‌మిళ‌- మ‌ల‌యాళ భాష‌ల్లో ఇలాంటి వారు ఎక్కువ‌మంది ఉంటారు. తెలుగులో పూర్తి స్థాయి న‌టులుగా మిగిలిన ద‌ర్శ‌కుల జాబితా త‌క్కువే. వేరే ద‌ర్శ‌కుల సినిమాల్లో న‌టించిన ద‌ర్శ‌కులు త‌క్కువ‌మందే.

ఈ జాబితాలో దాస‌రి నారాయ‌ణ రావు ప్ర‌ముఖంగా నిలుస్తారు. ఎన్నో ఫుల్ లెంగ్త్ పాత్ర‌ల్లో క‌నిపించారు దాస‌రి. అయితే ఒక‌వైపు ద‌ర్శ‌కుడిగా కొన‌సాగుతూనే ఆయ‌న క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కూడా కొన‌సాగారు. త‌న శిష్యులు కొంత‌మంది తెచ్చిన పాత్ర‌ల‌ను చేస్తూ, వాటిని త‌న‌దైన రీతిలో పండిస్తూ దాస‌రి త‌న న‌ట‌నా ప్ర‌తిభ‌ను కూడా చాటారు. మామ‌గారు, హిట్ల‌ర్ వంటి సినిమాల్లో దాస‌రి చేసిన పాత్ర‌ల్లో వేరే వాళ్ల‌ను ఊహించుకోవ‌డం కూడా క‌ష్టం.

ఇక క‌ళాత‌ప‌స్వి విశ్వ‌నాథ్ చాలా లేటుగా న‌టుల‌య్యారు. త‌న ద‌ర్శ‌క‌త్వంలో త‌నే న‌టించ‌డం మొద‌లుపెట్టాకా.. వేరే ద‌ర్శ‌కుల సినిమాల్లోనూ న‌టించారు. ద‌ర్శ‌కుడిగా విశ్వ‌నాథ్ మ‌హాద‌ర్శ‌కుడే అయినా, న‌టుడిగా ఆయ‌న స‌హాయ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. డైరెక్ట‌ర్ గా సినిమాలు త‌గ్గాకా.. ఆయ‌న న‌టుడిగా ఎన్నో సినిమాలు చేశారు. ద‌ర్శ‌కుడు జంధ్యాల కూడా ఒక సినిమాతో న‌ట‌నా ప్ర‌యాణం చేశారు. అల్ల‌రి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ర‌విబాబు ఆ త‌ర్వాత న‌టుడిగా వేరే ద‌ర్శ‌కుల సినిమాల్లో చేస్తూ, అడ‌పాద‌డ‌పా సినిమాలు రూపొందిస్తూ సాగుతున్నారు. ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటాకా న‌టులు అయిన వారిలో ఎస్వీ కృష్ణారెడ్డి కూడా ముందుంటారు. త‌నే హీరోగా కూడా ఆయ‌న సినిమాలు రూపొందించారు. అయితే పూర్తి స్థాయిలో ఆయ‌న క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మార‌లేదు.

తెలుగులో ముందుగా ర‌చ‌యిత‌లుగా ప్రస్థానం ప్రారంభించిన చాలా మంది న‌టులుగా రాణించారు. ఎమ్ఎస్ నారాయ‌ణ‌, ఎల్బీ శ్రీరామ్ వంటి వాళ్లు న‌టులు కాక‌ముందు ర‌చ‌యిత‌లు.

తెలుగుకు పూర్తి భిన్నం  త‌మిళులు. అక్క‌డ ముందు ద‌ర్శ‌కులుగా సంచ‌ల‌న సినిమాలు చేసిన వాళ్లు కూడా ఆ త‌ర్వాత ఒట్టి న‌టులుగా మిగిలిపోయారు! 80 ల ప్ర‌థ‌మంలో సంచ‌ల‌న సినిమాలు రూపొందించిన భాగ్య‌రాజ్, మ‌ణివ‌న్న‌న్ లాంటి వాళ్ల‌తో మొద‌లుపెడితే అప్పుడే సంచ‌ల‌న సినిమాలు రూపొందించిన పి.వాసు, సంతాన భార‌తి వంటి వాళ్లంతా ఆ త‌ర్వాతి కాలంలో న‌టులుగా మిగిలారు.  వీరిలో భాగ్య‌రాజ్ హీరోగా, ద‌ర్శ‌కుడిగా రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణాన్ని చాలా కాలం పాటు స‌క్సెస్ ఫుల్ గా సాగించారు.

త‌న‌వైన క‌థ‌ల‌తో, త‌నే హీరోగా, త‌న దర్శ‌క‌త్వం వ‌హించుకుంటూ.. రెండు ద‌శాబ్దాల పాటు భాగ్య‌రాజ్ మంచి విజ‌యాల‌ను అందుకున్నారు. అదే స‌మ‌యంలో వేరే వాళ్ల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి కూడా ఆయ‌న వెనుకాడ‌లేదు. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న త‌న ప‌దును కోల్పోయాకా కూడా..భాగ్య‌రాజ్ వేరే ద‌ర్శ‌కుల సినిమాల్లో న‌టించారు.

భార‌తీరాజా, భాగ్య‌రాజ్ క్యాంపుల‌కు ద‌గ్గ‌రివాడే అయిన మ‌ణివ‌న్న‌న్ అయితే ద‌ర్శ‌కుడ‌నే విష‌యం తెలుగు వాళ్ల‌కు తెలిసింది త‌క్కువ‌. ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా కెరీర్ ఆరంభించిన మ‌ణివ‌న్న‌న్ త‌మిళ‌నాట కొన్ని సంచ‌ల‌న సినిమాల‌ను రూపొందించాడు. న‌టుడు స‌త్య‌రాజ్ తో అయితే మ‌ణివ‌న్న‌న్ ది స‌క్సెస్ ఫుల్ పెయిర్.  వీళ్ల‌ కాంబోలో త‌మిళంలో విభిన్న‌మైన సినిమాలు వ‌చ్చాయి. అవి తెలుగులో కూడా రీమేక్ అయ్యాయి. వాటితో క‌న్నా..త‌మిళ అనువాద సినిమాల్లో త‌న‌దైన కామెడీ టైమింగ్ తో మ‌ణివ‌న్న‌న్ తెలుగు వాళ్ల‌కు న‌టుడిగానే గుర్తుండిపోయారు. అయితే ఆయ‌న మ‌ర‌ణానికి కొన్నాళ్ల కింద‌ట కూడా ఒక సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

80ల నాటి త‌మిళ ద‌ర్శ‌కుల్లో.. భార‌తీ రాజా కూడా వేరే వాళ్ల సినిమాల్లో న‌టించాడు. కెరీర్ ఆరంభంలో కూడా ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించారు. ద‌ర్శ‌కుడిగా మెగాఫోన్ ప‌క్క‌న పెట్టేశాకా.. వేరే ద‌ర్శ‌కుల సినిమాల్లో క‌నిపించారు భార‌తీ రాజా. ఇక ద‌ర్శ‌కుడు పి.వాసు కూడా ఇదే కోవ‌కే చెందుతారు.

ఒక తెలుగు సినిమాలో కూడా ఆయ‌న విల‌న్ గా న‌టించిన‌ట్టున్నారు. క‌మ‌ల్ హాస‌న్ ద‌శావ‌తారంలో వాసు ఒక పాత్ర‌లో క‌నిపిస్తారు. ఇక క‌మ‌ల్ సినిమాల్లో త‌ప్ప‌నిస‌రిగా క‌నిపించే సంతాన భార‌తి కూడా ముందు ద‌ర్శ‌కుడే! క‌మ‌ల్ హీరోగా  న‌టించిన గుణ‌, మ‌హాన‌ది వంటి మంచి సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు భార‌తి. తెలుగులో బాల‌కృష్ణ హీరోగా కూడా ఒక సినిమా రూపొందించారు భార‌తి-వాసు. వైవిధ్య‌భ‌రితమైన ప్రేమ‌క‌థ‌ల‌ను రూపొందించిన వీళ్లిద్ద‌రూ ఆ త‌ర్వాత న‌టులు గుర్తింపు పొందారు.

వాళ్ల స్ఫూర్తే త‌మిళ ద‌ర్శ‌కుల‌ను కొన‌సాగించిన‌ట్టుగా ఉంది. 'వాలి' వంటి సంచ‌ల‌న సినిమాతో కెరీర్ ఆరంభించిన ఎస్ జే సూర్య ఇక ద‌ర్శ‌క‌త్వం త‌న వ‌ల్ల కాద‌నే ప‌రిస్థితుల్లోకి వెళ్లిన‌ట్టుగా ఉన్నాడు. కెరీర్ ఆరంభంలో సౌత్ లో సంచ‌ల‌నాలు రేపాడు ఈ ద‌ర్శ‌కుడు. వాలి, ఖుషీ వంటి సినిమాల‌తో నాటి యువ‌త‌ను ఉర్రూత‌లూగించాడు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ఉన్న‌ప్పుడే తెర‌పై క‌నిపించ‌డానికి ముచ్చ‌ట ప‌డ్డాడు సూర్య‌. ఆ త‌ర్వాత ఖుషీలో అలా క‌నిపించి, నాని త‌మిళ వెర్ష‌న్ తో హీరో అయిపోయాడు.

ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా వ‌ర‌స ఫెయిల్యూర్ల‌తో అవ‌కాశాలు త‌గ్గాయి. ఇక అదే అదునుగా పూర్తి స్థాయిలో న‌టుడు అయిపోయాడు. మ‌హేష్ బాబు సినిమా స్పైడ‌ర్ లో ఫుల్ లెంగ్త్ విల‌న్ గా న‌టించేశాడు. త‌మిళంలో హీరోగా కొన్ని సినిమాల్లో, ఇత‌ర పాత్ర‌ల్లో మ‌రి కొన్ని సినిమాల్లో న‌టిస్తూ ఉన్నాడు సూర్య‌.

ఇక ఈ జాబితాలో ఇప్పుడు వెంక‌ట్ ప్ర‌భు కూడా చేరిపోయాడు. మొద‌ట్లో వైవిధ్య‌భ‌రిత సినిమాల‌తో ఆక‌ట్టుకున్న వెంక‌ట్ ప్ర‌భు కూడా ఇప్పుడు  న‌టుడుగా సెటిల‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టున్నాడు. త‌న సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో క‌నిపించాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు త‌న‌కు మంచి పాత్ర‌లు ఇవ్వాల‌ని వెంక‌ట్ త‌మిళ ద‌ర్శ‌కుల‌కు ఓపెన్ రిక్వెస్ట్ చేశాడు. ఇటీవ‌లే వెంక‌ట్ ప్ర‌భు సినిమా ఒక‌టి ఓటీటీలో విడుద‌ల‌, పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ క్ర‌మంలో ఇంకా ద‌ర్శ‌కుడిగా త‌న‌కు ప్లాన్స్ ఉన్నాయ‌ని అంటున్నా.. వెంక‌ట్ ప్ర‌భు దృష్టి ఇప్పుడు న‌ట‌న మీదే ఉన్న‌ట్టుంది!

బాల‌చంద‌ర్ వంటి త‌మిళ ద‌ర్శ‌కుడు కూడా అప్పుడ‌ప్పుడు వేరే సినిమాల్లో క‌నిపించారు. సీరియ‌ల్స్ లో కూడా న‌టించారు. త‌న సినిమాల్లోనూ ఆయ‌న క‌నిపించారు. ఆ ప‌రంప‌ర త‌మిళ ద‌ర్శ‌కుల్లో కొన‌సాగుతూ ఉంది. ద‌ర్శ‌కులుగా స‌క్సెస్ అయితే.. ఎంచ‌క్కా న‌టులుగా వారికి అవ‌కాశాలు బోన‌స్ అవుతున్నాయి.

మ‌ల‌యాళంలోనూ ఈ ప‌రంప‌ర క‌నిపిస్తుంది. మ‌ల‌యాళంతో పాటు ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లోనూ అక్క‌డి ద‌ర్శ‌కులు ఆ త‌ర్వాత న‌టులుగా స‌త్తా చూపించారు. శ్రీనివాస‌న్, లాల్ వంటి వాళ్లు ద‌ర్శ‌కులుగా సత్తా చూపించి ఆ త‌ర్వాత న‌టుల‌య్యారు.

న‌టులుగా అనేక సినిమాలు చేసి.. ఆ అనుభ‌వంతో ద‌ర్శ‌కులుగా మార‌డం ఒక ఎత్తు. ఎంతో మంది న‌టులు కూడా సినిమాల రూప‌క‌ల్ప‌న‌ను ద‌గ్గ‌ర నుంచి చూసిన అనుభ‌వంతో, సినిమాల‌పై త‌మ‌కున్న మ‌మ‌కారంతో ద‌ర్శ‌కుల‌య్యారు. ఈ జాబితా కూడా పెద్ద‌దే. అయితే న‌టులు ద‌ర్శ‌కులు కావ‌డం ఒక ఎత్తు. త‌మ‌కొచ్చిన అనుభ‌వంతో వారు మంచి మంచి సినిమాలు చూపిస్తే ప్రేక్ష‌కుల‌కు అంత క‌న్నా కావాల్సింది లేదు. 

అయితే డైరెక్ష‌న్ తో మెరుపులు మెరిపించిన వాళ్లు ఆ త‌ర్వాత మెగా ఫోన్ ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేయ‌డం మాత్రం ప్రేక్ష‌కుల‌ను కాస్త నిరాశ ప‌రిచేదే! న‌టులుగా మారిన ద‌ర్శ‌కులకు సినిమాల్లో మంచి పాత్ర‌లు ద‌క్కి ఉండొచ్చు, ఆ పాత్ర‌ల‌ను వారే కాక‌పోయినా ఇండ‌స్ట్రీలో అప్ప‌టికే ఉన్న న‌టులెంతో మంది చేయ‌గ‌ల‌రు. ద‌ర్శ‌క‌త్వ‌మే అంద‌రికీ సాధ్యం అయ్యే ప‌ని కాదు! కాబ‌ట్టి మంచి సినిమాలు చేసిన నేర్పు ఉన్న ద‌ర్శ‌కుడు న‌టుడిగా మిగిలిపోవ‌డం ప్రేక్ష‌కుల‌కు చిన్న అసంతృప్తే!

నాలుగు దశాబ్దాల తెలుగుదేశం