మూవీ రివ్యూ: పెళ్లిసందడి

టైటిల్: పెళ్లిసందడి రేటింగ్: 2/5 తారాగణం: రోషన్ మేక, శ్రీలీల, కె. రాఘవేంద్రరావు, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, పోసాని, వెన్నెల కిషోర్, తనికెళ్ల, రఘుబాబు, ఝాన్సి, షకలక శంకర్ తదితరులు   కెమెరా:…

టైటిల్: పెళ్లిసందడి
రేటింగ్: 2/5
తారాగణం: రోషన్ మేక, శ్రీలీల, కె. రాఘవేంద్రరావు, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, పోసాని, వెన్నెల కిషోర్, తనికెళ్ల, రఘుబాబు, ఝాన్సి, షకలక శంకర్ తదితరులు  
కెమెరా: సునీల్ కుమార్ నామా
ఎడిటింగ్: తమ్మిరాజు
సంగీతం: కీరవాణి
నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
దర్శకత్వం: గౌరి రోణంకి 
విడుదల తేదీ: 15 అక్టోబర్ 2021

1996లో విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన “పెళ్లిసందడి” 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు రాఘవేంద్రరావుకి డైరెక్టోరియల్ ట్రిబ్యూట్ గాను, నటుడిగా డెబ్యూ గానూ తీసిన సినిమా ఈ కొత్త “పెళ్లి సందడి”. 

శ్రీకాంత్ తనయుడు హీరోగా ఐదేళ్ల క్రితం “నిర్మలా కాన్వెంట్” అనే సినిమా వచ్చింది. కానీ మళ్లీ “తొలిపరిచయం” అంటూ ఈ పెళ్లిసందడి టైటిల్స్ లో వేశారు. టీనేజ్ హీరోగా కాకుండా ఎదిగిన హీరోగా ఇది అరంగేట్రం అనుకోవాలనేమో. 

ఇక సినిమా గురించి చెప్పమంటే పాలు, పండ్లు, బొడ్డులు, కొబ్బరినీళ్లు, నడుములు, ఓణీలు…ఇవే తడుతున్నాయి. ఇవన్నీ దర్శకుడు రఘవేంద్రరావుకి కేరాఫ్ అడ్రస్ అని వేరే చెప్పక్కర్లేదు. దర్శకత్వ పర్యవేక్షణ ముసుగులో ఆయనే తీసారో లేక ఆయనలాగ తియ్యాలని దర్శకురాలు గౌరి తీసారో తెలియదు కానీ పాత రాఘవేంద్ర రావు శైలిని మళ్లీ పాతగానే చూసినట్టు అనిపిస్తుంది చాలాచోట్ల. 

పాత పెళ్లిసందడిలో “సౌందర్య లహరి స్వప్నసుందరి..” టైపులో ఇందులో కూడా “గంధర్వ లోకాల..” అంటూ ఒక పాట పెట్టారు. అయితే అందులో బొడ్డు పక్కన పుట్టుమచ్చ టైపులో ఇందులో ఏమీ లేదు. అక్కడ అక్కాచెళ్లల్లిద్దరూ ఒకరినే కోరుకున్నట్టు కూడా ఇక్కడ లేదు. మేకింగ్ లో పోలికలు తప్ప కథ పూర్తిగా కొత్తగా రాసుకున్నారు. కానీ అందులో కొత్తదనం లేదు. 

సుమారు 70 ఏళ్ల వయసువాడిలా కనిపించే వశిష్ట (రఘవేంద్ర రావు) తను 20-25 ఏళ్ల వయసులో ఉన్ననాటి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అంటే సుమారుగా 45-50 ఏళ్ల క్రితం నాటి కథ అనుకోవచ్చు. కానీ అదేంటో ఆ పీరియడ్ బ్యాక్ డ్రాప్ చూపించాలనే పనే పెట్టుకోలేదు. కేవలం మొబైల్ ఫోన్స్ లేకుండా చేసారు తప్ప తక్కినవన్నీ ఈ కాలం నాటి విషయాల్లాగానే ఉన్నాయి. 

చందనా బ్రదర్స్ వినైల్ ఫ్లెక్సీలు, అమరాన్ బ్యాటరీ యాడ్స్, సంగీత కంపెనీ లోగోలతో బాస్కెట్ బాల్ ప్లేయర్స్ టీ షర్ట్స్, జీన్స్ ప్యాంట్స్ అన్నీ మనకి ఆ పీరియడ్ బ్యాక్ డ్రాప్ కథలో కనిపిస్తాయి. 

ఈ అయోమయం వల్ల అసలు ఏ కాలం నాటి కథ చూస్తున్నామో కాసేపు అర్థం కాదు. 

కథలో కూడా ఎమోషనల్ సన్నివేశం ఒక్కటి లేదు. అంతా పాత రాఘవేంద్రరావు సినిమాల్లోని యాంబియన్స్, ఆ శైలి మ్యూజిక్ మీద దృష్టి తప్ప కథ ఎటు పోతోందో, పర్ఫార్మెన్సులు ఏమౌతున్నాయో పెద్దగా దృష్టి పెట్టినట్టు కనపడదు. 

గ్రాండ్ ఎంట్రీలో సీరియస్ పాత్రలో కనిపించే ప్రకాష్ రాజ్ తర్వాత తేలిపోయాడు. రావు రమేష్ కూడా ఎంత మోతాదులో నటించాలో తూకం తెలియనట్టు నటించాడు. 

రోషన్ నటన బాగానే ఉంది. డ్యాన్సులు కూడా బాగానే చేసాడు. హీరోయిన్ బొద్దుగా ఉండి రాఘవేంద్రరావు టైపు సినిమా కాబట్టి సరిగ్గా సరిపోయింది. 

ఇక కీరవాణి మ్యూజిక్ తో హోరెత్తించాడు. అసలు గ్యాప్ లేకుండా మ్యూజిక్ మోత మోగింది. బాహుబలి హ్యాంగోవర్లోంచి బయటికి రాకపోవడం వల్లనేమో హీరో రోషన్ బాస్కేట్ బాల్ ఆడే సీన్స్ కి “విజయం తథ్యమహో..అయం వశిష్ట” అంటూ సంస్కృతం పాటలు రాయించి మారీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసారు. అంత అవసరమా అనిపించేలా ఉంది తప్ప మూడ్ ఎలివేషన్ కి పనికొచ్చేలా లేదు. అలాగే పోసాని ఫ్యామిలీకి బ్యాక్ గ్రౌండ్ గా “రిచ్చు రిచ్చు రిచ్చు పిచ్చ పిచ్చ రిచ్చు” అనే లైన్స్ మాత్రం సరదాగా ఉన్నాయి. 

ఆర్ట్, కాస్ట్యూం విభాగాలు తప్ప మిగతా విభాగాలన్నీ 1990ల నాటి రాఘవేంద్రరావు దర్శకత్వశైలిని తూచా తప్పకుండా పాటించాయి.

రాఘవేంద్రరావు నటించారు అనడం కంటే కనిపించారు అంటే సరిపోతుంది. ఎందుకంటే నటించేంత పాత్ర కానీ, పరిస్థితి కానీ ఇందులో ఆయనకి లేదు. అలా అడవిలో వాకింగ్ చేస్తూ ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటారంతే. చివర్లో దీప్తి భటనాగర్ దర్శనం కూడా అవుతుంది. ఆవిడ కూడా అతిథిగా ఒక సన్నివేశంలో కనిపించింది.

1996 పెళ్లిసందడి చూసిన అప్పటి టీనేజర్స్ ఇప్పుడు 40వ పడిలో ఉన్నారు. వాళ్లకి తప్ప ఇప్పటి యంగ్ జనరేషన్ కి ఆ పెళ్లిసందడి ఏవిటో, ఆ పెరటి జాంచెట్టు గొడవేంటో తెలియదు. తెలిసినా కనెక్ట్ కారు. కాబట్టి ఈ సినిమాకి టార్గెట్ ఆడియన్స్ ఆ 40 ఏళ్లు పైబడ్డవాళ్లే. వాళ్లైనా కేవలం రెట్రో యాంబియన్స్ చూసి మురిసిపోరు. సరైన కథుండాలి, భావోద్వేగం ఉండాలి, బలమైన కామెడీ పండాలి. ఇవన్నీ లేకపోతే “పాత చింతకాయ పచ్చడి” అని ఆ ఏజ్ గ్రూప్ ఆడియన్స్ కూడా పెదవి విరిచేస్తారు.

కథపై కసరత్తు చేయకుండా, తెలుగు ప్రేక్షకులకి ఇది చాల్లే అన్నట్టుగా సగం ఉడికిన పదార్థాన్ని వడ్డించినట్టుంది ఈ 2021 పెళ్లిసందడి. 

ఈ సినిమాలో రఘుబాబు పాత్ర ఒకటుంది. ఆకలిగా ఉండి ఏదో ఒకటి తినాలనుకునే అతనికి అదని ఇదని ఊరించి చివరికి ఏదీ పెట్టకుండా కిళ్లీ ఒకటీ ఇస్తారు పెళ్లివారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల పరిస్థితికూడా అలానే ఉంది. పాటల్లో హీరోయిన్ అందాల్ని కిళ్లీ అనుకోవాలంతే. 

బాటం లైన్: పెళ్లిభోజనం లేదు- ఓన్లీ కిళ్లీ