జనసేన జిల్లా నేతలు బ్లాక్ మెయిలింగ్ కి దిగుతున్నారంటూ గ్రేట్ ఆంధ్రలో వచ్చిన కథనం ఆ పార్టీలో కదలిక తీసుకొచ్చింది. నష్టనివారణ చర్యలకు సిద్ధమైన అధిష్టానం.. బ్లాక్ మెయిలింగ్ వ్యవహారంపై విచారణ ప్రారంభించింది. కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విచారణ మొదలైంది. నెల్లూరు జిల్లాలో ఓ విద్యాసంస్థ నుంచి 25 లక్షలు డిమాండ్ చేసిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది.
జిల్లాలో పార్టీ పేరుతో ఇప్పటికే కార్పొరేట్ ఆస్పత్రులు, కొంతమంది అధికారులు, ప్రైవేట్ సంస్థలను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు విద్యాసంస్థను పాతిక లక్షల కోసం బ్లాక్ మెయిల్ చేయడం, అందులో పవన్ కల్యాణ్ పేరు వాడడాన్ని కేంద్ర కమిటీ సీరియస్ గా పరిగణిస్తోంది. డబ్బులివ్వకపోతే పవన్ కల్యాణ్ ని తీసుకొచ్చి మరీ ఆందోళనకు దిగుతామంటూ బెదిరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పుడు పార్దీ నుంచి దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి.
ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా జనసేన చోటామోటా నాయకులపై దృష్టిసారించింది అధిష్టానం. ప్రకాశం, విశాఖజిల్లాల్లో కూడా ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ కూడా కొంతమంది నేతలు జనసేన పేరుతో దందాలు చేస్తున్నారని, మాట వినకపోతే జనసేన జెండాలు తీసుకొచ్చి ఆందోళనలకు దిగుతున్నారని జనసేన కేంద్ర కమిటీకి సమాచారం అందింది. దీంతో ఆయా జిల్లాల్లో కూడా నష్టనివారణ చర్యలకు సిద్ధమైంది పార్టీ అధిష్టానం.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి సమాచారం అందించి ఆయన అనుమతితోనే విచారణ మొదలుపెట్టారు. దీనికి సంబంధించి ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ఇప్పటివరకూ జిల్లాల్లో ఎవరికీ ఎలాంటి పార్టీ పదవులు ఇవ్వలేదని, జనసేన విద్యార్థి విభాగం, లేదా అనుబంధ విభాగం అంటూ ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుల పేరుతో ప్రెస్ నోట్ విడుదల చేశారు. జిల్లాల్లో జనసేన ప్రతినిధులంటూ పత్రికా ప్రకటనలు ఇవ్వడాన్ని కూడా రాజకీయ వ్యవహారాల కమిటీ తప్పుపట్టింది. అలాంటి వారిని ఎంకరేజ్ చేయొద్దంటూ మీడియాకి విజ్ఞప్తి చేసింది.
మొత్తమ్మీద జనసేనలో కదలిక వచ్చింది. పార్టీ పేరుని, పవన్ కల్యాణ్ పేరుని చెడగొడుతున్న కొంతమందిపై వేటు వేయడానికి రంగం సిద్ధమైంది. ఇన్నాళ్లకు ఈ బ్లాక్ మెయిలింగ్ ముఠాల వల్ల జనసేన పార్టీలో కమిటీలకు పూర్తి స్థాయిలో పని దొరికినట్టయింది.