'తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సమయానికి, విభజన తర్వాత ఏపీ వాటాకు వచ్చిన అప్పుడు అక్షరాలా లక్షా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు. నాలుగు నెలల కిందట, తెలుగుదేశం పార్టీ దిగిపోయే సమయానికి మిగిలిన అప్పులు అక్షరాలా 3.62 లక్షల కోట్ల రూపాయలు' ఇదీ గత ఐదేళ్ల నిర్వాకం అని వివరించారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి ఆయన కూలంకషంగా వివరించారు. ప్రభుత్వాల విషయంలో అప్పులు చేయడం కొత్త కాదనే అనుకుందాం, అయితే చేసిన అప్పులతో ఏం చేశారనేది కీలకమైన అంశం. అప్పులు చేసి సంపద పెంచే మార్గాలపై పెట్టుబడి పెట్టి ఉంటే అదో లెక్క! అయితే చంద్రబాబు నాయుడు ఆర్థిక మేధస్సు అలా లేదు. అప్పులు చేసి ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నమే జరిగింది తప్ప మరోటి జరగలేదు. ఇదీ స్పష్టం అవుతున్న విషయం.
డ్వాక్రా మహిళలకు ఇచ్చిన పసుపు కుంకుమల మొత్తమే పది వేల కోట్ల రూపాయలు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అదంతా ఓట్ల కోసం ఆఖరి మూడు నెలల్లో సాగిన వ్యవహారం! ఒక్కో మహిళకు పది వేల రూపాయల చొప్పున పంచారు. దాదాపు పది వేల కోట్ల రూపాయలను అలా చిల్లాడారు! ఇదీ చంద్రబాబు నాయుడి పాలన.
ఇక ఆఖరి రెండు మూడు నెలల్లో ఇష్టానుసారం ఇచ్చిన కాంట్రాక్టుల విలువ నలభై రెండు వేల కోట్ల రూపాయలు! అవన్నీ బకాయిల కింద పెట్టారు. చేసిన అప్పులు గాక, అవి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు! అది కేవలం ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు జారీ చేసిన కాంట్రాక్టులు. వాటిని ఇప్పుడు జగన్ ప్రభుత్వం చెల్లించాలి. ఈ చెల్లింపులు చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం.