వారాహి, జనసేన, వీర మహిళలు, జనసైన్యం…. పేర్లు మాత్రం అద్భుతం. అయితే రాజకీయ నడవడికే అధ్వానం అని పవన్‌కల్యాణ్‌పై ప్రధాన విమర్శ. జనసేన స్థాపించిన తొమ్మిదేళ్లైనా ఇంత వరకూ పార్టీ నిర్మాణంపై పవన్ దృష్టి సారించలేదు. 25-30 ఏళ్ల ఆలోచనతో రాజకీయం మొదలు పెట్టానని ఆయన అంటూ వుంటారు. బహుశా ఆయన ఉద్దేశం పార్టీ నిర్మాణానికి అంత సమయం తీసుకుంటారని అర్థం చేసుకోవాలేమో!
సార్వత్రిక ఎన్నికలకు 18 నెలల సమయం వుంది. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. జనవరి 27 నుంచి నారా లోకేశ్ కుప్పం నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. ఏడాదికి పైగా ఆయన జనంతో మమేకం కానున్నారు. తాజాగా పవన్‌కల్యాణ్ “వారాహి” తెరపైకి వచ్చింది. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచారం చేసేందుకు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తానని అప్పట్లో పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
గత అక్టోబర్‌లో దసరా నాడు తిరుపతి నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుడతారని జనసేన అప్పట్లో ప్రకటించింది. ఆ తర్వాత ఎందుకనో వాయిదా పడింది. “వారాహి… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్” అంటూ ట్విటర్లో పవన్‌కల్యాణ్ పోస్టు చేశారు. చూడడానికి వాహనం ఆకర్షణీయంగా వుంది. మిలటరీలో యుద్ధానికి వినియోగించే వాహన మోడల్లో దీని ప్రత్యేకత.
ఈ వాహనానికి వారాహి అని పేరు పెట్టడం వెనుక గొప్ప సదుద్దేశం ఉన్నట్టు జనసేన నేతలు చెబుతున్నారు. వారాహి అంటే దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు. రాక్షసులను సంహరించడానికి దుర్గాదేవి అమ్మవారు. బ్రహ్మాది దేవతల్లోని శక్తులు మూర్తులు ధరించి వచ్చినట్లుగా 'దేవీ మహాత్మ్యం' వర్ణిస్తోంది. 1. బ్రహ్మలోని శక్తి 'బ్రాహ్మి' 2. విష్ణుశక్తి 'వైష్ణవి', 3. మహేశ్వరుని శక్తి 'మహేశ్వరి', 4. స్కందుని శక్తి 'కౌమారి', 5. యజ్ఞ వరాహస్వామి శక్తి 'వారాహి', 6. ఇంద్రుని శక్తి (ఐంద్రి), 7. అమ్మవారి భ్రూమధ్యం (కనుబొమల ముడి) నుంచి ఆవిర్భవించిన కాలశక్తి 'కాళి' (చాముణ్డా). -వీటిని 'సప్త మాతృకలు' అంటారు. ఇవి విశ్వాన్ని నిర్వహించే ఏడు రకాల మహా శక్తులు.
ఇక పవన్‌కల్యాణ్ వాహనానికి పెట్టిన పేరు వారాహి ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. వరాహశక్తి అన్న ప్రదాయిని. చేతిలో నాగలి, రోకలి ఆయుధాలు అన్నోత్పత్తిని, అన్నపరిణామాన్ని (మార్పు) తెలియజేసే సంకేతాలు. దీన్ని బట్టి జగన్‌ను జనసేనాని ఏ విధంగా పరిగణిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. జగన్ దుష్ట పాలనను అంతమొందించడానికి ఓ శక్తిగా జనంలోకి వెళుతున్న భావనను పవన్ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంతా బాగుంది కానీ, ఇప్పటికైనా ఆయనకంటూ ఓ ఎన్నికల రోడ్ మ్యాప్ వుందా? అనేదే ప్రశ్న.